Saturday, September 26, 2020

ఆ గంధర్వగానానికి మరణం లేదు

   ఆగష్టు మొదటి వారంలో అనుకోకుండా యూట్యూబ్ లో ఓ వీడియో చూశాను. అది -- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారు తనకు కరోనా వైరస్ సోకిందనీ, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయనీ, మరేమీ పరవాలేదు తగ్గిపోతుంది అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదనీ తాను పెట్టిన ఓ సెల్ఫీ వీడియో. 

  " సరే, కరోనా వస్తే ఏమవుతుంది, ఎంత మందికి రావడం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే బాగయిపోతుంది. లక్షణంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు " అనుకున్నారంతా. కానీ, రోజులు గడుస్తూ నెలన్నర దాటిపోయి ఆశనిరాశల మధ్య అందర్నీ ఊగిసలాడేలా చేస్తూ ఆఖరికి నిన్నటి దినం దుర్వార్త వినిపించి  దిగ్భ్రాంతికి గురిచేసేసింది విధి !  ఇది సినీ జగత్తుకే కాదు యావత్తు ప్రజానీకానికి ఇంకా అశేష సంగీతప్రియులందరికీ జీర్ణించుకోలేని దురవస్థే. హఠాత్తుగా మహమ్మారి సోకడం , హాస్పిటల్ కెళ్ళినవాడు  అట్నుంచటే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం !ఊహించని అశనిపాతం ఇది ! అప్పట్లో 'అమరగాయకుడు ' ఘంటసాల, ఇప్పుడు ' గానగంధర్వుడు ' ఎస్. పి. బి ! 

  " ఎంతసేపు మానవులకేనా, మాక్కూడా మీ గానమాధుర్యం కాస్త వినిపించరాదా !" అంటూ దేవతలే ఇరువుర్నీ స్వర్గానికి రప్పించుకున్నారేమో అన్న భావన కల్గుతోంది. 

  ప్రస్తుతం బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించడం మినహా చేయగలిగిందేమున్నది !కొందరంటున్నట్టు వారు కనుమరుగైనా వారి పాట నిత్యం మనముందు మెదుల్తూనే ఉంటుంది. ఇది అక్షరాలా నిజం. 

  బాలూ గారి పాటల్లో వారు సోలో గా ఆలపించినవి నాకు బాగా ఇష్టమైనవి కొన్ని ----

* ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

 చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం 

 మింగినాను హాలాహలం

* ఎదుటా నీవే ఎదలోన నీవే

 ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే 

--- చిత్రం : నీరాజనం

* చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన 

 కర కంకణములు గలగలలాడగ 

ఆడవే మయూరి నటనమాడవే మయూరి

--- చిత్రం : చెల్లెలి కాపురం

* పుణ్యభూమి నాదేశం నమో నమామి

 నన్ను గన్న నా దేశం నమో నమామి

--- చిత్రం  : మేజర్ చంద్రకాంత్

* తారలు దిగి వచ్చిన వేళ

 మల్లెలు నడిచొచ్చిన వేళ

 చందమామతో ఒక మాట చెప్పాలి

 ఒక పాట పాడాలి

--- చిత్రం : ప్రేమాభిషేకం

* మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ

 పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ

 కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు 

 మహా పురుషులవుతారు

 తరతరాలకీ తరగని వెలుగౌతారు 

 ఇలవేలుపులవుతారు 

--- చిత్రం : అడవి రాముడు

* మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

 తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా 

 మనసులోని మమతలన్నీ

 మాసిపోయి కుములు వేళ 

 మిగిలింది ఆవేదన

--- చిత్రం  : పూజ

* కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

 కళ్లాలే లేనోళ్లు కవ్వించే సోగ్గాళ్లు 

 ఆటగాళ్లు పాటగాళ్లు అందమైన వేటగాళ్ళు

 హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు

--- చిత్రం : అందమైన అనుభవం

* ఆమనీ పాడవే హాయిగా

 మూగవై పోకు ఈ వేళ

 రాలేటి పూల రాగాలతో

 పూసేటి పూల గంధాలతో

 మంచు తాకి కోయిలా 

 మౌనమైన వేళలా

చిత్రం  : గీతాంజలి

* ఈ పేటకు నేనే మేస్త్రీ 

 నిరుపేదల పాలిట పెన్నిధి

--- చిత్రం : ముఠామేస్త్రి

* ఒక్కడై రావడం ఒక్కడై పోవడం

 నడుమ ఈ నాటకం విధి లీల

 వెంట ఏ బంధము రక్త సంబంధము

 తోడుగా రాదుగా తుది వేళా 

 మరణమనేది ఖాయమని

 మిగిలెను కీర్తి కాయమని 

 నీ బరువు నీ పరువు మోసేది

 ఆ నలుగురు... ఆ నలుగురు

--- చిత్రం  : ఆ నలుగురు

******************************************     

                  🌺🌺' భువి ' భావనలు 🌺🌺

******************************************

Monday, September 21, 2020

'పజిల్స్ '

 


' కూరగాయల మాటలు' అన్న పైన ఇచ్చిన పజిల్ కొంతకాలం క్రితం నేను తయారు చేసి ఈనాడు' హాయ్ బుజ్జీ ' పేజీకి పంపినది. ఆసక్తిగలవారు ఇలాంటి వాక్యాలు ప్రయత్నించి వ్రాయుటకై మనవి చేస్తున్నాను. 🙏

                        ****************

                 🌹🌹'భువి 'భావనలు 🌹🌹

                        *****************

Monday, September 14, 2020

'చిన్నారి ' పజిల్స్

ఒకటి రెండు సంవత్సరాల క్రితం వరకూ ప్రముఖ దినపత్రిక 'ఈనాడు 'లో పిల్లలకోసం ప్రత్యేకించబడ్డ 'హాయ్ ! బుజ్జి'పేజీలో రకరకాల పజిల్స్ వచ్చేవి. అవి పిల్లలకే గాక పెద్దలకూ ఎంతో ఆసక్తి గొలిపేవి. ఇదేదో బాగుందనిపించి ఆ కోవకు చెందిన పజిల్స్ తయారుచేసి నేనూ పంపిస్తూ ఉండేదాన్ని. అలా ప్రచురితమైన వాటిలో ఓ రెండు ఈరోజు నా బ్లాగులో పెడుతున్నాను. 





🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                 🌺🌺'భువి'భావనలు🌺🌺
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Wednesday, September 9, 2020

తప్పెవరిది? కన్నబిడ్డలు బలిపశువులా?..... ఓ విశ్లేషణ

    గాఢ నిద్ర నుండి ఒక్కసారిగా దిగ్గున లేచాను. ఏవేవో గట్టి గట్టిగా అరుపులు !  ఓ క్షణం తర్వాత విషయం అవగతమై నన్ను నేను సంభాళించుకున్నాను. ఇది మా పక్కింట్లో తరచుగా జరిగే బాగోతమే. అత్త మామ, భర్త, ఇద్దరు పిల్లలు, ఓ మరిది, అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి చిచ్చు రేపి పోయే ఓ ఆడపడుచు! ఇదీ ఆ కుటుంబం. ఆ ఇంటి కేంద్రబిందువు ఇంటి కోడలు వరలక్ష్మి. కేంద్ర బిందువు అంటున్నాగానీ అది పేరుకు మాత్రమే. ఆ ఇంట్లో చీపురు పుల్ల కున్నంత విలువ కూడా ఆమెకు ఉండదంటే నమ్మాలి మరి! అత్తారింట్లో అడుగుపెట్టి పదేళ్ళు గడిచినా, ఇద్దరు పిల్లల తల్లి అయినాఆ అభాగ్యురాలికి ఆవగింజంత స్థానమైనా అక్కడ దగ్గర లేదన్నది వాస్తవం. పక్కనే కాబట్టి అడపాదడపా చూస్తుంటానామెని. అసలామెకు నోట్లో నాలుకన్నది ఉందా అన్నది నా అనుమానం. 
  ఈ ఇంట్లో నేను పులిని సుమా అన్నట్లు ఎప్పుడూ గంభీరంగా, యమ సీరియస్ గా ఉండే మామగారు, గయ్యాలి తనం లో ఆరితేరిన అత్తగారు, సంపాదించి తెచ్చి పోస్తున్నానన్న అహంభావంతో భర్త గారు, వయసులో ఎంతో చిన్నవాడయినా విచక్షణ అనేది లేక వదిన మీద పెత్తనం చెలాయించే మరిది మహాశయుడు -- ఇది చాలదన్నట్లు నెలకోసారన్నా పుట్టింటిని సందర్శించి ఓ రాయి విసిరిపొయే ఆడపడుచు! వీళ్ళందరితోనెట్టుకుంటూ ఇన్నేళ్ళుగా ఆ ఇంట్లో సర్దుకుంటూ ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ ఇల్లాలు ఎవరంటే వరలక్ష్మి. ఐదారేళ్లుగా చూస్తున్నాను, మొదట్లో అరుపులు, చీవాట్లు భరించే ఆ అమాయకురాలు రాను రాను భర్త చేతిలో దెబ్బలు కూడా భరించే స్థాయికి దిగజారిపోయింది, అదీ అందరి ముందూ. ఇంత జరుగుతున్నా ఆమె నోరువిప్పిన సందర్భాలు నేను వినలేదు. 
  తను అప్పుడప్పుడూ సాయంత్రం నేను ఇంటికి వచ్చేటప్పుడు బయట ఊడుస్తూ కనిపించేది. అప్రయత్నంగానే గమనించేదాన్ని, ఆ మొహం లో జీవం గానీ, కళ్ళల్లో కళ అన్నదిగానీ కాగడా పెట్టి వెతికినా కనబడలేదు నాకు, ఎలాగోలాఈ బ్రతుకీడవాలి అన్న భావంతప్ప. అడగాలనిపించేది కానీ ఆమె ఒంటరిగా ఉండే అవకాశం దొరికేది కాదు. ఎదురింటి గిరిజ ద్వారా ఓసారి తెలిసింది, ఆమెకు పుట్టిల్లుంది కానీ పెళ్లయిన తర్వాత ఆడపిల్ల పట్ల తమ బాధ్యత తీరిపోయిందనుకునే బాపతు వాళ్ళు. చావైనా బ్రతుకైనా అక్కడే అని సర్ది చెప్పి పంపుతారట ఆంటీ అంటూ మెల్లిగా చెప్పుకొచ్చింది గిరిజ నాతో. 
  ఇంట్లో ఆడది ఎంత చాకిరి అయినా భరిస్తుంది, తన ఇల్లు, తన సంసారం, తన వాళ్ళు అనుకుంటుంది కాబట్టి. కానీ ఇలా నరకయాతన పెట్టే మనుషులున్నప్పుడు ఎంతని, ఎంతకాలమని భరిస్తుంది? 
  ఈ మధ్య ఈ గృహహింస వరలక్ష్మికి మరీ మితిమీరిందనిపిస్తోంది. సమయం సందర్భం అన్నది లేక చాలా తరచుగా ఇలా జరుగుతోంది మరి!
                         ********
    రెండు రోజులు గడిచాయి. ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలయి ఉంటుంది. ఉన్నట్టుండి బయట హాహాకారాలు, అరుపులు, ఇంకా ఏడుపులు ! నిద్ర మత్తు వదిలించుకుని గబగబా తలుపులు తెరిచేశాను. పక్కింటి ముందు అప్పటికే చాలామంది గుమికూడి ఉన్నారు. విషయం బోధ పడేసరికి నా గుండె ఒక్కసారిగా దడదడ లాడింది. 
  వరలక్ష్మి! ఉరేసుకుంది ! అర్ధరాత్రి ఎప్పుడు జరిగిందో ఏమో! ఎవరూ గమనించ లేదట! తీరా చూస్తే.... నిర్జీవంగా! కాస్త ధైర్యం చేసి ముందుకు కదిలి చూశాను. శవాన్ని దించి తీసుకొచ్చి ఇంటిముందు పడుకోబెట్టారు. ఎనిమిదేళ్ల కొడుకు. ఆరేళ్ల పాప బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఓ మూల నిల్చుని ఉన్నారు. అమ్మ కి ఏమైందో, ఎందుకు అలా బయట పడుకోబెట్టారో కూడా అర్థం కాని వయసు వాళ్ళది! నా మనసంతా కకావికలమై పోయింది. తర్వాతి తతంగం తలుచుకుంటే..... పోలీసులు, పోస్టుమార్టంలు, -- అవతలివాళ్ళు కలగ జేసుకుంటే కేసులు, కోర్టులు! 
    అసలెందుకిలా? ఈ ఉదంతంలో తప్పెవరిది?  బాధ్యులెవరు? 
* తమ ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటి మనిషిగా భావించలేని అత్తమామలా? 
* భార్య అనేది తన జీవిత భాగస్వామి అనీ, కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండడానికి వచ్చిన తన మనిషనీ గుర్తించని, ఆమెను ప్రేమించి, గౌరవించడం తన ధర్మమన్న ఇంగితం ఏమాత్రం లేని భర్త అన్న వాడా? 
* లేక కూతురు ఓ నరకంలో కొట్టుమిట్టాడుతోందని తెలిసినా ఉదాసీనంగా ఉండిపోయిన తల్లిదండ్రులా? 
 ఇవన్నీ అటుంచితే--
* పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోలేని వరలక్ష్మి అసమర్థతా? 
 పెళ్లయి సంవత్సరం దాటిన వాళ్లు, ఇంకా  మూడు నాలుగేళ్లు దాటిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం గురించి వింటున్నాం. కొన్ని సందర్భాల్లో తమతో పాటు పిల్లల్ని కూడా బలి పెడుతున్న సంఘటనలు వింటున్నాము మరీ ఘోరంగా. 
ఈ ఉదంతాన్ని విశ్లేషిస్తే---
 పది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆ ఇంట్లో ఏ కాస్త పట్టు కూడా సంపాదించ లేని వరలక్ష్మి!
 భర్తపై ఇసుమంత హక్కు కూడా సాధించడం అటుంచి అతని దౌష్ట్యాన్ని అడుగడుగున భరించడం!
 ఆమె కాస్తోకూస్తో చదువుకున్నదని విన్నాను. అయినా, అక్షరం ముక్క కూడా రాని, డెబ్భయికి చేరువలో ఉన్న అత్తగారి ఆగడం పదేళ్లు గడిచినా భరిస్తూ రావడం!
 తనకన్నా చిన్నవాళ్లయిన ఆడపడుచు, మరదులను అడ్డుకోలేక పోవడం!
--- ఇవన్నీ వరలక్ష్మి బలహీనతలు దీనికి కారణం ఆమె అతి మంచితనం అనడం కంటే అతి మెతకదనం అనడం సరి అయినది. మనలో ఆదినుండి ఓ మాట ప్రముఖంగా వినిపిస్తోనే ఉంది కదా, " మెత్తని వాళ్ళను చూస్తే మొత్త బుద్ధి అవుతుందట" అని ! అణిగిమణిగి ఉంటే ఇంకా ఇంకా అణగదొక్కాలనే చూస్తారు ఎలాంటివారైనా. నోరులేని సాధు జంతువైన పిల్లి కూడా తనను గదిలో బంధించి కొడితే తిరగబడి మీద బడి రక్కుతుందట ! మరి వరలక్ష్మి నోరున్న మనిషైనా ఇంత నరకం భరించాల్సిన అవసరం ఏమిటి?  బయటపడితే సమాజం చిన్నచూపు చూస్తుందనా? పరువు కోసమా? 
  ఈమె చాలా మంచిది, సహనం చాలా ఎక్కువ -- ఈ సర్టిఫికెట్లు వద్దు. ఆత్మాభిమానం, ఆత్మరక్షణ ముఖ్యం. ఊసరవెల్లి లాంటి నోరులేని జంతువులే పరిసరాలకు, పరిస్థితులకు తగినట్లు రంగులు మారుస్తాయే ! అన్నీ ఉండి విజ్ఞత గల మనిషి ఆ పని ఎందుకు చేయకూడదు? 
  ఇందులో వరలక్ష్మి కి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆత్మగౌరవం దెబ్బతిని, ఒత్తిడి భరించలేని దుస్థితి తీవ్రమై ఈ దారుణానికి పాల్పడింది అన్పిస్తోంది.
 ఆర్థికంగా ఆదుకోవాల్సిన స్థితి కాదు ఆమెది, కేవలం మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కావాలి. ఎవరిస్తారు?  ఇచ్చినా ఎంతకాలం ఇస్తారు?  
  తనకు తానే నిలవ రించుకుని ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. చెప్పడం ఈజీ అంటున్నారా? నిజమే కానీ, చావు పరిష్కారం కాదు. ఆ ధైర్యం బ్రతకడానికి చూపించాలని నా అభిప్రాయం. 
  ఇంతకీ--- వరలక్ష్మి చచ్చిపోయి తను మాత్రం బతికిపోయింది. ఇప్పుడు, ఈ  భూమ్మీదకి తెచ్చి వదలిన ఈ ఇద్దరు పసివాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్లు బలిపశువులేనా? 
---- ఈ విశ్లేషణకు ముగింపు వాక్యం నా అభిప్రాయం ప్రకారం-- ఆ కాలం, ఈ కాలం అని కాదు-- ఏ కాలమైనా సరే అమ్మాయిలు మానసికంగా బలవంతులై ( strong ) ఉండాలి అని! అలాగని ఆడవాళ్ళంతా గంప గయ్యాళులుగా మారిపొమ్మని కాదు నా ఉద్దేశం, పరిస్థితిని బట్టి మారటం అత్యవసరం అంటున్నాను.
" ఈ జీవితం నాది, మరి ఎవరిదో కాదు" అన్న స్థిరాభిప్రాయం వారిలో ఉండితీరాలి. లేకపోతే వీధికో వరలక్ష్మి తయారుకావడం తథ్యం !

( స్త్రీలపై నానాటికీ పెరుగుతున్న దౌష్ట్యం చూస్తూ, చదువుతూ కలిగిన స్పందనతో )

 అందరి అత్తింటివారూ ఇలాగే ఉంటారని కాదు. కోడలిని కూతురులా చూసుకుంటూ, ఆమెను తమ కుటుంబ పరువు ప్రతిష్టగా భావించే గొప్ప సంస్కారయుతమైన కుటుంబాలూ ఉంటున్నాయి. వదినల్ని ఎంతో గౌరవించే మరుదులు, ఆడపడుచులూ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్సులు  🙏🙏🙏

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
                    🌺🌺' భువి ' భావనలు 🌺🌺
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Friday, September 4, 2020

నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం.....

నేడు ఉపాధ్యాయ దినోత్సవం. గురువులందరికీ శుభాకాంక్షలు.  నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న రోజుల్లో వ్రాసుకున్న బాల గేయమిది. 5, 6, 7 తరగతుల విద్యార్థులకు నేర్పిస్తే ఎంతో చక్కగా పాడేవారు. ఉపాధ్యాయుల ప్రాధాన్యత తెలియజెప్పే ఈ పాట ఈ శుభ సందర్భంగా నలుగురితో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ రోజు నా బ్లాగ్ లో పెడుతున్నాను. 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం
 ఆడుతు పాడుతు జీవించాలి క్షణం క్షణం
 సాగాలీ సాగాలీ నిరంతరం
చేరాలీ చేరాలీ మన గమ్యం          "నవ్వుల "

 మా బడియే మా ప్రియమైన మా ఇల్లు
 మమతకు మారు రూపాలు
 చదువులు చెప్పే గురువులు
 శుభోదయం నేడే పట్టండీ కుసుమాలూ 
 వేడుక మీర చెప్పండీ జేజేలు 
 ఆ గుడి లాంటి ఈ బడిలో
 వెలసిన ఈ దేవుల నడుమ
 కలసి మెలసీ కన్నుల విందుగ         " నవ్వుల "

నిచ్చెన లోని మొదటి మెట్టు
 నువ్వు ఎక్కకనే  చేరగలేవు 
 ఆఖరి మెట్టు ఎన్నటికీ
 ఆ మొదటి మెట్టు 
 నీ ఉపాధ్యాయుడూ మరవద్దూ 
 జీవనపథమున పైన నిలిచిన ఆ పొద్దూ 
ఆ గుడిలాంటి ఈ బడిలో 
వెలసిన ఈ దేవుల నడుమ 
కలసి మెలిసీ కన్నులవిందుగ         "నవ్వుల "

 నవ్వుల పువ్వుల రవ్వల నడుమ మనం మనం 
 ఆడుతు పాడుతు జీవించాలి క్షణం క్షణం
 సాగాలి సాగాలీ నిరంతరం
 చేరాలీ చేరాలీ మన గమ్యం     

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

              🌺🌺🌺'భువి ' భావనలు 🌺🌺🌺

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని అంతరంగం.....

రేపు ( 5.9.2020 ) ఉపాధ్యాయ దినోత్సవం. ఈ శుభ సందర్భంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని తన అంతరంగం ఇలా నివేదిస్తోంది. 

గణగణమంటూ మ్రోగే బడిగంట 
 బిలబిలమంటూ బుజ్జాయిలు పరుగులంట !
 బిరబిర మంటూ కొలువుదీరి నా ముంగిట
 కల్మషమెరుగని ఆ కిలకిల నవ్వులు 
 మిలమిల మెరిసే ఆ కళ్ళలో కాంతులు
గుసగుసగా చెప్పేవి ఎన్నెన్నో ఊసులు 
అన్నీ ఆ చిన్నారుల రేపటి కలలు !
అవి నిజాలై ఎదుట నిలిచిన క్షణాలు 
ఆ ముచ్చట వివరిస్తా వింటారా మరి 
నా మధురానుభూతుల చిరుసవ్వడులు !

రెండు దశాబ్దాల క్రితం ---

 ఐదేళ్లు నిండిన ఓ బుడతడు
 బుడి బుడి అడుగులతో దరి జేరాడు 
 బుంగమూతి పెట్టి బలపం నా చేతికిచ్చాడు 
 పలక చేతబట్టి పలికించినవన్నీ నేర్చాడు !
ఈనాడు --
ఆజానుబాహుడై అందలాలెక్కి 
నాముందు మోకరిల్లి --
అ ఆ లు దిద్దించిన మా పంతులమ్మ 
అపురూపం నాకెంతో అంటున్నా నిజమమ్మ !
వేలు పట్టి నడిపించిన చేతులమ్మ నీవి 
చేతులెత్తి నమస్సుమాంజలులర్పిస్తున్నా 
గైకొనుమమ్మా !🌷💐🌷

కుర్చీలో నేను కూర్చున్న వేళ 
సడిసేయక చెంతజేరి నా చీర కుచ్చిళ్ళు 
సవరిస్తూ కొంటెగ నవ్విన ఓ అల్లరి పిల్ల !
ముద్దుముద్దు మాటలతో మురిపాలు 
పంచిన చిన్నారి బాల !
నేడు -- 
నేను తలెత్తుకునేలా ఓ అధికారిణిగా 
ఇంతెత్తు ఎదిగి అయినా నా ముందు ఒదిగి 
అన్నది కదా --
ఎందరెందరో పాఠాలు చెప్పారు 
ఎంతెంతో విజ్ఞానాన్నందించారు 
నా మొదటి గురువునైతే 
మరిపించలేకపోయారు 
నా మదిలో చెరగని ముద్ర నీవే 
అంజలి గైకొనుమమ్మ !
అంటూ కరములు రెండూ 
జోడించింది !🌷💐🌷

( మంత్రులకూ, మాన్యులకూ, 
వైద్యులకూ, వయోవృద్ధులకూ 
ఆర్యులకూ, అధిపతులకూ 
అందని అరుదైన గౌరవం 
ఉపాధ్యాయులకే సొంతం ! )

🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌷🌹🌺