✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
" రా పార్వతీ, నిన్న రాత్రి బాగా లేటయిందనుకుంటా..."
మధ్యాహ్నం వంటకు కూరగాయలు తరుగుతున్న కమలమ్మ పక్కింటి పార్వతి రావడం గమనించి పిలిచి కూర్చోబెట్టింది.
" అవునక్కా, ఏడింటికి వస్తాడన్న డాక్టర్ ఎనిమిదింటికొచ్చాడు. గంటన్నర కూర్చున్నాం. విసుగొచ్చిందనుకో... తీరా చూస్తే, ఐదు నిమిషాలు కూడా డాక్టరు చూసింది లేదు..."
".............. "
"... నా సమస్య పూర్తిగా వినిపించుకోకుండానే మందులు రాసేశాడు. చెప్పాలనుకున్న అసలు బాధ చెప్పనేలేకపోయాననుకో...నాలుగు రకాల టాబ్లెట్స్, ఓ టానిక్ రాసిచ్చాడు. ఇంకా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ అంటూ ఏవేవో టెస్టులు చేయించమని రాసిచ్చాడు అదనంగా. టెస్టులు అయ్యాక మందులు తీసుకోవాలా అంటే పర్వాలేదు ఇప్పుడే తీసుకోండి అన్నాడు... "
ఎంత బాధ పడిందో ఏమో, ఒక్కసారిగా చెప్పేసి ఛెయిర్ లో కూర్చుండిపోయింది. ఉస్సురనిపించింది కమలమ్మకు. రెండు నెలలుగా పార్వతికి ఒంట్లో నీరసం, ఒకటే అలసట...! ఏ కాస్త పని చేసినా కాసేపటికే చేతకాకుండా కూర్చోవాలనిపిస్తుందట. చూసి చూసి ఎంతకీ తగ్గక, నిన్న భర్తతోపాటు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది.. అదీ సంగతి!
ఇది ఒక్క పార్వతి మాటేకాదు.. ఈ మధ్యకాలంలో చాలామంది నోట వినిపిస్తున్నదే ! ఆమె మాటలు విన్నాక కమలమ్మకు కొద్ది రోజుల క్రితం దినపత్రికలో ఓ మంత్రిగారన్న మాట గుర్తొచ్చింది.
" మీ వద్దకు వచ్చే పేషెంట్లను కస్టమర్లుగా భావించకండి!"
ఒకానొక సందర్భంలో ఆయన అన్నమాట అది ! డాక్టర్లను విమర్శించడం కాదు గానీ... ఎక్కువ శాతం జనాల అభిప్రాయం ఇలాగే ఉంటోన్నదన్నది వాస్తవం.250/- నుండి 500/- దాకా కన్సల్టింగ్ ఫీజు పుచ్చుకుంటున్నారు.. వారిపై ఎంతో నమ్మకంతో, మరింత ఆశతో వెళ్లే పేషంట్ అనారోగ్య సమస్య సహనంగా వినడం వారి ధర్మం.. అంత టైం మాకు ఎక్కడుంటుంది అన్నట్లుంటారు...అదలాగుంటే... కొందరైతే, ఏ చిన్న సమస్య కోసం వెళ్లినా వెంటనే టెస్టులు చేయించాలంటూ చీటీ రాసేస్తారు.BP, షుగర్ ఉన్న పేషెంట్లకయితే ప్రతి మూడు లేదా నాలుగునెలలకూ చేయించాలంటారు. అప్పుడే అవసరమా అంటే...మీకోసమే కదా అంటారు. ఇంకా, వాళ్లు రాసే మందులు వాళ్ల వద్ద ఉన్న మెడికల్ షాపులోనే తప్ప మరెక్కడా దొరకవు..! బాగా వయసు మీద పడ్డవాళ్ళు ప్రతిసారీ అలా అన్ని పరీక్షలూ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. వారి వెంట సహాయకులు ఒక్కరైనా తప్పనిసరి.
ఈమధ్య కమలమ్మ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి వెనుకాడుతోంది. ఏ శారీరక బాధ తలెత్తినా, ముందుగా ఠక్కున గుర్తుకు వచ్చేది డాక్టర్లే...
"ఏదో నలతగా ఉంది. డాక్టర్ దగ్గరికెళ్ళాలి బాబూ..." అనుకుంటాం. అంతటి గొప్ప స్థానం వాళ్ళది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఆ నమ్మకం చెక్కు చెదరక నిలిచి ఉండేది అందరి మనసుల్లో. కానీ.. ప్రస్తుతం అయితే పరిస్థితి భిన్నంగా మారిపోయిందని అనిపిస్తుంది ఒక్కోసారి.
ఏది ఏమైనా, ధన్వంతరి వారసులు.. ధరణి లోన దేవతలుగా కీర్తింపబడుతున్న వైద్యులు సంపాదన ధ్యేయంగా కాకుండా సేవా దృక్పథంతో కూడా ఉంటే బాగుంటుంది. చాలా కొద్ది శాతం మాత్రమే అలా ఉంటున్నట్టుగా గమనిస్తుంటాం. వారికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. (12.5.2022న 'వైద్యోనారా యణో హరి' అన్న పేరుతో ఇదే విషయంపై నా బ్లాగులో ఓ పోస్ట్ రాశాను )
డాక్టర్ అవ్వాలన్న ఆశ, దృఢ సంకల్పం కొందరు విద్యార్థుల్లో ప్రగాఢంగా ఉంటుంది. ఎంతో కష్టపడి, శ్రమకోర్చి...గమ్యం చేరాక, కొంతలో కొంత సేవాభావాన్ని కూడా అలవర్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. రోగులకు వైద్యుల పట్ల విశ్వాసం సడలకుండా, గౌరవభావం పెరిగేలా చేస్తుందీ స్వభావం...
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
వ్యాపార సంస్కృతి బాగా కమ్మేసిన ఈ రోజుల్లో ఇలా కాక మరింకెలా వుంటారు?
ReplyDeleteబాలాంబ గారి లాంటి doctors తరం, ఆ విలువలు వేగంగా అంతరించి పోతున్నాయి. ఎందుకొచ్చిన బ్లాగుశోష.
నిజమేనండీ. ఆతరం వారి విలువలు ఇప్పుడెక్కడున్నాయి !
Delete