Saturday, May 11, 2024

మేమే వస్తున్నాం తల్లీ... చిన్న కథ

🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱
  
  మధ్యాహ్నం వంటింట్లో ఉన్న శాంతమ్మ ఫోన్ రింగ వ్వడం విని కొంగుతో ధారగా కారుతున్న చెమట తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి సెల్ అందుకుంది. కూతురు వనజ..
" అమ్మా, ఏం చేస్తున్నావు? "
" ఈ టైంలో ఏం చేస్తాను...! వంటింట్లో ఉన్నాను.. "
" సరె సరే గానీ.. వచ్చే శుక్రవారం నాడు నేను,పిల్లలు,ఆయన అందరం వస్తున్నాం. మదర్స్ డే కదా..!"
గుండె గుభిల్లుమంది శాంతమ్మకు. ఒక్కసారి గత సంవత్సరం  మదర్స్ డే ఆమె కళ్ళ ముందు కదలాడింది. తల్లిని సంతోషపెట్టాలని కూతురు, ఇద్దరు కొడుకులు అనుకోవడం వరకు  బాగానే ఉంది గానీ.. ఆ నెపంతో పిల్లాజెల్లా తో అంతా దిగిపోయి తల్లిని మరింత హైరానా పెడుతున్నామన్న ఆలోచనైతే వాళ్లకు ఏకోశానా రాకపోవడం ఆమెకు ఎందుకో ఓ మూల బాధనిపించింది. పోయినసారి ఇలాగే ఫోన్ చేసి, తనే కాక ఇద్దరు తమ్ముళ్లకూ విషయం చేరవేసి వాళ్లనూ సమాయత్తం చేసేసింది. ఆ విధంగా అందరూ కలిసి మదర్స్ డే కి రెండు రోజులు ముందే అమ్మానాన్నల ముందు వాలిపోయారు. ఇప్పుడు మళ్లీ ఈ ఫోన్..!!
   పేరుకు తగ్గట్టే శాంతమ్మకు సహనం, దాంతోపాటు ఓపిక ఎక్కువే. విసుక్కోకుండా ఇంటిల్లిపాదికీ వండి వార్చడమే కాకుండా అన్ని సేవలు చిరునవ్వుతో చేస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఉగాది,దసరా సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు అన్నింటికీ ముగ్గురు పిల్లలు వాళ్ల పిల్లల్ని తీసుకుని రావడం ఏళ్లుగా సాగుతున్నదే. అల్లుళ్ళు, కోడళ్ళు సరే సరి..  గతేడాది నుండీ వనజ ఈ మదర్స్ డే అన్నది కొత్తగా కనిపెట్టింది. అంతటితో ఊరుకోక ఇద్దరు తమ్ముళ్లనీ ఉసిగొలిపింది. పెద్దదానిగా పుట్టింది... తనూ ఇద్దరు ఆడపిల్లల తల్లి  అయింది. కానీ ఏమాత్రం అర్థం,అవగాహన లేక తల్లిదండ్రుల శ్రమ,ఆరోగ్యం,వయసు దృష్టిలోకి తీసుకోకుండా ఇలా ప్రవర్తించడం తండ్రి నారాయణమూర్తికి ఏమాత్రం నచ్చలేదు.కానీ ఏంచేయ గలడు... కడుపున పుట్టిన పిల్లలాయే!
   అలా పోయినసారి మదర్స్ డే అంటూవచ్చారా.. తల్లికి వంటింట్లో కాస్త చేయందుకోవాలా...! అబ్బే...! ఒకరోజు సినిమా అంటూ, ఇంకో రోజు  షాపింగ్ అంటూ ఆరుగురు పిల్లల్ని ఇంట్లో వదిలేసి మూడు జంటలూ పొలోమని తిరిగి రావడం...! ఇక్కడ పిల్లలు అంతా ఇల్లు పీకి పందిరేయడం! వాళ్లను కంట్రోల్ లో పెట్టలేక తామిద్దరూ బేజారయిపోవడం!! పోనీ... బయటికి వెళ్ళిన వాళ్ళు బయటే ఏదో ఒకటి తినేసి వస్తారా  అంటే... అదీ లేదు... వస్తూనే వంటింట్లో దూరి ఆవురావురంటూ అమ్మ చేతి వంట తినేయడం...!
    మదర్స్ డే అన్నారా...! ఆరోజన్నా వంటింట్లో  చేరి కూతురు గానీ,కోడళ్లు గానీ పెద్దావిడకు సాయం చేశారా అంటే... అహ... ఎక్కడ తీరింది వాళ్ళకి! వాళ్ల షోకులు.. పిల్లల్ని తయారు చేయడాలు!అదే సరిపోయే!మగవాళ్లేమో టీ వీ కి అతుక్కుపోయారు.    సాయంత్రం ఇద్దరినీ కూర్చోబెట్టి ఓ పూలదండ ఇద్దరికీ చుట్టబెట్టేశారు. ఓ బొకే అందించి, చెరో స్వీట్ ముక్క నోట్లో కుక్కేశారు. అదీ... వాళ్ల మదర్స్ డే సెలబ్రేషన్!
 కనీసం తల్లికి ఓ చీర బహుకరించాలన్న ధ్యాస కూడా ముగ్గురు ఆడవాళ్లకు ఏకోశానా పట్టలేదు. వెళ్ళేటప్పుడు  భార్య పోరగా పిల్లలందరికి చేతుల్లో తలా ఓ ఐదొందలు పెట్టి సాగనంపారు. ఆ తర్వాత వారం రోజులు భార్య మంచానపడ్డ సంగతి ఆయన ఇంకా మర్చిపోలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా... ఎందుకో గతసంవత్సరం నుండే ఆయనలో అంతర్మధనం మొదలైంది. అరవై దాటిన భార్యను అడపాదడపా పలకరిస్తున్న అనారోగ్య సమస్యలు, ప్రయాసపడుతూ పనివత్తిడిని ఆమె ఎదుర్కొంటున్న తీరు... ఆయన్ని పరిష్కారం కోసం వెతికేలా పురికొల్పాయి. అక్కడే పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన కూతురుతో భార్య మాట్లాడటం చూశాడు. ఆమె ముఖంలో మారిన రంగుల్ని గమనించిన ఆయన వెంటనే విషయం గ్రహించాడు.తాను ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైందనిపించి, ఆ వెంటనే లేచి భార్య చేతిలో ఫోన్ అందుకున్నాడు.
" హలో వనజ,బాగున్నావా తల్లీ.."
" బాగున్నా నాన్నా... "
" ఏమిటి చెప్పు తల్లి విశేషాలు... "
" ఏమీ లేదు నాన్న.. మదర్స్ డే వస్తోంది కదా... అక్కడికి రావాలని ప్లాన్ చేస్తున్నాం. తమ్ముళ్లకు కూడా ఫోన్ చేశాను... "
" అలాగా.. కానీ వనజమ్మా, ఈసారి మేము ఇంకోలా ప్లాన్ చేశాం కద తల్లి... "
" ఏంటి నాన్న...? "
" చాలా రోజులైంది కదా... మేము ఇల్లు వదిలి బయటకి రాక.. అందుకని ఈసారి హైదరాబాద్ మేమే మీ దగ్గరకు రావాలనుకుంటున్నాం.. ఎలాగూ తమ్ముళ్లు కూడా అక్కడే ఉంటున్నారాయే.. ముగ్గురి దగ్గర ఓ వారం పాటు గడపాలని ఉంది తల్లీ... "
 అవతల కాసేపు మౌనం...!
" వనజమ్మా,.. వింటున్నావా..? "
" ఆ.. నాన్న.. వింటున్నా.. "
" రెండు రోజుల్లో బయలుదేరి వస్తాము. మాకు,మీకు ఇద్దరికీ కాస్త వెరైటీగా ఉంటుంది... ఏమంటావ్ తల్లి.."
" అ.. అ.. అలాగే నాన్న తప్పకుండా... రండి"
 తడబాటు కప్పిపుచ్చుకుంటూ అంది.
" తమ్ముళ్లకు కూడా  ఇదే విషయం చెప్పు తల్లి... ఉంటాం మరి.. "
 ఫోన్ పెట్టేశాడు నారాయణమూర్తి. భార్య మంచితనాన్ని, ఓర్పుని భరిస్తోంది కదా అని కడుపున పుట్టిన పిల్లలు సైతం ఇలా వాడుకోవడం చూసి చూసీ విసుగు పుట్టిన ఆయన ఇక రంగంలోకి దిగక తప్పలేదు. భార్యకు సహనం తప్ప చాకచక్యం, గడసరితనం మచ్చుకైనా లేవని  ఆయనకు బాగా తెలుసు మరి...
" అయ్యో అదేంటండి అలా అనేశారు.. "
 కంగారుగా అంది శాంతమ్మ.
" మరేం పర్వాలేదు లేవే.. "
" అది కాదండి,ఈ ఎండలకు మనం గడప దాటడం లేదు.. ఇప్పుడు హైదరాబాద్ అంటే.. "
" పిచ్చి మొహమా... మనం వెల్తామా పాడా...!"
" అంటే... "
" ఎక్కడికీ వెళ్ళం. ఇక్కడే.. మన ఇంట్లోనే... మనిద్దరమే... "
" మరి వాళ్ళు ఫోన్ చేస్తే... "
" అదంతా నేను చూసుకుంటాగా... వెళ్ళు..వెళ్లి వంట పూర్తి చెయ్.. ఆకలి దంచేస్తోంది... "
 చిద్విలాసంగా నవ్వుతూ తీరిగ్గా వెళ్లి మళ్లీ పేపర్ అందుకున్నాడాయన. భర్త మనోగతం అవగతమైన  శాంతమ్మ చిరునవ్వుతో వంటింటి వైపు నడిచింది. భార్య కష్టం అర్థం చేసుకునే భర్త లభించిన ఇల్లాలికి అంతకంటే అదృష్టం మరొకటుంటుందా..!!

🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱

  అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

4 comments:

  1. అంతే అలాగే చెయ్యాలి తల్లిదండ్రులు -,దైర్యం చేసి. లేకపోతే మరీ taking for granted లాగా తయారవుతోంది పరిస్ధితి.

    ఘంటాపథంగా చెప్పలేను గానీ ఎందుకనో ఈ పోస్ట్ మీరింతకు ముందు వ్రాసారని అనిపిస్తోంది. లేక ప్రతేడూ మదర్స్ డే నాడు పోస్ట్ చేస్తుంటారా. (అలా post చెయ్యడం తప్పేమీ కాదు; ఈ పరిస్ధితి గురించి ఎదుటివారికి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే)?

    ReplyDelete
    Replies
    1. ఈ కథ మొదటిసారి పబ్లిష్ చేశానండీ, రీపబ్లిష్ కాదు. Thanks for the comment.

      Delete
  2. పిల్లలొస్తే సతోషించాలె గానీ ఇలా పాలిటిక్స్ చేసి రాకుండా చేస్తారాండీ ఎవరైనా/? ఇదేమి ముందు కాలపు‌ బుద్ధులండీ బాబు తలిదండ్రులకు ? నో‌ వండర్ పిల్లలు పేరెంట్స్ని వృద్ధాశ్రమాలకు తరలించటానికి సుముఖులవుతున్నారంటే ఇలాంటి విషయాలే దోహదకారికలు కావు సుమండీ ?



    ReplyDelete
    Replies
    1. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించక భాధ్యతారహితంగా ప్రవర్తించే కొందరు పిల్లల పట్ల ఇలా లౌక్యం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి అలా రాయడం జరిగింది సర్... 🙂

      Delete