" ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తోనే బ్రతికేస్తున్నార్రా..? "
థియేటర్లో ఒక్కసారిగా నవ్వులే నవ్వులు !! మహేష్ బాబు సినిమాలోని ఓ డైలాగ్ఇది. కలిసినప్పుడల్లా 'ఏం టిఫిన్? ' అనడిగితే 'ఉప్మా ' అని చెప్తుంటారా అక్కాతమ్ముళ్లు. ఆ 'సిచువేషన్' కు ఆ డైలాగు 100% సరిపోయింది కాబట్టి ఓకే...
కానీ.. నిజం చెప్పొద్దూ... మనలో చాలా మందికి ఉప్మా అంటే ఏంటో అదో చిన్న చూపు... కానీ.. గృహిణులకు... మరీ ముఖ్యంగా ఉద్యోగినులైన వాళ్లకు అదో 'ఆపద్బాంధవి' !
నిమిషాల్లో తయారై పోయేది.. ముందస్తు ప్రణాళికలు, సంసిద్ధతలూ అవసరం లేనిది... అప్పటికప్పుడు అనుకుని చేసుకోగలిగేది... టెన్షన్ లకు చోటివ్వనిదీ... కాస్త మనసు పెట్టి చేస్తే అత్యంత రుచికరమైనదీ, బలవర్ధకమైనదీనూ !! కాదంటారా !
ఆకస్మాత్తుగా ఉదయం పూట అయిదారుగురు చుట్టాలూడిపడితే... ఇంతకన్నా ఆదుకునే టిఫిన్ మరొకటుంటుందా ఆ ఇల్లాలికి ! అందుకే ఇది వారికి 'ఆపద్బాంధవి'. ఆ విధంగా వారికి ప్రియబాంధవి కూడా !సరే.. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా... కథ లోకి వెళ్దాం.
** ** **
" అబ్బ, ఈరోజూ ఉప్మా యేనా? మొన్ననేగా చేశావు, ఏంటి సరూ... "
డైనింగ్ టేబుల్ మీద ఉప్మా ప్లేట్ చూసి విసుక్కున్నాడు ప్రభాకర్.
" మొన్నేమిటి, నాల్గు రోజులైంది తెలుసా... "
నాల్గు నెలలయింది అన్నట్లు నొక్కి చెప్పింది సరోజ.
" అమ్మా, నాకొద్దు... "
ఇద్దరు కొడుకులు ఒక్కసారిగా అనేసి బుంగమూతి పెట్టేశారు.
" మూసుకొని తినండి... చూస్తున్నారుగా.. వారం రోజులయింది పని మనిషి రాక.. ఇంటి పనులు, బయటి పనులు, ఈ వంట పనులు, మీ పనులు... అవి చాలవన్నట్లు నాపనులు ! అన్నీ అవగొట్టి, తొమ్మిదింటికి బయటపడి ఆఫీసు చేరుకునేసరికి నా తల ప్రాణం తోకకొస్తోంది. రోజుకో రకం టిఫిన్ చేసి పెట్టాలంటే నేనేమన్నా యంత్రాన్నా? లేక ఇదేమన్నా టిఫిన్ సెంటరా?... పోనీ ఓ చేయి వేస్తారా అంటే..ఊహూ.. అర్థం చేసుకోరూ..." స్వర్ణ కమలం లో భానుప్రియ స్టైల్ లో గయ్యిమని లేచి దండకం అందుకుంది సరోజ. ఠక్కున నోరు మూసుకుని ప్లేట్లు ముందుకు లాక్కున్నారు ముగ్గురూ !
** ** **
" ఈరోజు బ్రేక్ ఫాస్ట్ దోశ అన్నట్టున్నావ్... !"
ప్లేట్లో ఉప్మా ప్రత్యక్షమవడం చూసి ఓరగా భార్యను చూస్తూ మెల్లిగా అన్నాడు సురేష్.
" అన్నాను... కానీ సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి లేటయిపోయింది . పప్పు, బియ్యం నాన పెట్టడం కుదరలేదు. ఇన్స్పెక్షన్ రోజులండీ.. వర్క్ చాలా ఉంది. అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోవడం లేదు. కొద్ది రోజులు తప్పదిలా...ప్లీజ్.."
ఏదో తప్పు చేసినదాన్లా పాపం సంజాయిషీ ఇస్తున్న ధోరణిలో చెప్పింది సునంద.
" సరే... టైం లేదు... ఉప్మా చేస్తే చేశావు... ఇందులోకి ఉల్లిపాయలు పొడుగ్గా కోసి, కాసిన్ని అల్లం ముక్కలు సన్నగా తరిగి, తాలింపు గింజలు, కరివేపాకు బాగా దట్టించి, ఇంకాస్త నూనె తగిలించి ఉంటే పసందుగా ఉండేది కదా... !"
ఎనిమిదింటికి గానీ పక్క దిగని బద్ధకపు భర్త గారి
బీపీ పెంచే కామెంట్స్ , జిహ్వచాపల్యం..!!చిర్రెత్తుకొచ్చి ,
"... ఉండేది ఉండేది..కాకపోతే.. ఆ ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ అన్నీ తమరు పక్కనుండి తగిలించి ఉంటే...ఇంకా ఇంకా బాగుండేది..."
పక్కనే ఉన్న శాంతి, శాన్వి కిసుక్కున నవ్వారు తల్లి మాటలకి..
** ** **
రెండు కుటుంబాల మధ్య ఉన్న పోర్షన్ లో ఉంటోంది రాజేశ్వరమ్మ గారి ఫ్యామిలీ. ఆమె, ఆమె భర్త మాధవరావు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసి, రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు. అప్పటికే సొంత ఇల్లు కట్టుకున్న ఆ దంపతులు అటూ ఇటూ ఉన్న పోర్షన్ లు రెంట్ కిచ్చేసి, మధ్యలో వారుంటున్నారు.
హాల్లో రెండువైపులా కిటికీలున్నందున ఆ రెండు కుటుంబాల మాటలు చెవిని పడుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ రోజూ అదే జరిగింది. రాజేశ్వరమ్మ చిన్నగా నవ్వుకుంది ఆ రెండిళ్ళ ముచ్చట్లకి. అంతలో ఫోన్ మోగింది.
" అమ్మా, ఎల్లుండి నా కొలీగ్ లాస్య మ్యారేజ్. అక్కడే, మన ఇంటికి దగ్గరలోనే.. నేనూ, పిల్లలు ఈ రాత్రికి వస్తున్నాం... "
కూతురు రమ్య.
" సరే సరే... అలాగే.."
అందామె. ఎదురుగా ఉన్న మాధవరావు నవ్వుతూ తల పంకించాడు.
** ** **
" అమ్మమ్మా, ఇదేం బ్రేక్ ఫాస్ట్? "
" చాలా బాగుంది టేస్టీగా, వెరైటీగా... "
ఆ మరుసటి రోజు, చిన్నూ, సిరి రాజేశ్వరమ్మ చేసి పెట్టిన టిఫిన్ ఇష్టంగా తింటూ అడిగారు.
" బాంధవీ బ్రేక్ ఫాస్టర్రా.. "
మాధవరావు ఠక్కున చెప్పాడు.
" బాంధవి బ్రేక్ ఫాస్ట్!.. "
ఇద్దరూ వింతగా చూశారు, కొత్తగా వినిపించిన ఆ పేరు మొదటిసారి విని..
" అవును మరి! మీ అమ్మమ్మ ఫేవరెట్ టిఫిన్.. అదో పెద్ద కథలే... "
" ఊరుకోండి..... "
నవ్వింది రాజేశ్వరమ్మ.
" తాతయ్యా, చెప్పవా.. చెప్పవా.. "
" మీ అమ్మమ్మ, నేనూ ఉద్యోగాలు చేసే రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా ఉప్మా అనే టిఫిన్ చేసి పెట్టేది. అలా ఆ వంటకం తరచూ దర్శనమిచ్చేది డైనింగ్ టేబుల్ మీద.... రాన్రాను అందరం విసుక్కోవడం మొదలెట్టేసరికి... దాన్నే మరికాస్త మోడిఫై చేసి, ఇదిగో... ఇలా వడ్డించడం మొదలెట్టింది. రూపం మారింది.. ఇంగ్రెడియన్స్ పెరిగాయి.... దాంతో టేస్టూ పెరిగింది.. అందరూ గొణగడం ఆగింది... "
శ్రద్ధగా వింటున్నారు ఇద్దరూ.
" అంటే ఇది ఉప్మా యేనా ! మై గాడ్ ! ఇంత రుచి ఎట్లా? మమ్మీ కూడా చేస్తుందిది.. కానీ యాక్..!"
వెనకనే ఉన్న రమ్య చిన్నూ గాడినెత్తిన ఒక్కటిచ్చింది.
" అదేదో మీ అమ్మమ్మే చెప్తుంది అడుగు.... "
అని మాధవరావు అనంగానే ఇద్దరూ రాజేశ్వరమ్మ వంక చూశారు.
" మరేమీ లేదర్రా.. అందరికీ తెలిసిందే. చాలా పాతదే.. మరో పది నిమిషాలు పడుతుందంతే... ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా తరిగి, తాలింపు గింజలు మరిన్ని వేసి వాటితోపాటు ఓ టమాట కూడా తరిగి వేస్తే చాలు.. కాస్త పసుపు జోడిస్తే కలర్ ఫుల్ లుక్ వచ్చేస్తుంది.ఎసట్లో బొంబాయిరవ్వ పోసేసి కలిపేస్తే సరి...ఇంకా కాసిన్ని జీడిపలుకులు వేశామంటే రుచి అదిరిపోతుంది. అంతే ! రుచికర మైన వేడివేడి టమాటో బాత్... అదే.. ఉప్మా రెడీ, ఇదిగో ఇలాగన్నమాట ! త్వరగా అయిపోతుంది కాబట్టి ఇది నా ఫేవరెట్. అందుకే మీ తాతయ్యేమో ఇది నాకు ప్రియ బాంధవి అంటారు. షార్ట్ కట్ లో 'బాంధవి' బ్రేక్ ఫాస్ట్ అన్నమాట!!"
అమ్మమ్మ వివరణకు అబ్బురపడ్డారిద్దరూ. వెంటనే,
" మమ్మీ, మమ్మీ.. నీవు నోట్ చేసుకోవా.. ఇలాగే చేయవా.."
అంటూ మొదలెట్టారు. రమ్యకు అప్పటి రోజులు గుర్తొచ్చాయి. అమ్మ తమ కోసం ఓపిగ్గా అవీ ఇవీ చేసి పెట్టడం తలచుకుంది. ఉదయం పూట బిజీబిజీగా సతమతమవుతూ ఉన్న టైంలో ఠక్కున ఓ ముగ్గురు చుట్టాలు దిగారంటే.... దోసెల పిండిగిన్నె అలా పక్కకు నెట్టేసి, వెంటనే ఉప్మా రవ్వ డబ్బా తీసేది అమ్మ.సమయానుకూలంగా తల్లి పాటించే కొన్ని మార్పులూ, చేర్పులూ తనకూ అబ్బాయి అప్రయత్నంగానే. అది గుర్తొచ్చి, నవ్వుకుని, పిల్లలతో,
" సరే సరే... చూద్దాంలే... అలా చేయాలంటే తీరికా, ఓపిక రెండూ ఉండాలి... మీరూ కిచెన్ లోకి వస్తే.. ఓకే... సరేనా..? "
" ఓకే మమ్మీ, షూర్..షూర్ ."
అంటూ లేచి, రాజేశ్వరమ్మను హగ్ చేసుకుని,
" థాంక్యూ అమ్మమ్మా, బాంధవి బ్రేక్ఫాస్ట్ పరిచయం చేసినందుకు..."
అన్నారిద్దరూ ఒకేసారి. నవ్వుకుని,
" పిచ్చిపిల్లలు.. అయినా...నాకు పాత గానీ ఈ పసివాళ్లకు కొత్తే గదా... "
అనుకుంటూ దగ్గరకి తీసుకుంది.
*****************************************