Monday, August 30, 2021

ఆ పాటలు స్ఫూర్తి నిస్తాయి, జీవితాల్నీ నిలబెడతాయి !

                                               🌺భువి భావనలు🐦🌷
                                                    *************


     చాలా ఏళ్ళ క్రితం ఓ ఆర్టికల్ చదివాను. అది  ఓ సినిమా పాట గురించి. అందులో నిజంగా జరిగిన ఓ సంఘటన  చెప్పడం విశేషం !దాని సారాంశం --
 జీవితంలో అన్ని విధాలా ఎదురు దెబ్బలు తిని, మనోధైర్యాన్ని కోల్పోయి, విరక్తి చెంది, విధిలేని పరిస్థితుల్లో ఓ వ్యక్తి తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని నిర్ణయించుకుని అందుకై ఉద్యుక్తుడవుతుండగా అల్లంత దూరంలో ఆకాశవాణి( రేడియో) నుండి ఓ పాట అతని చెవుల్ని తాకింది.. నిమిషాల వ్యవధిలోనే అది ఆతని గుండెల్నీ తాకింది. అంతే! ఎంతోకాలంగా అతన్ని వేధిస్తున్న గడ్డు సమస్యలు గడ్డిపరకలుగా తోచాయతనికి ! ఆశ్చర్యకరంగా మనసంతా తేలికై పోయి,  అతని నిర్ణయం సడలిపోయి అనూహ్యంగా మారిపోయింది.
 "చచ్చి సాధించేది ఏముంది, జీవితం అంతమైపోతుంది. సమస్యలు పరిష్కారం కావు కదా! ఏదైనా బ్రతికే సాధించుకోవాలి, "
 అన్న స్థిర నిశ్చయంతో మనసును సరైన దారిలోకి మళ్ళించుకున్నాడట ! ఆ విధంగా అతని జీవితం నిలబడింది. తర్వాత అతని సమస్యలు తీరాయా లేదా అన్నది వేరే సంగతి. దేహంలో ప్రాణం నిలబడటమన్నది అతి ముఖ్యం. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా సాధించగలం!
 ఇంతకీ ఆ పాట-- ' వెలుగునీడలు' చిత్రంలో శ్రీ శ్రీ గారిచే విరచితమై, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు అత్యద్భుతంగా ఎంతో ఆర్ద్రతతో ఆలపించిన ---
కలకానిదీ విలువైనదీ బ్రతుకు
 కన్నీటి ధారలలోనే బలి చేయకూ 
 *అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
 కలతలకే లొంగిపోయి కలవరించనేల !
 సాహసమను  జ్యోతినీ చేకొని సాగిపో
* అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
 శోకాల మరుగున దాగీ సుఖమున్నదిలే
 ఏది తనంత తానై నీ దరికి రాదు
 శోధించి సాధించాలీ అదియే ధీర గుణం!
ఆరోజుల్లోనే కాదు ఇప్పుడూ ఎప్పుడూ అజరామరంగా నిలిచి ఎందరికో స్ఫూర్తి నిచ్చే అద్భుతమైన పాట ఇది ! ఇలాంటి  సినీ గీతాలు ఇంకా ఉన్నాయి. కేవలం కాలక్షేపాన్ని, మానసికానందాన్ని ఇచ్చే పాటలు లక్ష లాది ఉంటాయి కానీ, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గీతాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇవి మానవాళికి దివ్య వరాలనే  చెప్పాలి! అలాంటిదే మరొకటి ---
 ఘంటసాల గారు పాడినదే, కొసరాజు సాహిత్యం' శభాష్ రాముడు' చిత్రంలోనిది.
* కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునూ 
 ఈ లోకమందు సోమరులై  ఉండకూడదూ 
 పవిత్రమైన ఆశయాలు మరువకూడదూ 
 * గాఢాంధకారమలముకొన్న భీతి  చెందకూ 
  సందేహ పడక వెలుగు చూపి   సాగు ముందుకు
  నిరాశలోన  జీవితాన్ని కృంగదీయకూ 
  జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
  జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా
తర్వాతి తరంలో వచ్చిన మరో రెండు మరపురాని గీతాలు - ఈ రెండూ  చంద్రబోస్ గారు రాసినవే !రెండింటికీ  కీరవాణి గారు చక్కటి బాణీలు కట్టడం మరో విశేషం! ఈ పాటలు నేటి తరాన్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయనడంలో  ఎలాంటి సందేహం లేదు. అందులో ఒకటి -- ' నేనున్నాను' చిత్రంలోనిది. కీరవాణి,  సునీత గారలు గానం చేసినది. 
  తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
  తరిమే వాళ్ళని  హితులుగ తలచి ముందుకెళ్లాలనీ 
  కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ 
  కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ 
  గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను
  అడుగుతో గమ్యం చెప్పెను
  నేనున్నాననీ నీకేం కాదనీ 
  నిన్నటి రాతని మార్చేస్తానని
--నా బ్రతుకింతే, నా తల రాతను ఎవరూ మార్చలేరు అనుకునేవాళ్లకు ఈపాట ఓ చక్కటి జవాబు. ఓ మార్గదర్శి." నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్" చిత్రంలోని ఈ పాట వినని వారు ఉండరేమో! 
  చెమట నీరు చిందగా నుదుటి  రాత మార్చుకో
  మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
  పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
  మారిపోని కథలే లేవని గమనించుకో
  తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
  నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ 
  నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
  నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా 
  నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ 
  అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలి
 * మౌనంగానే ఎదగమనీ
    మొక్క నీకు చెబుతుంది
   ఎదిగిన కొద్దీ ఒదగమనే
   అర్థమందులో ఉంది
   అపజయాలు కలిగిన చోటే 
   గెలుపు పిలుపు వినిపిస్తుంది
   ఆకులన్ని రాలిన చోటే
   కొత్త చిగురు కనిపిస్తుంది 
--- ఈ పాట గురించి చంద్రబోస్ గారు స్వయానా చెప్పిన మాటలు ఓ  చోట చదివాను. ఓ పాఠశాలలో ఉదయం ప్రార్థనా  గీతంగా ఈ పాటను ప్రతిరోజూ విద్యార్థుల చేత పాడిస్తారట ! ఓ రచయిత లేదా కవికి ఇంతకుమించిన మహద్భాగ్యం బహుశా ఉండదేమో! ఏ పురస్కారం దీనితో సరితూగదు అంటే అతిశయోక్తి కానే కాదు.
  అలాగే ఈ చిత్ర దర్శకుడు, ప్రముఖ ఛాయాగ్రహకులు ఎస్. గోపాల్ రెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో ఈమధ్య చెప్పగా విన్నాను, కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఈ పాటలోని పల్లవిని ఓ పెద్ద చెట్టు మొదట్లో బ్లాక్ బోర్డ్ మీద వ్రాసి ఉంచారట! వచ్చేపోయే వాళ్లు, ముఖ్యంగా  రైతులు ప్రతిరోజూ ఆ మాటలు  చదువుతూ స్ఫూర్తి పొందాలని వారి ఉద్దేశమట ! ఎంత గొప్ప ఆలోచన! ఓ పాట ఇంతలా ప్రాచుర్యం పొందడమే గాక ఎందరికో  స్ఫూర్తి నివ్వడం నిజంగా సర్వదా హర్షణీయం. రాసిన వారు, సంగీతకర్తలు, గాయని చిత్ర గారూ ధన్యులు! 
  --- ఇలాంటి పాటలు ఇప్పుడే కాదు, భావి  తరాలనూ ఉత్తేజపరుస్తాయి. నేను నాలుగింటిని  మాత్రమే ప్రస్తావించాను. ఇంకా ఉంటాయి, ఆ.... అదిగో... గుర్తుకొస్తోంది,... మరో మధుర గేయం... 
    కడలి నడుమ పడవ మునిగితే
    కడదాకా ఈదాలి
    నీళ్ళు లేని ఎడారిలో
    కన్నీళ్లయినతాగి బ్రతకాలి
    ఏ  తోడు లేని నాడు
     నీనీడే  నీకు తోడు
     జగమంతా దగా చేసినా 
     చిగురంత ఆశను చూడు 
     చిగురంత ఆశ జగమంత వెలుగు 
     గోరంతదీపం కొండంత వెలుగు. 
బాపుగారి 'గోరంతదీపం ' చిత్రం లో సుశీల, బాలసుబ్రహ్మణ్యం గారలు గానం చేసినది. సి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం, కె. వి. మహదేవన్ సంగీతం. 
ఇవన్నీ నిరాశలో ఉన్నవారికే కాదు  ప్రతివారిలోనూ స్ఫూర్తి నింపుతాయి.సరైన దారిలో నడిచేలా పురికొల్పుతాయి  కర్తవ్యాన్ని బోధిస్తూ జీవితాల్నీ నిలబెడతాయి. 
   అద్భుతమైన ఆలోచనలకు అక్షరరూపమిచ్చిన ఆయా కవులకు,  ఉత్తేజపూరితమైన స్వరాలందించిన సంగీత దర్శకులకు, ప్రాణం పోసిన గాయనీగాయకులకు నమస్సులు 🙏

**********************************





Tuesday, August 24, 2021

పసిపాపగ మళ్ళీ పుట్టాలని !

కల్లాకపటం ఎరుగని
 పాలబుగ్గల ఆ పసితనం 
 కల్మషం, కాఠిన్యం దరిజేరని 
బాధ్యతలకతీతమైన నా బాల్యం 
 నాకు మళ్ళీ కావాలి
 కదులుతున్న కాలమా, కాస్త ఆగవా ! 
 వెనుకకు మరలి గతంలోకి పరుగిడవా !
 ఏ బంధం  లేని బంధువులు
 అనుబంధాలే బంధాలై 
 పెనవేసుకున్న స్నేహాలు
 అయిన వాళ్ళను  సైతం మరిపించి
 మధుర స్మృతులుగా మిగిలిపోయిన
 నా నేస్తాలు! నాకు మళ్ళీ కావాలి
 ఆ స్వేచ్ఛ జీవనంలోకి 
 తిరిగి నను నడిపించవా !
 నిద్రలేని రాత్రులు, తీరిక దొరకని క్షణాలు
 అయినా ప్రతీ క్షణం ఎగసి పడే ఆనందకెరటాలు ! 
 తీయనైన ఆ బానిసత్వసేవలు !
 నడివయసులో నడిసంద్రంలో ఆ జీవనయానం 
 గతించిన గతంలోని సజీవ జ్ఞాపకాలతో సహజీవనం 
 నాకు మళ్ళీ కావాలి, ప్రసాదించవా !
 ఒక్క ఘడియ సైతం తిరిగి రాదని తెలుసు, 
 అయినా ఏదో ఆశ! 
 అత్యాశే అయినా మారాం చేస్తోంది పిచ్చి మనసు !
 అందుకే --
 ముందుకు కదులుతున్న కాలమా, ఆగిపోవా!
 ఒక్కసారి వెనుదిరిగి గతంలోకి చేరుకోవా!  
 పసిపాపగ  మళ్ళీ పుడతా,
 ఆ మహద్భాగ్యం నాకు కలిగించవా !!


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                  * భువి భావనలు *
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Saturday, August 21, 2021

పద్ధతులు ! బాబోయ్ !...పద్ధతులు !...?

     ఆమధ్య బంధువులింట్లో పెళ్లికి వెళ్ళాము. అక్కడ వధూవరుల తాలూకు వాళ్ళు "మీ పద్ధతులు బాగా లేవంటే మీవే అసలు బాగా లేవు " అంటూ రుసరుసలాడ్డం, చిర్రుబుర్రులాడుతూ మూతులు ముడుచుకోవడం , ఇదంతా అక్కడి  ఆహూతులు  చోద్యంగా తిలకించడం చూసి ఏమిటో చాలా బాధగా అనిపించింది.
    నూరేళ్లు కలిసి జీవించాల్సిన కొత్తజంట ఆ ఆనందక్షణాల్లో ఇలాంటివి చూస్తుంటే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? కనీసం ఆ పెద్ద వాళ్ళకి అందరూ చూస్తున్నారన్న ఇంగితమైనా ఉండాలి కదా !
   అసలు ఈ పద్ధతులన్నవి ఎలా మొదలైఉంటాయి? పూర్వం ఆయా కాలాల్ని  బట్టి తదనుగుణంగాపెద్దలు  ఏర్పరుచుకున్నవి అయి ఉంటాయి. ఇప్పుడు ఏళ్ళు గడిచిపోయినా ఇంకా అలనాటి ఆచారాల్ని పట్టుకు వేళ్ళాడుతుంటే ఎలా?  ఇంతకీ గొడవకి కారణం వింటే చాలా సిల్లీగా అనిపించింది.
     పెళ్ళి కుమారుడికి  పెట్టాల్సిన వెండి తట్ట, చెంబు పెళ్లిమాటలు అంటేకట్నకానుకలు   మాట్లాడుకున్నరోజు   ఒప్పుకున్నంత బరువు  లేవట! ఈ పాయింట్ లేవనెత్తింది ముందుగా వరుడి పినతల్లి! అంతవరకూ ఆ విషయం పెద్దగా పట్టించుకోనివరుడి తల్లి   'నిజమే సుమీ'అనుకుని రుసరుసలాడుతూ వెళ్లి, వధువు  తల్లి మీదకు గయ్యిమని లేచింది. అంతే! రసాభాస  మొదలు!
     అంతవరకూ సిగ్గులమొగ్గగా ఉన్న పెళ్లికూతురు పాపం ఈ తతంగం చెవినిబడి ఆ పిల్ల ముఖం కాస్తా చిన్నబోయింది. పక్కనున్న పెళ్లికొడుకు మాత్రం చిద్విలాసంగా తనకేమీ పట్టనట్లు, నాకు సంబంధించినది కాదన్న ధోరణిలో  పురోహితుడి  వైపు చూస్తున్నాడు, " తాళి కట్టనా, మాననా " అన్నట్టు!
   చివరాఖరికి విషయం  మగవాళ్ళ దాకా వెళ్లి, తర్జనభర్జనల తర్వాత ఏదో సర్దుబాటు చేసుకుని సైలెంట్ అయిపోయి, ' తతంగం' కాస్తా అయింద నిపించారు. అంతవరకూ ఉత్కంఠగా ఉన్న ఆహూతులంతా ఓ నిట్టూర్పు విడిచి, కుర్చీల్లో చతికిల పడ్డారు. నలుగురితో పాటు మేమూ ! ఈ పద్ధతులు అవసరమా! అనిపించి అక్షింతలు జల్లేసి బయట పడ్డాము. 
     పద్ధతులంటే  గుర్తొస్తోంది, మా బంధుగణంలో ఒకావిడ ఉంది. ఈ పద్ధతుల గురించిన వివరాలు, విశేషాలూ ఆవిడకు కొట్టినపిండి. ఎవరికైనా ఏదైనా సందేహముంటే వెంటనేఆవిణ్ణి కలుస్తుంటారు. ఆచార వ్యవహారాల గురించి నిక్కచ్చిగా చెప్ప లేని వాళ్లకు వాళ్ల తరఫున ఈవిడే వకాల్తా పుచ్చుకొని ఏకరువు పెడుతూ అజమాయిషీ కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
   ఇంకొందరుంటారు, వాళ్ల గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, " మా ఇంటికొస్తే మాకేం తెస్తారు? మీ ఇంటికొస్తే మాకేం ఇస్తారు? " అనే రకం అన్నమాట! వీళ్ళు ఎలా ఉంటారంటే ఎంతసేపూ  వాళ్లకు పెట్టవలసినవీ, ఇవ్వాల్సినవీ, అవతలివాళ్ళు పాటించాల్సినవీ మాత్రమే చెప్తారు, రాబట్టుకుంటారు గానీ తిరిగి వాళ్లకు  ఇచ్చే పద్ధతుల గురించి మాత్రం ప్రస్తావించరు. అడిగితే, " మాకా పద్ధతులు  లేవమ్మా" అంటూ సింపుల్ గా, ఇంకా నిర్మొహమాటంగా అనేసి తప్పించుకుంటుంటారు.కానుకలన్నవి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి కదా! అలాంటి వాళ్ళని ఏమంటాం  చెప్పండి! 
    ఇలా పద్ధతుల గురించీ, వాటి కథా కమామీషు గురించి చెప్పుకుంటూ పోతే బోలెడుంటాయి రాయడానికి! ఏది ఏమైనా ఎవరినీ నొప్పించని విధంగా ఉండే పద్ధతులు, సంతోషాన్ని మిగిల్చే పద్ధతులు ఎప్పటికీ మంచివే. అలా కాకపోతేనే  సమస్య !!

********************************
               🌺భువి భావనలు 🌺
********************************



     

 



Sunday, August 8, 2021

నిజం... ' చిన్నారి ' కథ

     " ఎన్నడూ అబద్దం ఆడరాదు. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికై ఒక అబద్ధమాడితే దానికోసం మరెన్నో అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. దాంతో నీవు చేసే తప్పుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది... " 
 మాస్టర్ గారు పాఠం చెప్పుకుంటూ పోతున్నారు. ఇదేమీ  పట్టని విక్రాంత్, ఉత్తేజ్ క్లాసులో వెనకాల కూర్చుని, డెస్క్ కిందుగా ఉంచుకున్న బొమ్మల పుస్తకం చూడడం లో లీనమై పోయారు. ఉన్నట్లుండి భుజాలమీద పడ్డ దెబ్బతో ఉలిక్కిపడి ఇద్దరూ ఒక్కసారే  చటుక్కున లేచి నిలబడ్డారు. ఎదురుగా గుడ్లురుముతూ మాస్టారు! ఫలితం ! చేతులు వాచిపోయేలా దెబ్బలు తిని ఇద్దరూ బెంచీలు ఎక్కి నిలబడ్డారు. ఆ సాయంత్రం బెల్ కొట్టగానే ఇంటికివెళ్తూన్న  వాళ్ళిద్దరి లోనూ ఒకటే ఆలోచనలు సుళ్ళు  తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి విక్రాంత్ అన్నాడు, 
" రేయ్, ఈ మాస్టారు మంచివాడు కాదు, చూడు ఎలా కొట్టాడో!  "
 ఎర్రగా కమిలిన  చేతులు చూపుతూ అన్నాడు. కానీ ఉత్తేజ్  మస్తిష్కంలో మరో రకపు ఆలోచనలు గిర్రున  తిరుగుతున్నాయి. వాడి మనసంతా ఇందాక చూసిన బొమ్మల పుస్తకంలోని హీరోయే నిండి ఉన్నాడు. 
" రేయ్, విక్రాంత్, ఆ  హీరో ఎంత గొప్ప పనులు చేశాడో చూసావా! హెలికాప్టర్ పై నుండి క్రిందకు జారడం, ఒక రైలు మీద నుండి మరో రైలు మీదకు దూకడం... ఓహ్ ! మనం కూడా అలాంటి పనులు చేస్తే ఎంత మజాగా ఉంటుందో కదా!.. "
 ఉలిక్కిపడ్డాడువిక్రాంత్. 
" మనమా !"
" అవును మనమే... ఎందుకు చేయకూడదు? సాహసకృత్యాలు చేయడంలో ఎంత థ్రిల్ ఉంటుంది !"
 విక్రాంత్ మౌనం ఉత్తేజ్ను మరింత ఉత్సాహ పరిచింది. 
"... ఈ బడి, చీటికి మాటికి కొట్టే ఈ మాస్టర్ లు, ఎప్పుడూ  సణుగుతూ ఉండే  అమ్మానాన్నలు!  ఏది చేయాలన్నా సవాలక్ష ఆంక్షలు! ఆటంకాలు! వీరందరికీ దూరంగా స్వేచ్ఛగా కొంతకాలం గడిపితే  ఎలా ఉంటుంది!.... "
 విక్రాంత్ లేత మనసులో విషపు బీజం పడడానికి ఎంతోసేపు పట్టలేదు. సాలోచనగా అన్నాడు, 
" నిజమే, బాగానే ఉంటుంది, కానీ ఎలా? "
" ఎలాగో నేను చెప్తాగా... " 
 వాడి భుజంపై చేయి వేస్తూ అన్నాడు ఉత్తేజ్. ఇల్లు చేరే లోగా వారిద్దరి మెదడులో ఒక చక్కటి పథకం సిద్ధమైపోయింది. 
                       **      **     **      **
   అప్పుడు సమయం రాత్రి పదకొండు అవుతోంది. నిర్మానుష్యమైన ఆ వీధి గుండా ఆ ఇద్దరూ పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ పోతున్నారు. 
".... అబ్బ, ఉత్తేజ్, ఇక నావల్ల కాదు.... "  
 ఆయాసపడుతూ లైట్ స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు విక్రాంత్. 
" రేయ్,... ఇంకెంత,... కాస్త వెళ్ళామంటే మనుషులు ఉన్న చోటికి వెళ్తాము. ప్లీజ్, పదరా.. " 
 అంటూ ఆ అబ్బాయి చేయి పట్టి  లాక్కెళ్లాడుఉత్తేజ్. 
 అప్పటికది  మూడో  రోజు వాళ్ళిద్దరూ ఇల్లు విడిచి పెట్టి వచ్చి. రెండు రోజులు బాగా సరదాగానే గడిచాయి. కానీ మూడోరోజుసాయంత్రం   నుంచి  ప్రారంభమయ్యాయి ఊహించని కష్టాలు! వాళ్ళ నాన్నల జేబులోంచి కొట్టేసిన డబ్బులు అయిపోయి   తినటానికి తిండి లేక అల్లాడిపోవడం అప్పుడే మొదలయింది. సరిగ్గా అప్పుడే, 
  పెద్దమనిషిలా కనిపిస్తున్న ఒకతను వీళ్ళ వాలకం కనిపెట్టి మెల్లిగా గుట్టంతా లాగాడు. అంతే ! వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి, మరో మనిషి వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. లోకజ్ఞానం తెలియని ఆ అమాయక పిల్లలిద్దరికీ వెంటనే తట్టలేదు, ఆ నకిలీ పెద్దమనిషి తామిద్దర్నీ అతనికి బేరమాడి అమ్మేసాడనీ, అతను తమతో వ్యాపారం చేయనున్నాడనీ ! దానిలో భాగంగానే వాళ్ళిద్దరూ గుసగుసలాడుకున్న వైనాన్ని బట్టి తామిద్దర్నీ అంగవికలుర ను చేయబోతున్నారనీ  ! ఆ ఊహ రాగానే వారి గుండె గుభేలుమంది. 
    ఆ రాత్రి ఎలాగో వాళ్ల కన్నుగప్పి అక్కడి నుంచి బయట పడే సరికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. అక్కడ మొదలుపెట్టిన పరుగు రెండు వీధులు దాటి చివరిదాకా వచ్చే వరకూ ఇద్దరూ  ఆపలేదు. ఫలితం! ఎన్నడూ లేని ఆయాసం, దడ !
  కాస్త తేరుకుని నాలుగడుగులు వేశారో లేదో, ఎదురుగా బీట్ కానిస్టేబుల్ గుడ్లురుముతూ యములాడిలా వస్తూ కనిపించాడు. అంతే ! వాళ్ల పైప్రాణాలు పైనే పోయాయి. 
" రేయ్, ఎవర్రా మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు?.... "
 వాళ్ళ బె దురు చూపులు చూసి, ఏదో శంకించిన అతను వాళ్ళిద్దర్నీ తిన్నగా పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లాడు. 
                 **     **     **    **
   "మూడు రోజుల నుంచీ మా పిల్లల కోసం తిరగని చోటు లేదు, వాకబు చేయని ప్రదేశమూ  లేదు. వీళ్ళు చేసిన పనికి సిగ్గుతో తలెత్తుకోలేకుండా ఉన్నాం సార్..."
 విక్రాంత్  నాన్నగారు ఎస్. ఐ గారితో బాధగా అన్నాడు.
" ఏమైనా మీకు చాలా థ్యాంక్స్ అండీ, మా పిల్లల్ని క్షేమంగా మాకు అప్పగించారు...."
ఉత్తేజ్ నాన్న కృతజ్ఞతగా అన్నారు. 
" దాందేముందిలెండి, మా డ్యూటీ మేము చేశాం. అయినా ఈ కాలం పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి సుమండీ! చిచ్చర  పిడుగుల్లాంటి వీళ్ళ బుర్రల్లో ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు కదులుతుంటాయో  చెప్పలేం..."
 ఎస్సై గారు సాలోచనగా తలాడిస్తూ అన్నారు.
ఉత్తేజ్, విక్రాంత్  -- ఇద్దరూ గదిలో ఓమూల తలలు దించుకుని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో అంతులేని పశ్చాత్తాపం తొంగిచూస్తోంది. పట్టరాని కోపంతో ఇద్దర్నీ  పట్టుకొని చావబాదుతారేమో  అని హడలిపోతోంటే, తద్భిన్నంగా తమ తండ్రులిద్దరూ ఇద్దరి నీ దగ్గరకు తీసుకొని హత్తుకుంటూ కన్నీటి పర్యంతం అవటం చూసేసరికి నిజంగా వాళ్ళిద్దరికీ తామెంత తప్పుపని  పనిచేశారో తెలిసివచ్చింది.
   సినిమాల్లో, కథల పుస్తకాల్లో చూసి, చదివి ఏవో సాహసకృత్యాలు చేయాలనుకుంటే ఇంటాబయటా ఎలా అవమానాల పాలు కావలసి వస్తుందో, అది ఎంతటి విపరీతాలకు దారితీయగలదో వాళ్లకు అనుభవపూర్వకంగా ద్యోతకమయింది.  " పుస్తకాల్లోని మంచిని గ్రహించాలి. చెడును అవగాహన చేసుకొని విసర్జించాలి,"అన్న నిజం వాళ్లకు ఆ క్షణంలోనే అవగతమయింది.
                            💐💐💐💐💐
[పిల్లల మాసపత్రిక ' బాలమిత్ర ' లో ప్రచురితం ]

********************************
         🌺భువి భావనలు 🌺
********************************