" వైద్యో నారాయణో హరిః" అంటారు. డాక్టర్లు దేవుళ్ళనీ అంటారు. పోతున్న ప్రాణాలు సైతం నిలబెట్టి మనిషికి ఆయుష్షు పోసే శక్తి ఒక్క వైద్యులకే సొంతం అన్నది నిర్వివాదాంశం. కానీ.. ప్రస్తుత రోజుల్లో వైద్యులు మునుపటి గౌరవాన్ని పొందడం లేదన్నది వాస్తవ దూరమైతే కాదు. ఒకప్పటిలా డాక్టర్ల సేవాతత్పరత నేడు కానరావడం లేదు.. ఎందుకని!
వృత్తి పట్ల అంకితభావం లోపిస్తోంది. ఎంతో కష్టపడి మెడిసిన్లో సీటు సంపాదించి ఏడెనిమిదేళ్లు శ్రమకోర్చి తెచ్చుకున్న డిగ్రీ..! అంత కష్టంతో డాక్టర్ అయ్యాక.. అసలు తానెందుకు ఆ చదువే ఏరి కోరి ఎంచుకున్నాడో మరిచిపోతే ఎలా!!
శారీరక బాధలు,అనారోగ్యాలు వేధిస్తున్నప్పుడు ఎవరికైనా తక్షణమే గుర్తుకొచ్చేది డాక్టరే...! ఎంతో నమ్మకంతో,ధైర్యంతో వెళ్లి డాక్టర్ ముందు కూర్చున్న రోగి డాక్టర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేషెంట్ చెప్పే సమస్యను పూర్తిగా సహనంతో వినడం ఆ వైద్యుని కనీస ధర్మం. అలాగే ప్రసన్నంగా కనిపించడం, చిరునవ్వుతో తన ముందున్న రోగిని పలకరిస్తూ సమస్యను సందేహించక తనతో చెప్పేలా చేయడం ఓ డాక్టర్ కు ఉండాల్సిన ప్రథమ లక్షణం.
ప్రస్తుతం ఎందరు డాక్టర్లు ఈ విధంగా ఉంటున్నారనేది ప్రశ్నార్థకమే! రోజుకు లెక్కలేనంతమంది రోగులు వస్తుంటారు.. అందరితో అలా అంత ఓర్పుగా, వ్యవహరించడం ప్రతి ఒక్కరికి అంత సమయం కేటాయించడం..సాధ్యమేనా! అన్నది ప్రశ్న! అది కొంతవరకు నిజమే అయినా.. వైద్యులకు ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరించడం మాత్రం తగదని చెప్పాలి.
మరో విషయం.. ఎందరో డాక్టర్లున్నా, కేవలం కొందరికి మాత్రమే మంచి డాక్టర్ అన్న పేరు వస్తూ ఉంటుంది. దానికి కారణం రోగులతో ఆ డాక్టర్స్ ప్రవర్తిస్తున్న తీరు మాత్రమే..! వైద్య రంగంలో రాణించడం, రాణించకపోవడం అన్నది ప్రధానంగా ఆ వైద్యుల చక్కటి ప్రవర్తనా తీరుపై ఆధారపడి ఉంటుంది. కొందరికి చక్కటి నైపుణ్యాలున్నా కోపం, చిరాకు,విసుక్కోవడం, వ్యంగ్య ధోరణిలో మాట్లాడటం, రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే మందులు రాసేయడం, టెస్టులు చేయించమనడం.. ఇలాంటి లక్షణాల వల్ల రోగులు అలాంటి డాక్టర్ల వద్దకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు.
ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లుండే వారేమో గానీ.. ఇప్పుడా అవకాశం ఉండడం లేదు. ఈ సందర్భంగా.. ఓ విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో మా గ్రామంలో ఒకాయన ఉండేవారు.యాభై ఏళ్ళు ఉంటాయి. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు..అయినా ఎంతో అనుభవజ్ఞుడైన డాక్టర్ కున్న పరిజ్ఞానం ఉండేది . ఊర్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆయనకు కబురు పంపేవారు. ఆయన కూడా ఏ భేషజం లేకుండా తక్షణమే వచ్చి రోగిని పరామర్శించి తన వద్ద ఉన్న టాబ్లెట్స్ ఇచ్చేవాడు. అందులో అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేదం కూడా ఉండేవి. ఆయన హస్తవాసి ఏమోగానీ మరుసటి దినానికంతా సమస్య సద్దుమణిగి మనిషి నార్మల్ అయిపోయేవాడు. ఆ ఊరికి ఆయనే తిరుగులేని డాక్టర్ !! నయాపైసా ఆశించక ప్రతివారికీ అందుబాటులో ఉండేవాడు.
అంతటి సేవాతత్పరత ఈరోజుల్లో ఎందరు డాక్టర్లకు ఉందంటారు! ఎంతటి ప్రమాద స్థితిలో ఉన్న పేషెంట్ నైనా.. పక్క ఇంటిలోనే ఉన్న డాక్టర్ కూడా పిలిచినా రాడు..! పేషెంట్ నే అతని వద్దకు తీసుకొని పోవాల్సి వస్తోంది. అలాగే కొద్ది సంవత్సరాల క్రితం ఏదైనా అస్వస్థతకు లోనై డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షించి మందులు మాత్రం రాసిచ్చేవారు. ఇప్పుడు వెంటనే టెస్టులు కూడా రాసిస్తున్నారు.! అందరూ ఇలాగే ఉంటున్నారు అని మాత్రం చెప్పడం లేదు.. కానీ ఎక్కువ శాతం జరుగుతున్నది ఇదే! అందుకేనేమో.. చిన్న చిన్న అనారోగ్యాలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు చాలామంది.
ఏది ఏమైనా డాక్టర్లు దేవుళ్ళు అనే పేరు ప్రజల్లో నిలిచిపోవాలంటే డాక్టర్లకు సేవాభావం, రోగుల పట్ల దయ తప్పక ఉండాల్సిందే. అప్పుడే మంచి డాక్టర్ అనిపించుకుంటాడు. ప్రస్తుతం వృత్తి పట్ల అంకితభావం లేని వాళ్ళు అసలు లేరని చెప్పడం కూడా భావ్యం కాదు. కాలాలతో నిమిత్తం లేకుండా అప్పుడూ ఇప్పుడూ మంచి డాక్టర్స్ ఉంటూనే ఉన్నారు. సంపాదనే ధ్యేయం కాకుండా ఉచిత వైద్యం చేస్తూ, మందులు కూడా ఉచితంగానే అందిస్తూ రోగులను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునే వారూ ఉంటున్నారు. వారు నిజంగా వైద్య నారాయణులే..! వారందరికీ హృదయపూర్వక నమస్సులు. డాక్టర్స్ ని విమర్శించరాదు. ఎందుకంటే ఏ అనారోగ్యం పొడసూపినా వారే దిక్కు మరి!! వ్యాధుల బాధలు బాపే అపరధన్వంతరులు రోగుల పట్ల శ్రద్ధ చూపడం ఎంతైనా అవసరం. అప్పుడే వారు కనిపించే దేవుళ్ళు అవుతారు...🙏
( నేడు 1.7.25 డాక్టర్స్ డే )