Saturday, April 27, 2024

చేజారింది కాదు...🌷 కథ

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    దిక్కుతోచడం లేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తెల్లారితే చాలు నా జీవితం నా చేతుల్లోంచి పూర్తిగా జారిపోతుంది. ఏం చేయను ! సినిమాల్లో లాగా సంచీలో రెండు చీరలు కుక్కుకుని బయట పడిపోతే ! ఒక్క క్షణం ఆ తలంపుకే గుండె ఆగినంత పనయింది. అమ్మ నాన్న, కుటుంబం, పరువు ప్రతిష్ట--- గంగలో కలిసి పోవూ ! మళ్లీ ఆందోళన ! పోతే పోనీ! తొక్కలో పరువు ! ఇక్కడ నా నూరేళ్ళ బ్రతుకు ! ఎటూ తోచని అయోమయ స్థితి ! తల బాదుకున్నా. 
     ఇంతకీ మాముసల్దాన్ననాలి.  కాటికి కాళ్ళు చాపుకొని ఈ విపరీతమైన కోరికలేమిటో  ! ఎవరో కాదు, మా నానమ్మ ! ఎనభై అయిదు కూడా దాటాయి. పది దినాల క్రితం ఉన్నట్టుండి కళ్ళు తేలవేసింది. పోయిందనే అనుకున్నారంతా. అలా జరిగినా బావుణ్ణు ! సాయంత్రానికల్లా లేచి కూర్చుని తన చివరి కోరికంటూ వెళ్ళబుచ్చింది. ఫలితమే, ఇప్పుడు నేననుభవిస్తున్న నరకం! నేను పుట్టిన తర్వాత మా అమ్మ బాగా జబ్బు పడిందట. అప్పుడీవిడే నా ఆలనా పాలనా చూసిందట ! అందుకని నా మీద ప్రత్యేకమైన అభిమానం. అదే ఈ రోజు నా కొంప ముంచింది. 
     సరిగ్గా వారానికి ఆగమేఘాల మీద నా పెళ్లి కుదిరించేశారు. నా ప్రమేయం లేకుండా నాకు సంబంధం ఏమీ లేదన్నట్లుగా ఇంట్లోవాళ్లు కూడబలుక్కుని నిర్ణయించేసారు. ఇదేమిటని అమ్మ దగ్గర వాపోతే ఓ వెర్రి నవ్వు నవ్వి కొట్టిపారేసింది. 
      ఇంతకీ నా బాధ పెళ్లి చేసుకోవడానిక్కాదు. మరి ! నా బుర్రలో మరొకరు తిష్టవేసుకుని ఉన్నారే ! అది చెప్పాలంటే ఓ అయిదేళ్ళు వెనక్కెళ్ళాలి. నేను పక్కటౌన్లో పదో తరగతి చదివే రోజులవి. ఒక రోజు సాయంత్రం బస్సు దిగి ఇంటికి వస్తూ ఉండగా మా వీధి చివర పార్వతమ్మ గారి ఇంట్లో నుంచి వస్తూ ఒక అబ్బాయి ఎదురయ్యాడు. పార్వతమ్మ గారు మా బంధువేమీ కాదు, కానీ ఓకే వీధి కాబట్టి బాగా పరిచయం. అతను ఆవిడ చెల్లెలి కొడుకనీ, డిగ్రీ చదువుతున్నాడనీ తర్వాత తెలిసింది. ఎందుకో ఏదో తెలీని ఆకర్షణ ! అంతే! ఈ ఐదేళ్ళ లోనూ ఐదారుసార్లు చూసుంటానేమో ! మా మధ్య ఏ రోజూ మాటలన్నవి లేవు. కానీ ఇష్టం అంతే ! ఎప్పటికీ అతనితోనే జీవితం అన్న ఆలోచన ఆ వయసులోనే నాకు బలంగా ఉండేది. అలా అలా రెండేళ్లు గడిచి నా ఇంటర్ పూర్తయింది. ఇక చాలు అంటూ చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఖాళీగా ఉండలేక ప్రైవేట్ గా డిగ్రీ కట్టాను. చూస్తుండగానే మరో రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతకాలమైనా నా ఆలోచనల్లో మార్పయితే లేదు మరి ! కానీ--- ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ పెళ్లి ! ఒక్కసారిగా నాయనమ్మమీద మళ్లీ పీకలదాకా కోపం ముంచుకొచ్చేసింది. కానీ ఏం చేయను? ఎవరినీ ఎదిరించ లేని వయసు! తెల్లారితే పెళ్లి! అందుకే ఈ దిక్కుతోచని స్థితి ! ఆ స్థితిలోనే మగత నిద్ర. భళ్ళున తెల్లారింది. 
                                  ********
    ఇంటి ముందు కొబ్బరాకుల్తో చిన్నగా పందిరి వేశారు. మామిడాకు తోరణాలు కట్టారు. కల్లాపి జల్లి ముగ్గులు పెట్టారు. అనుకోకుండా జరుగుతున్న పెళ్లయినందుకు పెద్దగా బంధువుల హడావిడి కనిపించడం లేదు. రాత్రంతా నిద్ర కరువై నీరసంగా కూర్చుని కళ్ళు నులుముకుంటున్న నా వద్దకు మా పిన్ని, పక్కింటి వనజత్త వచ్చి నన్నులేపుకుపోయి హడావుడిగా తలపై నీళ్లు గుమ్మరించి స్నానం వగైరా పూర్తయిందనిపించారు. ఇంకా తడియారని జుట్టును విదిలించి జడలా అల్లి ఓ మూరెడు మల్లెదండ అందులో కుక్కేశారు. ఏదో తెల్లటి చీర, కొత్తదే...తెచ్చి చుట్టబెట్టి పెళ్ళి కూతుర్ని తయారుచేశామనిపించు కుని నన్నలా వదిలేసి పక్కకు వెళ్లి పోయారు. అచేతనంగా ఉండిపోయిన నాలో అలజడి! ఎన్నెన్ని ఊహించుకున్నాను? పెద్దంచు పట్టు చీర, పూలజడ, ఆ జడకు బంగారు కుచ్చులు, చేతులకు గోరింటాకు, మోచేతుల దాకా రంగురంగుల మట్టి గాజులు, కాళ్లకు వెండి పట్టీలు, ఇంకా స్నేహితురాళ్ళ వేళాకోళాలు " ఎక్కడ? ఏమీ లేకుండా ఇంత సాదా సీదాగా ఏమిటిది?  
   బయట సన్నాయి మేళాలు మొదలయ్యాయి. మళ్లీ వచ్చారిద్దరూ. నన్ను బరబరా తీసుకెళ్లి, పీటలమీద కూర్చోబెట్టారు. మరో అరగంటలో పెళ్లి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడిపోయింది. ఆ క్షణంలో పక్కనున్న పెళ్లికొడుకన్నవాడిని చూడాలన్న ధ్యాస ఎంత మాత్రమూ నాలో కలగలేదు. అంతా వైరాగ్యం !
   మరో అరగంట తర్వాత ఇద్దరిని తీసుకొని అక్కడే ఓవార మంచం మీద కూర్చుని ఉన్న సూత్రధారి మా నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ కాళ్ళకి మొక్కించారు. ఎంత అయిష్టంగా ఉన్నా తప్పదుగదా ! లోపల మాత్రం పళ్ళు నూరు కుంటూ అనుకున్నా, 
" ఏయ్, ముసల్దానా, కోరిక తీరింది గా, చచ్చిపోవే, ఇప్పుడు వెళ్తా, మరో మూడు రోజుల తర్వాత మళ్ళీ వస్తా. నీ మొహం కూడా చూడను. నీవు చస్తే నీ కాళ్ళ కి దండం కూడా పెట్టను.... ( నేనున్న మానసిక స్థితి లో ఈ భాష సబబే మరి ! )" పట్టరాని కోపంలో నా మనసు నా ఆధీనంలో లేని పరిస్థితి నాది!
      వారం క్రితం వరకూ కళకళలాడుతూ తిరిగిన నేను ఇప్పుడు నవ్వన్నది మర్చిపోయాను. అంతవరకూ అతని మొహమే ఎరగని నేను మొదటి సారి అతను నా చేతిని తన చేతిలోకి తీసుకుని,  
" వాసంతీ, నీవంటే నాకెంత ఇష్టమో తెలుసా... "? అన్నప్పుడు చివ్వున ఒక్కసారి తలెత్తి చూశాను. కోటి వీణలు ఒక్కసారిగా మోగిన అనుభూతి ! 
".... నిన్ను ఒకే ఒక్కసారి బయట బస్స్టాప్ దగ్గర చూశాను. అప్పటినుండీ నీపై ఓ మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆ క్షణం నుండీ...... "  చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ స్వరం గంభీరంగా ఉంది. అయినా మృదువుగా సాగిపోతోంది. ఆ సమయంలో నేను గమనించింది ఆ వదనంలో ప్రశాంతత, చిరునవ్వు! అతను పెద్దగా చదువుకోలేదని చెప్పారు. ఆస్తిపాస్తులూ అంతంత మాత్రమే. అందచందాలు అరకొరగా. అయినా అవన్నీ అతని హృదయ సంస్కారం ముందు దిగదుడుపే! ఈ నిజం తెలియడానికి నాకెన్నో క్షణాలు పట్టలేదు. ఒక్కసారిగా అనుకోని పెన్నిధేదో వచ్చి ఒడి లో పడినట్లయింది. అంత వరకూ నాలో గూడుకట్టుకుని ఉన్న దిగులు, నిర్లిప్తత పటాపంచలయిపోయాయి. 
    టీ. వీ లో ఆ మధ్య ఓ సినిమా చూశాను. అందులో ఓ డైలాగ్ గుర్తొచ్చింది. దాని సారాంశం--- ఆడ పిల్లకు పెళ్లి కాకముందు ఆమె హృదయం ఫోటో ఫ్రేమ్ లా ఉంటుందట! పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ప్రతిబింబం మాత్రమే అందులో పడుతుందట ! ఆకాస్త పెళ్లి ఫిక్స్ అయి మెడలో తాళి పడ్డాక తన భర్త రూపం అందులో పడి పోయి శాశ్వతంగా ఫోటో అయిపోతుందట  ! నిజంగా అక్షర లక్షలైన విలువైన మాటలవి. సరిగ్గా నాకు అలాగే జరిగింది. హఠాత్తుగా నానమ్మ గుర్తొచ్చి ఒక్కసారిగా దుఃఖం ఎగదన్నుకొచ్చింది. పెళ్లిరోజు నేను ఆవిణ్ణి తిట్టుకున్న తీరు తలపుకొచ్చి సిగ్గుతో తల వాలిపోయింది. 
                              *******
     సరిగ్గా వారం తర్వాత ఆయనతోపాటు పుట్టింట్లో కాలు మోపాను. అడుగు పెట్టీపెట్టగానే నా కళ్ళు వెతికాయి నాయనమ్మ కోసం. నేను వచ్చానని తెలిసి తన మంచం మీంచి లేచి రాబోతున్న ఆమె దగ్గరికి పరుగున వెళ్లి ఒడిలో తల పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చే శాను. ఎన్నడూ నా కంట నీరు చూడని ఆ పండుటాకు చలించిపోయి, 
" అయ్యో, నా తల్లి, ఏమైందే" 
అంటూ నన్ను పొదువుకుంది. నేను తేరుకుని నవ్వుతూ ముడతలు పడ్డ బుగ్గలు నిమురుతూ, ముడివడ్డ భృకుటి మీద నెమ్మదిగా చుంబించాను. తన మనవరాలు సంతోషంగానే ఉందన్న విషయం గ్రహించి నన్ను అక్కున జేర్చుకుని బోసి నోటితో నవ్వుతూ నా బుగ్గలు పుణికింది. 
                              ********
      ఏమిటి! ఇదంతా ఏ నిన్ననో మొన్ననో జరిగింది అనుకుంటున్నారా?  లేదండీ బాబూ, చాలా సంవత్సరాలే గడిచాయి. ఇప్పుడు నా వయసు నలభై అయిదు. ఇద్దరు పిల్లలు, ఆయన్తో సలక్షణంగా సాగుతోంది నా జీవితం. ఇన్నేళ్లలో బాధ పడ్డ క్షణం లేదు. ఈ క్షణమో మరుక్షణమో అన్న మా నాయనమ్మ మరో ఏడాది పాటు పిడి రాయిలా బ్రతికింది. ఆ తర్వాత ఓ రాత్రి మామూలుగా నిద్రపోయి మరి లేవలేదు. పోతే పోయింది గానీ, ఆమె చివరి కోరిక నెరవేర్చుకునే నెపంతో నాకు మాత్రం మా ఆయన రూపంలో ఓ అపురూపమైన వరం ఇచ్చి పోయింది. ఇంతకీ, నా మెడలో తాళి పడే క్షణం వరకూ నిరంతరం నాలో అలజడి రేపిన మహానుభావుడు మా ఆయన ఆగమనం తర్వాత మళ్ళీ ఈనాటి వరకూ గుర్తుకొస్తే ఒట్టు ! తర్వాత్తర్వాత తెలిసొచ్చింది, అది కేవలం ఆకర్షణ! Infatuation ! అయినా ఓ విషయం చెప్పాలిప్పుడు. ఆతని గురించి నేనంతగా ఆరాటపడ్డానే గానీ, అతనెప్పుడూ నా వంక చూసిన దాఖలాలు గానీ, నాతో మాట కలిపే ప్రయత్నం చేసిన క్షణాలుగానీ నా స్మృతి పథంలో లేవు. దీని ద్వారా నే తెలుసుకున్న జీవిత సత్యం--- మనం ఇష్టపడే వాళ్ళని కాదు, మనల్ని ఇష్టపడుతున్న వాళ్లని గుర్తించి తీరాలి. ఎందుకంటే ప్రేమించడం కాదు ప్రేమించబడడం గొప్ప. అందులోనే అసలైన ఆనందం దాగుంది. దురదృష్టం ఏంటంటే మనం కోరుకునే వాళ్ళు మన గురించి అస్సలు ఆలోచించరు. మనం ఎంత మాత్రం ఆసక్తి చూపని వాళ్లు మూగగా మనల్ని గమనిస్తూ ఉంటారు. దాన్నే ఆరాధన అంటారేమో!! ఇలా ఆలోచిస్తున్నప్పుడు నా చిన్నప్పుడు నేను చూసిన ఓ పాత సినిమాలోని ఓ పాట గుర్తుకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు--- జీవిత సత్యాల్ని రంగరించి రాశాడేమో ఆ కవి అనిపిస్తుంది అది విన్నప్పుడల్లా... అందులో ఓ చరణం----
       కోరిక ఒకటి జనించు
       తీరక ఎడద దహించు
       కోరనిదేదో వచ్చు
       శాంతి సుఖాలను దెచ్చు 
       ఏది శాపమో ఏది వరమ్మో 
       తెలిసీ తెలియక అలమటించుటే 
       ఇంతేరా ఈ జీవితం
       తిరిగే రంగులరాట్నము 
       బ్రతుకే రంగులరాట్నము....
                       *******
  ఏవేవో కావాలి అనుకుంటాము. అవేమీ అందవు. కానీ మరేదో వస్తుంది. నిజంగా కోరుకున్నది లభించినా అంత ఆనందంగా ఉండలేమేమో?  ఇది మాత్రం ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన మహత్తరమైన విషయం! అందుకే అంటున్నా ----
 చేజారింది కాదు, చేజిక్కిందే మనది, మన సొంతం అని !
*************************************

Thursday, April 25, 2024

బాలగేయం --- అమ్మ నాకు తినిపించే......

🙆🙂😊😇
   🌹🌺🌷🌹

అమ్మ నాకు తినిపించే
అల్లిబిల్లి కబుర్లతో
ఆకాశం చూపిస్తూ
అపరంజిని నేనంటూ         " అమ్మ "

ఇలకు దిగిన ఇలవేల్పునట !
ఈశ్వరవర ప్రసాదినట !
ఉన్నదంత నాదంటూ 
ఊర్వశివీ నీవంటూ !              " అమ్మ "

ఎన్నడూ లేదంట
ఏలోటూ నాకంట
ఐశ్వర్యం నాదంట !            " అమ్మ "

ఒరులెవరూ సాటిరారంట !
ఓనాటికి నేనవనికి
ఔతానట మహారాణిని !       " అమ్మ "

అందలాలు ఎక్కేనట
అః ! అహహ !
నేనే ఒక నియంతనట !!

🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺🌷🌹🌺💐

Saturday, April 20, 2024

నాణెం.... అటూ... ఇటూ

    కొడుకు తెచ్చిన నోట్ల కట్టలు అతి జాగ్రత్తగా లెక్క పెట్టింది పార్వతమ్మ. వెంటనే  " ఇదేమిట్రా, ఐదొందలుతగ్గాయేమిటి?  " నిశితంగా అతన్నే చూస్తూ అడిగింది. 
   " తనకేదో అవసరమంటూ తీసుకుందమ్మా సుగుణ... " నాన్చుతూ చెప్పాడు ఆనంద్. 
  " బాగుంది వరుస ! స్కూలు దగ్గరేగా నడిచి వెడుతుంది, భోజనం పట్టుకెళ్తుంది, సినిమాలు, షికార్లు నీవు తిప్పుతూనే ఉంటావాయే ! ఇంకా ఆవిడ గారికి అవసరాలంటూ ఏముంటాయి? ' దీర్ఘం తీస్తూ నిలదీసింది. 
  " అదేంటమ్మా, పది మందిలో కెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు నలుగురిలో బాగుండాలంటే ఏవో చిన్న చిన్న సరదాలు, అవసరాలు ఉండవా?.... "
 మధ్యలోనే అడ్డుకోబోయిన ఆవిడకి గేటు తీసుకుని వస్తూ కనిపించింది సుగుణ. రుసరుసలాడుతూ సణుగుడు ఆపి లోనికెళ్ళిపోయింది పార్వతమ్మ. చెట్టంత ఎదిగినా ఇంకా తన అదుపాజ్ఞలలో ఉంటూ తనదే కాకుండా భార్య జీతం కూడా తెచ్చి తల్లి చేతిలో పోసే కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉంటుందావిడ !
   అక్కడే కూర్చుని చదువుకుంటున్న ఆమె చిన్న కొడుకు ప్రశాంత్, చిన్న కూతురు ప్రసూన తల్లి మాటలు వింటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ! వాళ్ళిద్దరూ ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు. 
                          *********
    దసరా పండక్కి వచ్చిన పెద్ద కూతురు సునంద ను కాలు కింద పెట్ట నీయకుండా అపురూపంగా చూసుకుంటోంది పార్వతమ్మ. సునందకు పెళ్లి చేసి రెండేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. డిగ్రీ దాకా చదివి ఏదో ప్రైవేటు కంపెనీలో టైపిస్ట్ గా చేస్తోంది. 
    ఆ రోజు సాయంత్రం ఆనంద్ సుగుణలు ఏవో సరుకులు కొనడానికి బజారెళ్ళారు. ప్రసూన, ప్రశాంత్ లు కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నారు. సునంద అక్కడే సోఫాలో కూర్చుని వీక్లీ తిరిగేస్తోంది. 
    ముంగిట్లో చెట్టుకు కాసిన మల్లె మొగ్గలు కోసుకొచ్చి చక్కగా మాలకట్టి మురిపెంగా కూతురు జడలో తురిమింది పార్వతమ్మ. వెంటనే లోనికెళ్లి చిక్కటి కాఫీ కలుపుకొచ్చి వేడివేడిగా కూతురికి అందించి, మెల్లిగా మొదలెట్టింది. 
   " ఏమే, సునందా, నీ జీతం గురించి మీ అత్తగారు ఏమైనా అడుగుతుందా? " 
    " అబ్బే, ఆవిడకి అలాంటి ఆశలు ఏమి ఉన్నట్టు లేదమ్మా, పైగా ప్రతి పండక్కీ ఆవిడే నాకు చీర కొనిస్తుంది తెలుసా!... ఈసారి కూడా కొనుక్కో మంటూ రెండు వేలు చేతిలో పెట్టి పంపించింది... " తల్లికి భరోసా ఇచ్చింది సునంద. 
   " అలా అయితే మంచిదే మరి! మీ ఆయన్ని మాత్రం ఎప్పుడూ చేయి జారి పోనీకు. ఎప్పుడూ కొంగున ముడి వేసుకుని ఉండాలి సుమా ! "
    కొడుకు నా మాట జవదాటకూడదు, అల్లుడు మాత్రం నా కూతురి అదుపాజ్ఞల్లో ఉండాలి అనే బాపతు ఆవిడ! 
  ".... నేనూ మరో రెండు వేలు ఇస్తాను, రేపెళ్లి నాలుగు వేలు పెట్టి నీకు నచ్చిన పట్టు చీర ఏదైనా కొనుక్కో... " లోలోపల మురిసిపోతూ దగ్గరగా వచ్చి తగ్గు స్వరంతో అందావిడ. 
     అక్కడే ఉన్న ప్రసూన, ప్రశాంత్ ల చెవుల్లో వీళ్ల సంభాషణ ఎంత వద్దనుకున్నా దూరిపోతోంది. తల్లి ధోరణికి ఆ ఇద్దరూ విస్తుపోయి తెల్లమొహాలేశారు. 
  పాపం! వదిన! అయిదు వందలు, అదీ తన జీతం డబ్బుల్లో నుండి తీసుకుంటేనే రాద్ధాంతం చేసిన అమ్మ ఇప్పుడు అక్కకు ధారాళంగా రెండు వేలిస్తానంటోంది ! 
   వదిన తెల్లవారుజామునే లేస్తుంది. ఇంటిపని, వంట పని అంతా దాదాపు తనే పూర్తిచేసి, డ్యూటీ కెళ్ళిపోతుంది. అలసి సొలసి సాయంత్రానికి ఇంటికి వస్తే ఏనాడైనా ఇలా కాఫీ తన చేతికందించిందా? ఎప్పుడైనా ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడిందా? అక్కకు మాత్రం రాచమర్యాదలు చేస్తోంది!
   కూతురికో ధర్మం, కోడలికో ధర్మమా! ఎందుకో ఏమో గాని ఆ లేత మనసులు రెండూ ఒకింత ఆలోచనలోపడి అయోమయంలో కాసేపు కొట్టుమిట్టాడాయి. 
     నాణెం ఒకటే అయినా దానికి ఒక వైపు బొమ్మ, మరోవైపు బొరుసు ఉన్నట్లుగానే ఒక స్త్రీలో అమ్మ, అత్త అనే రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన మనసులు ఒదిగి ఉంటాయన్న లోకం పోకడ ఆ పసి హృదయాలకు తెలియాలంటే వాళ్లకు ఈ వయసు చాలదు. ఇంకొంతకాలం ఆగాలి మరి !


🌺🌹🌷🌷🌺🌹🌷🌺🌹🌷🌺🌹🌺🌹🌷🌷

( ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితం )

Wednesday, April 17, 2024

చినుకులు కావవి... పన్నీటి జల్లులు..

🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚🐦🦜🦚... 


అదిగదిగో ఆకాశాన....
కమ్ముకుంటూ నల్ల నల్లని మబ్బులు...
దోబూచులాడుతూ... పరుగులు తీస్తూ..
అటు ఇటు సాగుతూ... సాగుతూ...
సృష్టిస్తున్నాయి అంబరాన
మౌనంగా అలజడులు....
నీలాల నింగి.. అంతలో అయ్యింది కడలి...
చల్లగాలి సోకి... అదిగదిగో... మొదలవుతోంది...చిరుజల్లుల చిలకరింపుల
పలకరింపులతో  పరవశింప చేస్తూ...
చిటపట చినుకుల తాళం వేస్తూ...
పగుళ్లు వారిన నేలను పదును చేస్తూ...
సకల జనుల్ని సేదదీరుస్తూ...
అరెరే...!! వచ్చేసిందిగా...వాన !!
ఇదిగిదిగో... అయింది మౌనంగా జడివాన..!!
పన్నీటి జల్లులు కురిశాయి హృదయాన...!!

🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦🦚🦜🐦


                      

Sunday, April 14, 2024

కట్టుబాట్లు

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦 
                        కట్టుబాట్లు 
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦

 ప్రేమించుకున్నామంటారు... 
 ప్రేమికులం మేం అంటారు...!
 పెళ్లంటే వద్దూ వద్దంటారు... !
 సహజీవనం ముద్దంటారు...!!
 స్వేచ్ఛాజీవనం కావాలంటారు...
 కొత్తదనంలోనే ఆనందమంటారు...
 రోజులు గడుస్తాయి....
 మోజులు తీరతాయి...
 'మైనస్ ' లు  బయటపడి...
'ప్లస్ '  లు మరుగునబడి... 
కలహాలు మొదలై... కష్టాలపాలై... 
కలల సౌధం కూలిపోయి...
విషాదంమూటగట్టుకుని...విడిపోయి... 
వీధినిబడుతున్న ఆధునిక యువత...!
ప్రశ్నార్ధకమవుతున్న బంగరు భవిత !
కన్ను మిన్ను గానక చరించిన ఫలితమిది  !!
గతి తప్పిన దారుల వెంట ...
గమ్యం లేని బ్రతుకులివి .... ! 
సజావుగా సాగాలంటే జీవితాలు... 
ఉండాలిగా మరి నీతినియమాలు.... !!
కట్టుబాట్లతో కూడిన ఆ పెట్టని గోడలు.. 
నిరంతరం హెచ్చరించే లక్ష్మణరేఖలు !!
నిత్యం ఆదుకునే రక్షణకవచాలు...!!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦



Tuesday, April 9, 2024

ఓ ' ఫోబియా ' కథ !



       వారం రోజులుగా రామలక్ష్మికి చాలా   చిరాగ్గా, అసహనంగా ఉంటోంది. ఒంట్లో ఏదో తెలీని నలత ! చిన్నగా తలనొప్పి! ఇప్పుడే కాదు, దాదాపు ఒక సంవత్సర కాలం నుండీ ఆమెకిలాగే ఉంటోంది. కానీ చిత్రమేంటంటే ఆ పరిస్థితి ఏ వారమో , రెండు వారాలో ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది.మళ్ళీ కొద్దినెలల తర్వాత అదే పరిస్థితి ! కారణం రామ లక్ష్మికి   బోధపడదెంతకీ. 
     అరవింద కు డిగ్రీ పూర్తవగానే పెళ్లయిపోయింది. భర్త భరత్ ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్. పెళ్లయిన కొత్తలో అటువైపూ, ఇటువైపూవాళ్ళు ప్రతి పండక్కి ఎవరో ఒకరు ఇంటికి పిలుస్తూ ఉండేవాళ్లు. సంవత్సరం దాకా మహదానందంగా గడిచిపోయిందా  అమ్మాయికి. కొత్తదనం తగ్గిపోయి  ఇప్పుడు పండగలకి పిలవడం కూడా తగ్గిపోయింది. దాంతో చిక్కొచ్చిపడింది అరవిందకి ! పుట్టింట్లో గారాబం  ఎక్కువై ఏ పని చేయడం అలవాటు కాలేదు. ముఖ్యంగా పండగపూట! అన్నీ తల్లే చూసుకోవడం, ఆ పిల్లేమో అమ్మ ఉంది కదాని వంటింటి   మొహం వేపు కనీసం తొంగి  చూడకపోవడం ! అన్న పెళ్లయ్యాక వదిన వచ్చి  తల్లికి  సాయం చేయడం మొదలయ్యాక బాధ్యతారహితంగా తయారై మరీ బద్ధకస్థురాలై పోయింది. ఫలితం ! ఈరోజు ఏ పండగ ఎలా చేయాలో ఏ మాత్రం అవగాహన లేకపోవడం! కనీసం వంటల మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే అదీ లేదు. కానీ పండగ లంటే ఇష్టమే. ఇదిలాగుంటే, భర్తగారేమో భోజనప్రియుడు. పండగపూట మరీ హెవీ గా ఉండాలంటాడు. దాంతో మరో  పెద్ద సమస్యయింది  అరవిందకు. ఎంత పుట్టిల్లైనా మరీ పిలవకుండా వెళ్లడమంటే ఏదో నామోషీ ! అంతే! ఇంకేముంది! పండగలంటే  ఆసక్తి, సంతోషం చచ్చిపోయి ఆ స్థానంలో ఓ విధమైన బెంగ మొదలైంది. అందుకేనేమో, పండగ వారం ఉందనగానే ఆమెలో ఏదో గుబులు! ఎలాగోలా అది కాస్తా దాటి పోగానే పరిస్థితి మళ్ళీ మామూలై పోతోంది. 
     ముందుగా   ప్రస్తావించిన రామలక్ష్మి పరిస్థితీ  ఇదే. నలభై ఏళ్లదాకా రామలక్ష్మిచాలా  హుషారుగా ఉండేది. ఇంటి పనులూ, బయటి పనులు చక్కబెట్టుకుంటూ, మరోవైపు పిల్లల ఆలనాపాలనా ఇంట్లో మిగతా  వాళ్ల అవసరాలు అన్నీ చూసుకుంటూ అంతా  ఒంటిచేత్తో నెట్టుకొచ్చేది. వంటింట్లో అత్తగారేదైనా సాయం చేయబోయినా వారించేది. చేతికి కాలికి అడ్డం అనుకొంటూ ఎవరు సాయం అందించబోయినా సున్నితంగా తిరస్కరించేది. నలభై దాటి రెండేళ్లు గడిచాక నెమ్మదిగా ఆమెలో నిస్సత్తువ ఆవహించడం మొదలై మరో రెండేళ్లు గడిచేసరికి రెట్టింపైపోయింది. 
     ఏమిటో ఈమధ్య వంటింట్లో కాస్త ఎవరైనా పని అందుకుంటే బాగుంటుంది కదాని అన్పిస్తోందామెకి మెల్లిమెల్లిగా. అత్తగారేమో వంటింటి అలవాటు బాగా తప్పిపోయి విశ్రాంతికి అలవాటు పడి అటువేపు చూడ్డం బొత్తిగా మానేసింది. ఆవిడే కాదు ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఓరకమైన 'కంఫర్ట్ జోన్ ' లో పడిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. 
" ఖర్మ !చేజేతులా చేసుకున్నానాయె !తప్పుతుందా !"
అంటూ తల పట్టుకుంటోందా ఇల్లాలు !
" అన్నీ మీదేసుకుని చేయాలనుకుంటే చివరికిలాగే అవుతుంది మరి !"
ఆమె ఆపసోపాలు చూస్తూ భర్త గారు చేసే కామెంట్స్ ఆమెను మరీ ఆలోచనలో పడేస్తున్నాయి. మరీముఖ్యంగా ఈమధ్య పండగల పూట ఆమె అవస్థ చెప్పనలవి గావడం లేదు. పెద్ద సంసారం !తెల్లవారు ఝాము నుండి అన్నీ చక్కబెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనమైపోతోంది. దాంతో పండగ ఏదైనా వస్తోందంటే చాలు ఆమెలో ఏదో అలజడి ! ఈవిధంగా కొద్దికాలం గడిచాక నెమ్మదిగా ఆమెకు అసలు కారణం బోధపడసాగింది. ప్రస్తుతం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని సతమతమై పోతోందా అమాయకురాలు !
      వీరిద్దరి వ్యవహారం ఇలా ఉందా! ఇక భువనేశ్వరి దగ్గరికెళ్దాం. ఆవిడ హై స్కూల్ టీచర్ గా రిటైరై సంవత్సరం దాటింది. ముప్ఫై అయిదు  సంవత్సరాలుగా క్షణం తీరిక లేకుండా ఉద్యోగం చేసి అలసిన ఆమె శరీరం రిటైర్మెంట్ తర్వాత ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు లే అనుకుంటూ ఆ క్షణం కోసం ఎదురు చూసింది. తీరా  ఆ ఘడియలు రానే  వచ్చాయి. కానీ మూడు నెలలు గడిచీ  గడవకముందే ఆమె ఆశలు  ఎండమావులే అని ఆమెకు అవగతమైపోయింది. ఇప్పుడు ఆమెకు బయటకెళ్ళి జాబ్ చేసే పని మాత్రమే తప్పింది.అస్తమానం ఇంట్లోనే ఉంటున్నందుకు  ఇతరత్రా పనులన్నీ ముఖ్యంగా వంటింటి పనులురెట్టింపై పనిభారం విపరీతంగా పెరిగిపోయి, ఈ వయసులో ఆమె శరీరం తట్టుకోలేక బాగా డీలా పడిపోతోంది. ఫలితం! B.P, థైరాయిడ్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు మెల్లిగా చుట్టుముట్టి మీద పడి మరింత హైరానా పెట్టేస్తున్నాయి. మరి ఈవిడకి కూడా పై ఇద్దరి లాగే పండగ వస్తోందంటే గాభరా  ఉండకుండా ఉంటుందా? ప్రస్తుతం భువనేశ్వరి కూడా పనిభారం  ఎలా తగ్గించుకోవాలా అన్న ఆలోచనలో ఉంది.
    ఈ ముగ్గురే కాదు, ఇలాంటి కోవకు చెందిన ఆడాళ్లంతా తమ స్వల్పకాల అనారోగ్యాలకు కారణం అన్వేషిస్తే --- కేవలం ఒత్తిడి! మానసిక ఒత్తిడే 90% ఉంటుందన్న నిజం ఇట్టే ద్యోతకమౌతుంది. రకరకాల ఫోబియాల  గురించి మనకు తెలుసు. ఇదీ  ఒక రకం 'ఫోబియా' అనొచ్చేమో !
    దీనికి పరిష్కారం గురించి చెప్పాలంటే( నా మాటల్లో )---
 కాస్త కష్టమే అనుకోండి-- కానీ అసాధ్యం అయితే కాదు అనుకుంటున్నా---
* ఇంట్లో పని విభజన అన్నది ఉండాలి. ఇంట్లో ఉన్న అందరికీ ఎవరికి  చేతనైన పని వాళ్లకు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి.. అలవాటు పడ్డ ప్రాణాలు కదా, మొదట్లో మొరాయిస్తాయి. అనుమానమే  లేదు. కానీ క్రమంగాదారిలో కొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చెప్పడం అయితే సునాయాసంగా చెప్పగలిగాను, ఆచరణలో మహా కష్టం సుమీ ! కానీ ప్రయత్నించడంలో తప్పేముంది?  
   అలా చెప్పలేమంటారా?  మొహమాటమడ్డొస్తోందా? ఆ ముసుగు తీసేస్తే అన్నీ సర్దుకుంటాయి నేస్తాలూ ! కొందరు తెలివైన ఆడవాళ్ళు మొదటి నుంచీ  ఇదే పద్ధతి ఫాలో అవుతుంటారు మరి! వాళ్లు ఎవరి మాటల్నీ పట్టించుకోరు. అందుకే ఏ 'టెన్షన్ ' లేకుండా ధీమాగా కన్పిస్తుంటారు. మనం కూడా అదే దారిని ఎంచుకుంటే ఈ ఫోబియాలూ గీబియాలు పరారవుతాయి గదా !
    మహా అయితే ఇంట్లో వాళ్ళు కొద్దిరోజులు మనమీద కారాలూ మిరియాలూ నూరతారు, అంతేగా ! మన క్షేమం కోసం ఆమాత్రం భరించాలి మరి !ఏమంటారు? 
    ఇకపోతే, ఇది  ఎక్కువ మంది  ఉన్న కుటుంబాలకు OK. మరి అరవింద లాగ ఇద్దరే ఉంటే ! ఇద్దరి మధ్య కూడా పని విభజన అన్నది ఉండొచ్చు.  అప్పుడు ఇద్దరూ పరస్పర అవగాహనతో, సర్దుబాటు ధోరణితో ఆలోచించాల్సి ఉంటుంది.     మహా కష్టమే అయినా' ప్రయత్నిద్దాం'అన్న  కోణంలో ఇదంతా  సాగాలి !! 

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄