Wednesday, July 19, 2023

పుట్టిల్లు...కథ...

🌺                                  ~~ యం.ధరిత్రీ దేవి ~~

  ఆరోజు అలివేలమ్మ పెద్దకూతురు అనసూయ కొడుకు నామకరణం. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడు. అందుకని మరీ ప్రత్యేకం...ముఖ్యంగా అలివేలమ్మకు.
     బంధుమిత్రుల సమక్షంలో కార్యక్రమం పూర్తయి భోజనాలయేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. మూడు గంటల తర్వాత... అనసూయ, ప్రభాకరం ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. సుభద్ర ఇద్దరికీ బొట్టు పెట్టి కొత్త బట్టలు పెట్టింది. ఇద్దరూ వెళ్లి కట్టుకుని, తయారై వచ్చారు. ఇద్దరికీ ఒడి బియ్యం పెట్టాక ముత్తయిదువలందరూ ఆశీర్వదించి హారతి పాట పాడి ముగించారు. సాయంత్రానికంతా సందడి సద్దుమణిగింది. 
     అలివేలమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పెద్ద కొడుకు నారాయణరెడ్డి భార్యే సుభద్ర.పెళ్లయి ఎనిమిదేళ్లయింది . ఆమె కోడలిగా ఇంట అడుగు పెట్టాక  నాలుగేళ్ల వ్యవధిలో మరిదికి, ఆడపడుచుకూ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరూ సంవత్సరం తిరిగేసరికల్లా బిడ్డల్ని ఎత్తుకున్నారు. కానీ అదేమిటో... సుభద్ర కడుపు మాత్రం పండలేదు. అందరు  దేవుళ్లకూ మొక్కుకుంది. పూజలు,  నోములూ నోచింది. డాక్టర్ల దగ్గరకెళ్ళి  ఇద్దరూ  చూపించుకున్నారు. ఏ లోపం లేదన్నారు. ఎదురు చూడాలి...అంతే.. అనుకున్నారు ఇద్దరూ. మనసులో ఏమీ పెట్టుకోక, ఇంట్లో తిరుగాడే పిల్లలతోనే అచ్చట ముచ్చటా తీర్చుకుంటూ కాలం గడుపుతూ ఉంది  సుభద్ర. 
     కానీ... అమ్మలక్కలూరుకుంటారా...! 
" ఏమిటో పాపం! సుభద్ర ! ఇన్నేళ్లయినా ఇంకా నీళ్లోసుకోలేదు... దేవుడింకా దయ తల్చలేదు మరి!!"
 సానుభూతులు చూపిస్తున్నట్టే ఉంటుంది. సుభద్రకు ముల్లు  గుచ్చినట్లుంటుంది. వినీ వినీ విసుగొచ్చి వాళ్ల మాటలు పట్టించుకోవడం మానేసింది... కానీ.. బయటి వాళ్ల పోరు బయటే  ఉంటుంది.. ఇంట్లో అత్తగారంటూ ఒకరున్నారాయె ! ఆవిడ ఎత్తి పొడుపులు, ఈసడింపులు ఈ మధ్య భరించడం ఆమె శక్యం గావడంలేదు. భర్త మంచివాడే. తనంటే ఇష్టమే. కానీ ఎప్పుడూ తల్లి కనుసన్నల్లోనే ! పెళ్లయ్యాక భార్య అన్నది కూడా మనిషేననీ, ఆమెకూ ఇష్టాఇష్టాలుంటాయనీ మనసుకు పట్టని వాడు. స్వయంగా ఏ నిర్ణయాలు తీసుకోలేని అశక్తుడై అన్నీ తల్లికే వదిలేస్తుంటాడు. తల్లిని గౌరవించడం మంచిదే. కానీ మరీ సొంత అభిప్రాయమన్నదే లేకపోవడం సుభద్రకు బాధ కలిగించే విషయం...
      సుభద్ర ఏడెనిమిదేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకో  కొడుకు. పెళ్లయిపోయింది. ఉన్న ఊర్లోనే ఉన్న పొలం చూసుకుంటూ ఉంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు. బొటాబొటీగా వచ్చే ఆదాయం ! ఇటీవలే  సవతి తల్లి కూడా చనిపోయింది...అక్కడ పరిస్థితులు అలా ఉంటే...సుభద్రకు పుట్టింటి నుండి  పెట్టుబోతలు, జరుగుబాట్లు ఎలా సాగుతాయి ! చిన్న కోడలు కలిగినింటి  నుండి వచ్చింది. అనుక్షణం ఆమెతో పోలుస్తూ, పెద్ద కోడల్ని ఎద్దేవా చేయడం... సూటిపోటీ మాటలనడం...! వయసుకు పెద్దదే గానీ, పెద్దరికం ఏమాత్రం లేని ఆడది! అయినా.. అన్నీ చేయాల్సింది మాత్రం సుభద్రే ! చిన్న కోడలు ఎప్పుడూ పుట్టింట్లోనే ! ఏడాదిలో ఏ రెణ్ణెల్లో అత్తారింట్లో గడిపేస్తూ ఉంటుంది. ఏదో చేసే వాళ్ళకే మొట్టికాయలన్నట్టు... సుభద్రకు అత్తగారి పోట్లు తప్పడం లేదు. 
                  **            **          **
  కార్యక్రమాలన్నీ అయిపోయాయి. మరుసటి రోజు, 
" వెళ్లొస్తాం అత్తా, వస్తాం బావా , "
 ప్రభాకరం భార్యాపిల్లలతో తన ఊరికి బయలుదేరుతూ అందరికీ చెప్పాడు. సుభద్ర వైపుతిరిగి, 
" వెళ్ళొస్తామమ్మా  సుభద్రా.. "
 అంటూ ఆప్యాయంగా చూస్తూ, 
"...ఏమిటో బావా, చెల్లెమ్మను తీసుకుని మా ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకూ  రాలేదు నువ్వు.. "
నారాయణతో నిష్టూరంగా అన్నాడు. మౌనమే నారాయణ సమాధానమైంది. చిన్నల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్దగా మాట్లాడే స్వభావం కాదు. ప్రభాకరమేమో మంచి మాటకారి. 
    ప్రభాకరానికి సుభద్ర అంటే లోలోపల ఏదో తెలియని ఆపేక్ష. అతనికి అక్కాచెల్లెళ్లు లేరు. సుభద్ర కంటే ముందుగానే ఈఇంటి అల్లుడైనాడతను.తర్వాత కొన్ని నెలలకే అలివేలమ్మ పెద్దకొడుకు నారాయణరెడ్డికి పెళ్లయి సుభద్ర ఆఇంటి పెద్దకోడలయ్యింది. అప్పట్నుంచీ గమనిస్తున్నాడామెను...తను ముగ్గురు పిల్లల తండ్రయ్యాడు.. ప్రతీసారి తనకేకాకుండా చిన్నల్లుడికీ, చిన్నకూతురికీ అలివేలమ్మ ముత్తయిదువు కానందుకు సుభద్రే తన చేతుల్తో బట్టలు పెట్టడం,ఇంటి అల్లుళ్లుగా ఇతర అన్ని మర్యాదలూ చేయడం చూస్తున్నాడు. ఎప్పుడూ ఆమె తన పుట్టింటికి వెళ్లడం తను చూడలేదు ప్రభాకరం. ఇంట్లో బండెడు చాకిరీ ఆమె నెత్తిమీదే!అంత చేస్తున్నా ఏమాత్రం గుర్తింపుకు నోచుకోని వైనం కూడా అతని దృష్టికి రాకపోలేదు. తన పెళ్లయి, ఇంటికి అల్లుడైన కొద్దిరోజుల్లోనే అత్తగారి నైజం అతను గ్రహించాడు. ఏంచేయగలడు ! తనేమో ఇంటి అల్లుడు.ఇంటి కోడలి గురించి అత్తగారి వద్ద ప్రస్తావించలేడు గదా !!
    మరోసారి అత్తగారికి చెప్తూ కాళ్లకు దండం పెట్టి, సెలవు తీసుకున్నాడు.తర్వాత కాసేపటికి చిన్నకూతురు,అల్లుడు, టౌన్లో పనుందంటూ చిన్నకొడుకూ వాళ్ళవాళ్ళ కుటుంబాలతో వెళ్లిపోయారు. ఇంట్లో ముగ్గురే మిగిలారు. 
                 **            **           **
    రెండేళ్లు పరుగులు తీశాయి. అతిమామూలుగా సాగిపోతున్న సుభద్ర దినచర్యలో ఏదో చిన్న మార్పు గోచరించింది. వారం, పదిరోజులుగా ఒంట్లో నలతగా ఉంటూ తిండి సయించక ఇబ్బంది పడుతూ ఉంది. రెండు వారాలు గడిచినా తగ్గకపోవడంతో ఎప్పుడూ చూపించుకునే డాక్టరమ్మ దగ్గరికెళ్లింది....
" నిజమా ! కలగాని కంటున్నానా...!"
అన్ని వివరాలూ కనుక్కుని, పరీక్షించి డాక్టర్ చెప్పిన విషయం విని ఉబ్బి తబ్బిబ్బయిపోయింది సుభద్ర. అసలు ఈమాట వినడానికి నోచుకుంటానా అని ఎన్నోసార్లు అనుకుంటూ కుమిలిపోయిన ఆమె హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కింది. వెంటనే వెళ్లి భర్తతో తన సంతోషం పంచుకోవడం కోసం ఆమె మనసు పరుగులు తీసింది. శుభవార్త విన్న నారాయణ సుభద్ర కళ్ళనుండి ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ,  
" మనం ఎదురుచూసిన రోజు వచ్చింది. ఇక కన్నీళ్ళన్నవి ఉండకూడదు..."
అంటూ దగ్గరకు తీసుకున్నాడు. 
              **             **           **
   విషయం అందరికీ తెలిసింది. అలివేలమ్మలో ఆశించినంత ఆనందమయితే కనిపించలేదు. బహుశా... ఆమె మనవళ్ళు, మనవరాళ్ల  ముచ్చట అప్పటికే తీరిపోయి ఉండడం కారణం కావచ్చునేమో ! మరోవైపు...పెద్దకొడుకు...ఇంటి భారమంతా మోస్తున్న వాడు.. ఇన్నేళ్లకి తండ్రి కాబోతున్నాడని తెలిసి ఓవైపు సంబరపడినా... కోడలి వల్ల వాడికి  ఏముచ్చట్లూ తీరవే అన్నది ఓ మూల ఆమె బాధ.
    ఐదవనెల వచ్చేసింది... సీమంతం చేయవలసిన సమయం! అత్తగారి నసుగుడు మొదలైంది. సుభద్ర ఏమి చేయగలదు! తండ్రిని చిన్నప్పటినుంచీ చూస్తోంది. ఏ బాధ్యతలూ  మోసుకోని మనిషి! తమ్ముణ్ణి నోరు విడిచి అడగలేదు కదా, నాకు సీమంతం చేయమని ! తనకు తెలిసి పుట్టింటి వారే కాదు... అత్తింటి వారూ కోడళ్ళకు సీమంతాలు చేయడం చూసింది...అత్తకు ఆ విషయం తెలియదా ఏమి ! కానీ.. తన అత్తకు ఆ  ఆలోచన రాకపోవడం తన ఖర్మ ! ఆమె నుంచి అంత ఆశించడమూ అత్యాశేలే... అనుకుంది తనలో తాను.
    చూస్తుండగానే తొమ్మిదోనెల  నెల ప్రవేశించింది. నిండుగా ఇంట్లో తిరుగుతున్న భార్యను చూస్తున్న నారాయణకు ఎంతో తృప్తిగా అనిపిస్తున్నా... ఏదో బాధ కూడా ఓవైపు తొలిచేయసాగింది. చిన్నప్పటినుంచీ తల్లికి ఎన్నడూ ఎదురు చెప్పే అలవాటులేదతనికి. పైగా... బొత్తిగా నోట్లో నాలుక లేని మనిషి ! 
      ఖర్చుకు వెనుకాడే రకం కాదు.  వాస్తవానికి...  భార్యను కాన్పుకు ఎక్కడికీ పంపడం ఇష్టం లేదతనికి. మొదటిసారి...అదీ ఎన్నో ఏళ్ళకి ! తానే దగ్గరుండి చూసుకోవడం అవసరం కూడా. కానీ...తల్లి ముభావం, ప్రవర్తన అతన్ని ఇరకాటంలో పడేస్తోంది. కాన్పులు, పురుళ్ళు అంటే పూర్తిగా ఆడవాళ్ళతో ముడివడిఉన్న వ్యవహారాలు మరి ! కొద్దిరోజులుగా రేయింబవళ్లు ఇదే ఆలోచిస్తూ సతమతమౌతూ ఉన్నాడు. 
     ఆసాయంత్రం...ఇంట్లో పనిలో ఉన్న సుభద్రకు బయట పొరుగింటి వాళ్ళతో అత్తగారంటున్న మాటలు ఎంత వద్దనుకున్నా వచ్చి చెవిలో పడ్డాయి. 
" ఏమిటోనమ్మా.. ! తొలికాన్పు పుట్టింట్లో పురుడు పోసుకోవడం ఆనవాయితీ...మాకా అదృష్టంఎక్కడిదీ!
మాకు తప్పేలా లేదు..."
ఆవిడ ఈసడింపు మాటలు అలవాటైనవైనా ఎందుకో ఈసారి మనసు చివుక్కుమంది సుభద్రకు. ఏదైతే అదయింది...అనుకుంటూ...ఆరాత్రి భర్త ఫోన్ తీసుకుని తమ్ముడితో మాట్లాడింది. 
"" కృష్ణా, నాన్న ఉన్నాడా? "
" లేడక్కా, పక్క ఊర్లో జాతర...వెళ్ళాడు.."
".............. "
" చెప్పక్కా "
తటపటాయిస్తూ, 
" ఏమిలేదు...నాకు తొమ్మిదోనెల వచ్చేసింది... "
".............."
" అదే...కాన్పుకు మనింటికి రావాలనుకుంటున్నా... "
ఆరెండు మాటలూ అనడానికి ఎక్కడలేని శక్తి పుంజుకోవాల్సి వచ్చింది సుభద్రకు...ఓవిధంగా మనసు చంపుకుని ! నవనాడులూ కుంగిపోయాయి. 
"ఔనక్కా...నేనూ అదే అనుకుంటున్నా...వారం పదిరోజుల్లో వీలు చూసుకుని వస్తా, నిన్ను పిల్చుకురావడానికి... "
ఊహించని జవాబు ! ఒక్కసారిగా నోట మాట రాలేదు సుభద్రకు ! 
"...ఒక్క నిమిషం... "
"..........."
"..ఆ...వచ్చే సోమవారం అక్కా..మంచిరోజు...వస్తా. రెడీగా ఉండు "
ఫోన్ పెట్టేశాడు. మూతి తిప్పుకుంది అలివేలమ్మ. తల్లి గొణుగుడు  నుంచి తాత్కాలికంగా కాస్త ఉపశమనం లభించినట్లయింది నారాయణకు. ఆరోజు కోసం ఎదురు చూడసాగింది సుభద్ర.
                **               **             **
  రానే వచ్చింది ఆరోజు.  ఉదయం తొందరగా లేచి, పనులన్నీ ముగించుకుంది. టిఫిన్ అయ్యాక, మధ్యాహ్నానికి వంట కూడా చేసేసింది. రాత్రే  బట్టలు సర్దేసుకుంది. పది  దాటింది. తమ్ముడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.  భార్యలో  అంత సంతోషాన్ని ఎన్నడూ చూడని నారాయణ కూడా ఆమెను చూస్తూ సంబరపడ్డాడు.పన్నెండు దాటింది...ఒంటిగంట కూడా దాటింది. తమ్ముడు రాలేదు. సుభద్ర మొహంలో నీలినీడలు కమ్ముకున్నాయి. అంతా భోంచేశారు. సుభద్ర కూడా ఏదో తిన్నాననిపించి నీరసంగా పక్క మీద వాలిపోయింది. నాలుగు దాటుతుండగా ఫోన్ రింగయింది. దిగ్గున లేచింది సుభద్ర. వాడే...!తమ్ముడే...అనుకుంటూ..! నారాయణ ఫోన్ తీశాడు.
" హలో,  కృష్ణా.. "
" ఆ, బావా... "
"...చెప్పు "
"... మేము హాస్పిటల్ లో ఉన్నాము. మా మామకు.. అదే... రాజీ వాళ్ళ నాన్నకు హార్ట్ ఎటాక్! ఉదయం ఫోన్ వచ్చింది. అందరం వచ్చేశాం... మీరు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారని ఫోన్ చేస్తున్నా...అక్కకు కూడా  చెప్పు..."
ఫోన్ పెట్టేశాడు... మళ్లీ ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. ఆ పరిస్థితుల్లో తాను అడగడం బాగుంటుందా ! నారాయణ సందిగ్ధం ! వాకిలి వద్ద నక్కి అంతా వింటున్న అలివేలమ్మ, 
" అనుకుంటూనే ఉన్నా.. అనుకున్నంతా అయింది..."
గొణుగుడు  మొదలైంది మళ్ళీ...ఉత్సాహంగా లేచిన సుభద్ర ఒక్కసారిగా మంచం మీద కూలబడిపోయింది. ఆమె వద్దకు రాబోయిన నారాయణకు ఇంటి ముందు ఆగిన ఆటో కనిపించింది. శబ్దం విని అలివేలమ్మ బయటకు తొంగి చూసింది. ఇద్దరికీ పెద్దల్లుడు ప్రభాకరం, అనసూయ ఆటో దిగుతూ కనిపించారు.
" ఇప్పుడెందుకొస్తున్నారబ్బా!"
 అనుకున్నారిద్దరూ వాళ్లను చూడగానే...
" బావా,  ఇంట్లోనే ఉన్నావా... మంచిదే."
అంటూ ప్రభాకరం లోపలికి వచ్చాడు. ఐదు నిమిషాల తర్వాత మంచినీళ్లు తాగుతూ, 
" ఏమీ లేదు బావా, ఇప్పుడిలా ఎందుకొచ్చామా... అనుకుంటున్నారు కదూ.. ! మరేమీ లేదు బావా మీరు అనుమతిస్తే సుభద్రను కాన్పుకు  మాఇంటికి పిల్చుకెళ్లాలనుకుంటున్నాము..."
అంటూ అత్తగారి  వైపు చూశాడు. ఆవిడ ఒక్కసారిగా వినకూడని మాటేదో విన్నట్లు మొహం పెట్టింది. నారాయణకు అతను అంటున్నదేమిటో వెంటనే అర్థం కాలేదు. అలివేలమ్మ తేరుకుని, 
" అదేంటయ్యా, మీరు పిల్చుకెళ్లడమేమిటి ! "
అంది ప్రశ్నార్థకంగా. 
" ఏమత్తా, నాకా అర్హత లేదా ! నన్ను అన్నా అని పిలుస్తుంది. నాకు చెల్లెలే  కదా మరి! అల్లుడంటే మర్యాదలు, పెట్టుబోతలూ స్వీకరించేవాడు మాత్రమేనా ! ఎన్నోసార్లు ఆమె చేత్తో నాకు కానుకలు అందించింది. ఆమెకీమాత్రం నేను చేయడం కూడదా!ఏమత్తా !"
".............."
 తనకూ, తన బిడ్డలకు, అల్లుళ్లకూ,వాళ్ళ  పిల్లలకూ కోడలు చేయాలి... కోడలిదాకా వచ్చేసరికి... మాకేం సంబంధం? పుట్టింటి వాళ్ళు కదా చూసుకోవాలి అవన్నీ...! అనే బాపతు ఆవిడ ! 
"...అది సంప్రదాయం కదా అనొచ్చు మీరు... నిజమే.. కానీ..అదే సంప్రదాయం కోడలికి ఎందుకు వర్తించదు !అల్లుడు, కోడలు...ఇద్దరూ పరాయింటి నుంచి వచ్చినవారే...ఈ బేధభావమెందుకు? "
"అవునమ్మా, నాతో చాలాసార్లు అన్నారీయన...సుభద్రకు కాన్పు మనమే చేద్దాం అనసూయా.. అని.. వదినకు మాత్రం ఎవరున్నారు!" 
" నువ్వుండవే,   అది కాదు బాబూ, తొలి కాన్పు పుట్టింట్లో చేయడం ఆనవాయితీ కదా అని..."
" చెల్లెలికి అన్న ఇల్లు పుట్టిల్లు అవదా అత్తా ! చెల్లెలి చేత అన్నీ పెట్టించుకోవడమేనా అన్న  పని! ఈ చెల్లెలికి నేనేమీ ఇవ్వకూడదా! చేయకూడదా!ఏమత్తా!అల్లుడు మర్యాదలందుకోవడానికీ...కోడలు అందరికీ చాకిరీ  చేయడానికేనంటావా ! అయినా అత్తా, పుట్టిల్లు అంటే పుట్టి పెరిగిన ఇల్లే అవాలా!... ప్రేమ, అభిమానం ఉన్నచోటు ఏదైనా అది ఆడపిల్లకు పుట్టిల్లే అత్తా.. "
అలివేలమ్మ ఇంకేం మాట్లాడగలదు !!
" ఏం బావా, చెప్పు. చెల్లెమ్మను నాతో పంపిస్తావా... "
దిగ్భ్రమ నుండి బయటపడ్డ నారాయణ, ఆలోచనలో పడిపోయాడు. కృష్ణ గుర్తొచ్చాడతనికి. అతను ఖచ్చితంగా వస్తాడా ! సందేహమే ! వచ్చినా...సుభద్ర కక్కడ ఆదరణ మనస్ఫూర్తిగా అయితే ఉండదు.  ఆతమ్ముణ్ణి నోరు తెరిచి అడిగింది సుభద్ర. కరుణాకరం బావ తనకుతానుగా భార్యతో కలిసివచ్చి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. భార్యకిప్పుడు కావలసింది ఇలాంటి మనుషులే. తన ఆసరా ఎలాగూ ఉంటుంది.ప్రసవ సమయంలో ఆడపిల్లకు తన వాళ్లంటూ ఉంటే అదో భరోసా.అయినా...కృష్ణ గురించి ఓమాట చెప్తే బాగుంటుందనిపించి, 
" అది కాదు బావా, ఈరోజు కృష్ణ వచ్చి పిల్చుకెళ్తానని చెప్పాడు. కానీ, అనుకోకుండా వాళ్ళ మామ ఆసుపత్రిలో చేరాడట ! అందుకని రాలేకపోయానని ఫోన్ చేశాడు....."
" మరేమీ పర్వాలేదులే బావా, కృష్ణకు నేను నచ్చజెప్తాను. నువ్వు మాత్రం నాకోరిక కాదనకు..."
"అలాగే బావా,తప్పకుండాతీసుకెళ్ళు..నీమాట కాదన లేను."
ఇంకా మాట్లాడితే ఆయన్ని బాధపెట్టినట్లవు తుందనుకుని సరే అన్నాడు నారాయణ.  ఏచిన్న పనైనా తల్లి అనుమతి లేనిదే చేయని నారాయణ...ఇప్పుడు కనీసం తల్లి వంక చూడనుకూడా చూడకుండా వెంటనే చెప్పేశాడు. సంతోషంతో, 
" ఈరోజు మంచిరోజు... ఇప్పుడే బయలుదేరుతాం బావా అమ్మా, సుభద్రా, పదమ్మా తయారవ్వు. అనసూయా, వెళ్ళు. చెల్లెమ్మ బట్టలవీ సర్దుకుని తీసుకురా... "
" వదినా, పద.. "
అంటూ సుభద్ర వద్దకొచ్చింది అనసూయ. సుభద్ర భర్త వైపు చూసింది. నారాయణ కళ్ళతోనే చెప్పాడు వెళ్ళమని. 
 ఆమె ఇంత ప్రేమను ఒక్కసారిగా కలలోనైనా ఊహించలేదు. ప్రభాకరం అన్నయ్యంటే ఓవిధమైన ప్రత్యేకాభిమానమైతే ఆమెకూ ఉంది. ఎన్నో ఏళ్లుగా చూస్తోంది. కల్మషమన్నది ఏకోశానా లేని మనిషి ! పరాయి మనిషన్న భావన తనకెప్పుడూ కలగలేదు. అనసూయ, తను దాదాపు ఒకే ఈడు వాళ్ళు...అదృష్టవశాత్తూ తల్లి స్వభావం రాలేదు.తనతో బాగానే ఉంటుంది. మొదట ఇక్కడికి వచ్చినప్పుడంతా తనను వాళ్ళింటికి రమ్మని పిలిచేవాడు. అత్త పడనిచ్చేది కాదు...ఇంట్లో ఇబ్బంది అంటూ. రానురానూ ఇక మానేశాడు పిలవడం. 
     అదంతా గుర్తొచ్చింది సుభద్రకు. ఈరోజు ఆప్రేమ తనను ఇంత స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకోలేదు. తమ్ముణ్ణి నోరు తెరిచి అడిగింది. కానీ ఈ అన్న అడక్కుండానే వరమిస్తానంటున్నాడు...
" అనసూయా, నేను ఆటో తీసుకొస్తాను. తయారయ్యి రెడీగా ఉండండి.."
అని చెప్పి, నారాయణతో కలిసి బయటికి వెళ్ళాడు ప్రభాకరం. అలివేలమ్మకు ఎక్కడో ఏదో పట్టు తప్పుతున్న సంకేతాలు అందుతూ గుండెల్లో సన్నగా అలజడి మొదలై తన స్థానం కదులుతున్నట్లనిపించింది. ఈరోజు అల్లుడి ఊహించని   రాక, కోడలి ప్రవర్తన...ఒక ఎత్తయితే... తన అనుమతికై ఏమాత్రం చూడక ఏకంగా తనే నిర్ణయం తీసుకుని భార్యను వాళ్ళతో పంపించడం మరో ఎత్తయి,  ఆమెకు మింగుడు పడక నిశ్చేష్టయై చూస్తూ ఉండిపోయింది. మొట్టమొదటిసారిగా ఆమె చేతుల్లో నుండి కొడుకు జారిపోతున్నట్లు తోచిందామెకు !!
  అరగంట తర్వాత... 
ఆటో వచ్చింది. ఓ జిప్ బ్యాగు, చేతి సంచీ పట్టుకుని సుభద్ర, అనసూయ గది నుండి బయటకు వచ్చారు.
" వెళ్ళొస్తానత్తా, "
 అత్తగారి కాళ్లకు దండం పెట్టి, చెప్పేసి భర్తతో కలిసి బయట సిద్ధంగా ఉన్న ఆటో వద్దకెళ్ళింది సుభద్ర. ఎన్నో ఏళ్లుగా భర్త నుండి తను ఆశించింది ఎక్కడ మాయమైపోతుందో అన్న ఆతృతలో ఆమె కాసేపు అత్తగారిని లక్ష్యపెట్టడం  పక్కన పెట్టేసింది. దేవుడిచ్చిన అన్న, ఆడపడుచు మధ్యలో కూర్చుని, భర్తకు కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పి చెయ్యి ఊపి, ఇరుగూ పొరుగంతా అబ్బురంగా చూస్తుండగా,  మదినిండా సంతోషం నింపుకుని,   పుట్టింటికి తరలివెళ్ళింది సుభద్ర....

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ప్రభాకరం లాంటి పెద్ద మనసున్న 'అన్న' లందరికీ మనఃపూర్వక నమస్సులు 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺





 

No comments:

Post a Comment