Saturday, December 6, 2025

తెలుగంటే వెలుగురా...

                                   ~యం. ధరిత్రీ దేవి

[ తెలుగు భాష ప్రస్తుతం ప్రాధాన్యత కోల్పోతున్నదన్నది అందరికీ విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో మన మాతృభాష తెలుగును కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. తెలుగు భాష ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓ చిన్న గేయం నా మాటల్లో.. ]

కదలిరండి కదలిరండి తెలుగు బిడ్డలారా 
కరం కలిపి కదం కదిపి కదలండీ తెలుగు తమ్ములారా
ఒక్కటిగా నడుద్దాం పోరాటం సాగిద్దాం
అమ్మ భాష గౌరవం నిలబెట్టి చూపుదాం 
నలుదిశలా మన తెలుగు బావుటా ఎగరేద్దాం 
                                                          //కదలి రండి// 
దేశభాషలందు తెలుగు లెస్సయనీ 
అన్నాడు ఆంధ్రభోజుడు
తెలుగు భాష సంగీతమంటు 
పొగిడెనుగా రవీంద్రుడు  
భాషలోన తీయదనం తెలుగుకే సొంతమూ 
మధురమైన తెలుగుభాష మనదే ఇది నిజము
తెలుసుకొనుము చవిచూడుము తమ్ముడూ
తెలుగునేల జన్మించిన మనమంతా ధన్యులము 
                                                          //కదలిరండి//
కవులెందరో విరచించిరి కావ్యాలెన్నో
గాయకుల గళం నుండి జాలువారె తేనెలూరు గేయాలెన్నో/
మాతృభాష మాధుర్యం మూటగట్టి మన చేత పెట్టి /
మహామహులు నిలబెట్టిరి తెలుగు కీర్తి శిఖరాన / 
వారి బాట నడవాలీ అది మన ధర్మం 
అమ్మ భాష ప్రాధాన్యత చాటాలీ 
అందరమూ..అది మన కర్తవ్యం
                                                          //కదలిరండి //
అభ్యాసం కోరనిదీ అమ్మపాలతో  ఒడిసిపట్టేది
అమ్మభాష అమృతమిది అమ్మ ప్రేమ అమరమే సోదరీ
అవగాహన లేని చదువు వ్యర్థమురా వినుమురా 
అమ్మ భాషతోనె అదీ సాధ్యమనీ నమ్మరా
తెలుగుజాతి మనదిరా తెలుగునాడి పట్టరా
తెలుగంటే వెలుగురా తెలుగు నేర్చి 
వెలుగులోకి వేగిరమే  నడవరా    
                                                          //కదలిరండి//