Monday, July 24, 2023

అలనాటి జ్ఞాపకాల్లో ఆకాశవాణి 'లలిత సంగీతం..యం. చిత్తరంజన్ సుమధుర గీతాలు..

    కొద్దిరోజులుగా ఎందుకో నాకు 'ఆకాశవాణి'... అదేనండీ...రేడియో..... గుర్తుకొస్తోంది. ఆలోచిస్తే రేడియోకు  సంబంధించి అప్పటి జ్ఞాపకాలు బ్లాగ్ లో వ్రాయవచ్చు కదా అనిపించి, వెంటనే వ్రాయడం మొదలు పెట్టి రాసేశాను కూడా. ఒక చోట ఓ విషయం గురించి అనుమానం వచ్చి గూగుల్ లో వెతగ్గా అక్కడ అనుకోకుండా ఓ బ్లాగ్ లో  ఇదే రేడియో గురించిన ముచ్చట్లతో  మునుపే వ్రాయబడ్డ ఓ ఆర్టికల్ కనిపించింది. అందులో చాలా నేను పొందుపరచిన విషయాలే ఉన్నాయి. సరే ఇంక నాదెందుకూ అని పక్కకు పెట్టేశాను. కానీ ఎందుకో ఆశ వదులుకోలేక, అందులో లేని విషయం ఏదైనా టచ్ చేద్దామని మళ్ళీ ప్రయత్నం మొదలెట్టాను. ఇప్పుడు నేను రాయబోతున్నవి మాత్రం అచ్చంగా నాకు సంబంధించిన రేడియో జ్ఞాపకాలే సుమా !
    ఉదయం నుండీ రాత్రి దాకా వచ్చే కార్యక్రమాల్లో భక్తి రంజని మొదలుకొని, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం, ఇంకా పిల్లల కార్యక్రమాలు, నాటికలు అప్పుడప్పుడు ఆదివారాలు సంక్షిప్త శబ్ద చలనచిత్రాలు ఇంకా వార్తలు... ఇలా ఇలా సాగిపోతూ ఉండేవి.
  కార్మికుల కార్యక్రమంలో ఏకాంబరం, చిన్నక్క, రాంబాబుల సంభాషణలంటే అందరికీ ఎంతో ఇష్టం. వాటికోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. స్త్రీల కార్యక్రమాలు హుందా ఉట్టి పడేలా ఉండేవి. వాటికి ముందు వచ్చే పాటల్లో ఒకటి బాగా గుర్తు.
     ఇంటి ముంగిట సిరులు చిందే
     రంగురంగుల రంగవల్లి
     ఇంతులకు పూబంతులకు 
     కనువిందు గూర్చే రంగవల్లి
     కొలువుదీర్చెను కాంతలందరు 
     కదలి రారమ్మా...కదలిరారమ్మా 
అలాగే చిన్న పిల్లల కార్యక్రమాలు -- బాలానందం, పాలవెల్లి, బొమ్మరిల్లు.... 
     రారండోయ్ రారండోయ్ 
     బాలల్లారా రారండోయ్ 
     బొమ్మరింటికి రారండోయ్ 
     కథలూ కబుర్లు నాటికలు.... 
అంటూ పాట వినిపించేసరికి బయట ఎక్కడున్నా పిల్లలమంతా పరుగుపరుగున రేడియో వద్దకు చేరుకునేవాళ్ళం. ఏకాంబరం, చిన్నక్క, రాంబాబులు వాళ్ళ హాస్యచతురతతో, న్యాయపతి రాఘవరావు అన్నయ్య, అక్కయ్యలు పిల్లల పట్ల ఆప్యాయతతో ఆరోజుల్లో అందర్నీ అలరించేవారు. 
  ఇవి కాక ప్రతీ రోజూ ఏదో ఒక సమయం లో వచ్చే సినిమా పాటలు ! చిత్రలహరి, మీరు కోరిన పాటలు, చిత్రసీమ... నేనయితే సినిమా పాటలంటే చెవి కోసుకునేదాన్ని. ఎక్కువగా అవే వినేదాన్ని కూడా. కానీ ఓసారి మా నాన్నగారు  'ఎప్పుడూ అవేనా!' అంటూ లలిత సంగీతం గురించీ దాని మాధుర్యం గురించీ చెప్పి వినమన్నారు. నిజంగానే వాటి గురించి అంతవరకూ ఎరగని నేను క్రమంగా ఆ గీతాల పట్ల ఆకర్షితురాలనై వాటి అభిమానినై పోయాను. అప్పట్లో చాలా మంది సినీగీతాల వేపే మొగ్గు చూపుతూ  'లలిత సంగీతం ' అని అనౌన్స్ చేయగానే రేడియో కట్టేసేవారు. సినిమా ప్రాచుర్యం అంతగా ఉండడమే దానిక్కారణం.  లలిత సంగీతం లోని మాధుర్యం గ్రోలడానికి అలవాటు పడితే అలా ఎప్పటికీ చేయలేరంటాను నేను. 
   ఆ సంగీతం ఆనందించటం అలవాటయ్యాక వాటిని అస్సలు మిస్ కాకుండా వినేదాన్ని. అప్పట్లో అలా విన్న ఆ పాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తు.  వాటిని ఇక్కడ పొందుపరచి అవి విన్న జ్ఞాపకాల్ని కొందరితోనైనా పంచుకోవాలని ఆశపడుతున్నాను. 
మున్ముందుగా ----
*ఘంటసాల గారి గీతాలు. వారు సినిమా కంటే ముందుగా రేడియో లో పాడారన్నది అందరికీ విదితమే. వాటిల్లో జగమెరిగిన గానం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ' పుష్పవిలాపం'

* నేనొక పూలమొక్క కడ నిల్చి 
  చివాలున కొమ్మ వంచి 
  గోరానెడు నంతలో 
  విరులన్నియు నోళ్లు విప్పి 
  మాప్రాణములు దీతువా యని
  బావురుమన్నవి చింతతోడ...

ఇంకా ---
* బహుదూరపు బాటసారీ ఇటు రావో ఒక్కసారి...
 
* తల నిండ పూదండ దాల్చిన రాణి 
  మొలక నవ్వుల తోడ మురిపించబోకే
 
* అత్త లేని కోడలుత్తమురాలే ఓయమ్మా 

తర్వాత బాగా గుర్తున్నవి  ---

* నల్లనివాడా నేగొల్ల కన్నెనూ 
   పిల్లనగ్రోవూదుము --- ఆర్. బాలసరస్వతి గారు
 
* అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ 
  -- వేదవతీ ప్రభాకర్ 

* ముద్దుల పాపకు తెలియునులే 
   మురిపెమిచ్చేది తల్లియనీ
 
* మెరుపుల పూవుల దండగా 
   మబ్బులు మెత్తని దిండుగా 
   గగనము వెచ్చని శయ్యగా 
   హాయిగ నుందువె తారక 

* తబ్బిబ్బయింది నా మనసు 
   తళుక్కుమన్నది నీ సొగసు 
   మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్ 

* చిన్ని మల్లెపువ్వులోయ్ 
   పున్నమి జాబిల్లిలోయ్ 
   --- గానం -- వైదేహి 

* కోయిల కూసినా కోరిక పూసినా 
   తెలుసుకో లేనివాడు మనిషేనా   --- A.P. కోమల

* ఇమ్మధుర వసంత పరిమళం
* కైలాసగిరి నుండి
   -- బి. వసంత గారు సినిమా పాటలు కూడా పాడారు.
   కానీ ఈ పాటలంటేనే నాకెంతో ఇష్టం.

* మాటలే కవికి మూటలు
   -- పి. సుశీల గారి లలిత గీతం ఇది ఒక్కటే నేను విన్నది.

* ఓహో ఓహో వసంతమా 
   నవజీవన మోహన వికాసమా
   -- ఎన్నో సినీగీతాలాలపించిన వాణీ జయరాం గారు
   ఇంతటి మాధుర్యపు లలిత గీతం ఆలపించడం 
   విశేషం.

* ఒదిగిన మనసున ఒదిగిన భావము
   -- చిత్తరంజన్, Dr. కనకవల్లి నాగేందర్

* బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
   -- యం. ఎస్. రామారావు

* పూవులేరితేవే చెలి పోవలె కోవెలకు
   నీవలే సుకుమారములు 
   నీ వలే సుందరములు 

* జై జవాన్.. జై కిసాన్... 
   జై బాపూ...జై జవహర్..
   జై జయహో లాల్ బహదూర్... 

* పదములె చాలు రామా 
   నీపద ధూళులే పదివేలు... 

 కొన్ని బృంద గానాలు  ---

* రాల లోపల పూలు పూచిన
   రామమందిర లీలా ఆ రామ సుందర లీలా
   రాళ్ళలో హృదయాలు పొదిగిన...
   -- సి. నారాయణ రెడ్డి 

* అదిగదిగో అదిగో అదిగదిగో అదిగో
   ఆ పైని ఆపైని అగుపించునదె దేవళం 
   అదియె మన యాత్రా స్థలం
  -- దేవులపల్లి

* పదండిదే పదండిదే పదండిదే 
   భావి భారతీయులారా
   భాగ్యతా విధాత లారా
   యువతీ యువ నేతలారా 
   నవ భారత యోధులారా 
 ఆవేశం, ఆనందం కలబోస్తూ వింటున్న వాళ్ల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఈ పాట ఎంత ఉద్వేగ భరితంగా ఉంటుందో వింటే గానీ తెలీదు. 
 పాడిన వారి వివరాలు నాకు గుర్తున్నంత వరకు ప్రస్తావించాను.

  ఇదంతా నలభై యాభై సంవత్సరాల క్రితం నాటి ముచ్చట. ఇప్పుడు టీవీ లాగా అప్పుడు రేడియో అన్నది ప్రతి ఇంటా కొలువుదీరి కాలక్షేపం తో పాటు విజ్ఞానం-వినోదం, సమాచారం అన్నీ అందించేది. పైన కనిపించే రేడియో ఫోటో 1972 లో మా నాన్నగారు నాకు కొనిచ్చినది. అప్పట్లోనే దాని ధర రు. 500 /- టీవీ వచ్చాక వాడకం తగ్గి పోయి ఇప్పుడు అసలు పనిచేయడం లేదు.  అయినా పదిలంగా దాచుకున్నాను. నా రేడియో జ్ఞాపకాల్లో అదీ ఓ భాగమేగా మరి ! ఇవండీ, ఓ శ్రోతగా నా జ్ఞాపకాల్లో అలనాటి రేడియో కబుర్లు !
                          _________________

 ఈపోస్ట్ మునుపు పబ్లిష్ చేయబడినదే అయినా..మూడు రోజుల క్రితం(21.7.23 ) స్వర్గస్తులైన మహాభాష్యం చిత్తరంజన్ దాస్ గారి గురించి రెండు మాటలు చెప్పాలనిపించి, మరికొంత జత చేసి అందిస్తున్నాను.  
      నేను హైస్కూల్ చదువులో ఉండగా ఆకాశవాణిలో వారానికోసారి 'ఈ పాట నేర్చుకుందాం' అన్న కార్యక్రమం వచ్చేది. అది చిత్తరంజన్ గారే నిర్వహించేవారు. ముందుగా పాట అంతా రాసుకునేలా చెప్పి,తర్వాత  ఎంతో నెమ్మదిగా, శ్రద్ధగా నేర్పించేవారు. ఆ తర్వాత... ఆ పాట నాలుగు వారాల పాటు సాగేది. ఆ విధంగా నేను కొన్ని పాటలు క్రమం తప్పకుండా రాసుకుని నేర్చుకున్న రోజులున్నాయి. వారి గాత్రం మాత్రమే తెలిసిన నాకు దూరదర్శన్ వచ్చాక, మొదటిసారి బుల్లితెర మీద లలిత గీతాలు పాడుతున్నప్పుడు వారిని చూడటం తటస్థించింది. మూడు రోజుల క్రితం ఎనభైఆరేళ్ళ వయసులో కన్నుమూశారన్న విషయం తెలుసుకున్న నాకు ఆ రోజులు మళ్ళీ తలపుకొచ్చాయి. వారు స్వరపరిచిన గీతాలెన్నో ! వాటిల్లో నాకు బాగా గుర్తున్న కొన్ని....
* ఎత్తవోయీ కేల ఈ బేల సుమబాల.... 

* తెప్పవోలె చంద్రబింబం 
   తేలిపోతూ ఉంది నింగిని...

* రమ్మంటే చాలుగాని 
   రాజ్యాలు వదిలి రానా...

 ---- ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. కానీ హృదయంలో ఇప్పటికీ నిక్షిప్తమై ఉన్నాయి....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

8 comments:

  1. ఆనాటి రేడియో జ్ఞాపకాలతో చక్కటి పోస్ట్ వ్రాశారండి. ఆ రేజుల్లో రేడియోలో ఎక్కువగా ప్లసారం చేసిన ప్రైవేట్ గీతాల్లో రావు బాలసరస్వతీ దేవి గారు గానం చేసిన పాటలు కూడా తరచూ వస్తుండేవి ... (1). చలిగాలి వీచింది తెలవార వచ్చింది (2). గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన (3). బంగారు పాపాయి బహుమతులు పొందాలి .... వగైరా ఆవిడ పాటలు.
    టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” పాట కూడా వస్తూనే ఉండేది.

    ఆకాశవాణి వారు బాధ్యతాయుతంగా వారి కార్యక్రమాలు రూపొందించే వారు. విద్యాధికులు, సాహిత్యరంగంలో పేరు గాంచిన వారు ఆకాశవాణిలో పని చేస్తుండేవారు. అదంతా ఒకప్పటి మాట, ఆనాటి రేడియో వైభవమున్నూ.

    ఆ తరవాత తరువాత తగ్గిన రేడియో ప్రాముఖ్యత ఇప్పుడు తిరిగి పుంజుకుంటోందని రేడియో అనుభవజ్ఞుడు భండారు శ్రీనివాసరావు గారు చెప్పిన మాట (ఆ విడియో నేనూ చూశాను) వెలిబుచ్చిన ఆశావహం మనకు తెలిసిన రేడియోకు అన్వయించి చెప్పలేమని నా అభిప్రాయం. ఈనాడు రేడియో పేరుతో పాప్యులర్ అవుతున్నది ఆ HM రేడియోనే అనిపిస్తుంది. ఆ HM రేడియో గురించి అదే విడియోలోని వ్యాఖ్యాత సతీష్ చెప్పినది అక్షరాలా నిజం. ట్రాఫిక్ జామ్ ల సమాచారం తెలుసుకోవాలనుకునే వారికి పనికొస్తుందేమో 🙂 ?

    ReplyDelete
  2. మీరు చెప్పింది చాలా నిజం సర్, కొత్తను స్వాగతించడంలోపడి పాతను పక్కకు నెట్టేయడం అత్యంత సహజమే అయినా ఏదో ఆశావహదృక్పథం. అలనాటి లలిత సంగీతం పాటలు ప్రస్తావిస్తూ చక్కగా రాశారు. నిజంగా ప్రశాంతత, మాధుర్యం కలబోసుకున్న పాటలవి. చక్కటి విశ్లేషణతో వ్యాఖ్య నందించిన మీకు చాలా thanks. నమస్తే !

    ReplyDelete
  3. రేడియో స్టేషన్లు ఇంకా అవే ఫ్రీక్వెన్సీలనే ప్రసారాలకు వాడుతూ ఉన్నా అనుకుంటా నండీ. అంచేత ఆ రేడియో బాగుచేయించుకోండి వీలైతే. అన్నట్లు దాన్ని మనం ట్రాన్సిస్టర్ అనేవాళ్ళు కదా.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసిన మేరకు: పెద్ద రేడియోలు వాక్యూమ్ ట్యూబులతో (vacuum tubes) చేసేవారు, చేతిలో పట్టేంత సైజు (portable or hand-held) రేడియోలలో ట్రాన్సిస్టర్ (semi-conductor device with 3 junctions; NPN or PNP) టెక్నాలజీ వాడడం మూలాన వాటికి ఆ పేరు వచ్చింది.

      Delete
    2. పెద్ద సైజులో‌నే ఉండేవి మొదట్లో రేడియోలు. కొన్నైతే చిన్నసైజు బోషాణాల్లా ఉండేవి. వాటిలో వాక్యూమ్ ట్యూబులతో (vacuum tubes) చేసేవారు అన్నది నిజమే. కాని అప్పట్లో వాల్వులు అనే వాళ్ళం. ఇక్కువగా బెల్ కంపెనీవి వాడేవారు. తర్వాత పోర్టబుల్ రేఇయోలు - అవే - ట్రాన్సిష్టర్లు వచ్చాయి. అబ్బో వాటిపై యువతలో పెద్ద క్రేజ్ ఉండేది.

      Delete
    3. మాస్టారూ! స్కోరెంత?😉

      Delete
  4. అవునండీ, ట్రాన్సిస్టర్ అనేవాళ్ళం. Thank you very much for your comment 👃

    ReplyDelete
  5. ధరిత్రీ దేవి గారు,
    ఇప్పుడే గుర్తొచ్చింది, .మీ ఊరు కర్నూలు కదా? అయితే, మూడు రాజధానుల్లో ఒక రాజధానై వెలుగొందబోతున్మ ఊరిలో మీ నివాసం అన్నమాట, అదృష్టవంతులు ... మీకు, మీ ఇతర పురవాసులకూ అభినందనలు.

    ReplyDelete