Thursday, February 20, 2025

అమ్మ భాష

'అమ్మ' అన్న మాటే మధురం కాదా 
అమ్మ మనసు అమృతం కాదా !
అమ్మ ప్రేమ అపురూపం అయినప్పుడు 
అమ్మ భాష మరింత ప్రియం కాదా !

ఉగ్గు పాలతో రంగరించి పోసేది 
ఏ శిక్షణ అవసరం లేనిది 
పుట్టుక తోనే సంక్రమించేది 
మాతృభాష కాక మరేది? 

పరభాష తో వద్దు శత్రుత్వం 
ప్రతీ భాషకూ ఇద్దాం గౌరవం 

కానీ --
మాతృభాషకే అగ్ర తాంబూలం !ఇది నిజం !
అది మరచిననాడు మనుగడ శూన్యం !
అవగాహనే అన్నింటికీ మూలం 
అమ్మ భాషతోనే అది సాధ్యం 
భాషేదైనా సరే ప్రతీవారూ 
ప్రేమించాలి సొంతభాషను 
అమ్మ ఎవరికైనా 'అమ్మే' కదా మరి !!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
            నేడు [ 21.02.2021] 
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  
 

Sunday, February 16, 2025

సూర్యాస్తమయం...



   ~
ధరిత్రీ దేవి 

     దినకరుడు...
     సెలవు పుచ్చుకుంటున్న వేళ...
     నింగీనేల కలిసే చోట...
     ప్రకృతి గీసే ఆ వర్ణచిత్రం !
     ఎంత మనోహరం !!
     పొద్దు వాలుతున్న ఆ క్షణాలు
     ఎందుకో మరి !అందరికీ అంత ఇష్టం !
     జీవిత చరమాంకాన్ని మాత్రం ద్వేషిస్తాం...
     క్రుంగిపోతాం..వద్దూ వద్దంటాం...!
     సూర్యాస్తమయంలో ఆహ్లాదం...
     మలివయసులో  మనిషిలో మాత్రం 
     ఉండదా ఏమి !! వెతుకుదాం...
     బాధ్యతల సంకెళ్లు విడివడి...
     మనకంటూ మిగిలి..చేతికందిన... 
     ఆ అరుదైన సమయాన్ని 
     సొంతానికి మాత్రమే 
     సొంతం చేసుకుంటే...సంతోషం 
     మన సొంతమవును కదా !!
     కనురెప్పలు మూతలు పడేదాకా...
     కలతలకతీతంగా పయనం సాగిద్దాం
     వృద్ధాప్యాన్ని ప్రేమిద్దాం 🙂
     ఆనందంగా ఆస్వాదిద్దాం ...

🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞


Wednesday, February 5, 2025

ఆ ఇద్దరు కుటుంబం పరువు ప్రతిష్ఠలు

    బెల్ మోగింది. పీరియడ్ అయిపోయింది. స్టూడెంట్స్ కు బై చెప్పి స్టేజి దిగి స్టాఫ్ రూం వైపు అడుగులు వేసింది వసుధ. రూమ్ సమీపిస్తుండగా లోపల నుండి పకపకా నవ్వులు ఆమె చెవిలో పడ్డాయి. '

" హు, మొదలయిందన్నమాట",

అనుకుంటూ వెళ్లి తన సీట్లో కూలబడింది. ఆ స్కూల్లో రెణ్ణెల్ల క్రితం జాయినయింది వసుధ. రజని, రాధిక, లలితలతో పాటు తనకూ ఇదే పీరియడ్ లీజర్ అవర్. ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి చర్చిస్తూ వాళ్ళ పరోక్షంలో వాళ్ల గురించి విమర్శలు చేస్తూ, జోకులేసుకుంటూ పడీ పడీ నవ్వుకుంటుంటారు ముగ్గురూ. వాళ్ల ధోరణి ఎంత మాత్రమూ నచ్చని వసుధ తప్పనిసరై ఆ నలభై అయిదు నిమిషాలూ భరిస్తూ ఏదో రాసుకుంటూనో, చదువుకుంటూనో గడిపేస్తూ ఉంటుంది. 

  "....అయితే లలితా, మీ అత్తగారు మూడురోజుల మౌనవ్రతం విరమించిందన్నమాట.... " 

 రాధిక అనగానే రజని కిసుక్కున నవ్వి, 

" అంతేగా మరి,..." అంది. 

 వెంటనే లలిత, 

"ఏం చేయను, నా కర్మ మరి.. " అంటూ తలపట్టుకుంది. 

 లలిత తన ఇంటి విషయాలు చెప్పడం, ఆ ఇద్దరూ కామెంట్స్ చేయడం రోజూ జరిగే తతంగమే. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వీళ్ళు ఎందుకిలా స్థాయిని మరిచి ప్రవర్తిస్తారో అనుకుంటూ తనలో తనే మదన పడుతూ ఉంటుంది వసుధ. ఈమధ్య వీళ్ళ ధోరణి చూస్తుంటే తనకు తన పొరుగింట్లో ఉండే వర్ధనమ్మ గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడ సాయంత్రాలు తన ఇంటికి ఏదో మిష మీద వచ్చి, తన అత్తగారితో పిచ్చాపాటీ మాట్లాడుతూ అడపాదడపా తన కోడలి గురించి అవాకులు, చెవాకులూ పేలుతూ ఉంటుంది. పాపం, ఆ అమాయకురాలు ఉదయం నుండీ రాత్రి దాకా ఇంటిల్లిపాదికీ వండి వార్చుతూ సతమతమౌతుంటే, ఈవిడ కనీసం లేశమాత్రం అభిమానం అన్నది కూడా చూపక అందరి దగ్గరా ఇలా కోడలు గురించి చెడుగా చెప్తూ ఉంటుంది. అందులో ఆమె పొందే ఆనందం ఏమిటో తనకి అర్థం కాదు. 

   ఒకసారి ఆకస్మాత్తుగా వసుధకనిపించింది, తను ఇంట్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేనప్పుడు తన గురించి కూడా తన అత్తగారు ఈవిడకు ఇలాగే చెబుతుందా? కానీ వెంటనే సర్ది చెప్పుకుంది, ఆవిడ గడప దాటి బయటకు వెళ్లడమే తక్కువ. వెళ్లినా పెద్దగా నోరు విప్పే రకం కాదు అని. కానీ తనకు నచ్చని విషయం ఏమిటంటే-- వర్ధనమ్మ కోడలి గురించి అలా చెప్తూ ఉంటే తన అత్తగారు అసలు ఖండించదు, ఆసక్తిగా వింటూ ఉంటుందంతే. వినే వాళ్ళు ఉంటేనే కదా చెప్పే వాళ్ళు ఉంటారు! ఒక్కోసారి మధ్యలో దూరి అభ్యంతర పెడదామనిపిస్తుంది వసుధకు. కానీ-- వాళ్లు పాతతరం వాళ్లు. చదువు సంధ్య లేని వాళ్ళు. వయసులో పెద్ద వాళ్లు. ఎలా వాళ్లకు నీతులు బోధించగలదు? చెప్పినా వింటారా? విన్నా పాటిస్తారా? అనవసరంగా తన గురించి ఏదేదో అక్కడక్కడా వాగడం చేస్తారు గానీ ! దాంతో ఆ ఆలోచన పూర్తిగా విరమించేసుకుంది వసుధ. అయినా చాలాకాలంగా ఓ విషయం గమనిస్తూ ఉంది తను. ఈ కోవకు చెందిన ఆడవాళ్ళు( దీనికి వయసుతో నిమిత్తం లేదు) బాగా చదువుకుని,ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీల కంటే ఎంతో తెలివైనవాళ్ళు, మాటకారితనం గలవారు, ఇంకా లోకజ్ఞానం కూడా ఉన్నవాళ్ళన్నది ఇన్నేళ్ల అనుభవంలో ఆమె గమనించిన మహత్తర విషయం. చదువు లేదు కదాని దేవుడు వీళ్లకీ సౌలభ్యాలన్నీ వరంగా ప్రసాదించాడేమో అన్పిస్తూ ఉంటుంది వసుధకొక్కోసారి. 

    వీళ్లు ఇలా ఉన్నారు సరే, కానీ ఈ పంతులమ్మల్ని చూస్తూ ఉంటే ఆమెకు ఆశ్యర్యం వెల్లువెత్తుతూ ఉంటుంది. ఇంత చదువూ చదివి, పదిమందిలో ఉద్యోగాలు వెలగబెడుతూ ఏమిటీ వీళ్ళ ధోరణి ! సంస్కారమన్నది మరిచి ! ఆ ముగ్గుర్నీ గమనిస్తూ వస్తున్న వసుధకు లలిత ఎందుకో ఒకింత ప్రత్యేకంగా కనిపించింది. రెణ్నెళ్లుగా చూస్తోంది, తన మాటల్లో ఏదో అమాయకత్వం దోబూచులాడుతూ ఉంటుంది. 

 " ఇంటివద్ద పెద్దవాళ్ళను నేను ఎలాగూ అడ్డుకోలేను, కానీ...... " 

వసుధ అలా ఆలోచిస్తుండగానే బెల్ మోగింది. లేచి, నెక్స్ట్ క్లాస్ కు బయలుదేరింది. 

                        ******************

   మరుసటి రోజు క్లాస్ అవగానే వడివడిగా అడుగులేస్తూ కదిలిన వసుధకు స్టాఫ్ రూమ్ సమీపిస్తుండగా ఎదురయ్యింది లలిత. తను కోరుకున్నదీ అదే. 

  " లలితా, తలనొప్పిగా ఉంది, టీ తాగొద్దాం, వస్తావా.... "అంటూ అడిగింది వసుధ. 

 ఇంతవరకూ ఎన్నడూ క్యాంటీన్ కు రాని వసుధ అలా అడిగే సరికి కాదనలేక, ' పదండి " అంటూ దారితీసింది లలిత. ఇద్దరూ వెళ్లి క్యాంటీన్ లో కూర్చుని టీ చెప్పారు. రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత వసుధ మెల్లిగా మొదలెట్టింది. 

" లలితా, ఏమీ అనుకోనంటే సుత్తి లేకుండా సూటిగా ఓ మాట అడుగుతాను ఏమి అనుకోరు కదా.. "

 ఇలా వసుధ తనను క్యాంటీన్ కు తీసుకురావడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని ఊహించిన లలిత పెద్దగా ఆశ్చర్యపోలేదు. వసుధనే చూస్తూ, 

" చెప్పండి, పరవాలేదు " అంది. 

"  మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అలా స్టాఫ్ రూములో అందరికీ ఎందుకు చెప్తుంటారు? 

చివ్వున వసుధ మొహంలోకి చూసింది లలిత. 

"....ఒక్క విషయం మీరు గమనించారా? ఎంతసేపూ మీరు మీ విషయాలు చెప్తుంటారు గానీ, వాళ్ళిద్దరూ వాళ్ల స్వవిషయాలు ఎప్పుడూ మీతో పంచుకోవడం నేను వినలేదు... "

చెళ్లుమని కొరడాతో కొట్టినట్లయింది లలితకు. ఒక్కసారిగా ఫ్లాష్ వెలిగిందామెలో. నిజమే! తన వ్యక్తిగత విషయాలు చెప్తూ వాళ్ల గురించి కూడా అడిగితే వెంటనే మరేదో చెప్తూ వెంటనే దాటవేసే వారిద్దరూ. తన గురించి అన్ని విషయాలూ వాళ్లకు తెలుసు కానీ వాళ్ల కుటుంబాల గురించి ఇంతవరకూ తనకు ఏ మాత్రం తెలీదు. 

 వసుధ అందుకుంది. 

"...వాళ్ల గురించి చెడుగా చెప్పడం నా ఉద్దేశం కాదు లలితా, కొందరుంటారు, చాలా తెలివిగా, మరింత తీయగా మన గురించి అన్నీ ఆరా తీస్తారు. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ అందరికీ చేరవేస్తూ ఉంటారు. అదో మానసికానందం వాళ్లకు. ఈ విషయం నేను బాగా గమనించాను. నీ మనస్తత్వం నాకు అర్థమైపోయి, ఓ కొలీగ్ గా కాక ఓ తోబుట్టువుగా భావించి  ఎందుకో చెప్పాలనిపించింది.... "

 లలిత కళ్లలో సన్నటి నీటి పొర! ఎంతో మౌనంగా, గుంభనంగా కనిపించే వసుధలో ఇంత లోతైన ఆలోచనలా ! ఎప్పుడూ అసంబద్ధంగా లొడలొడా వాగే తనకూ, వసుధకూ ఎంత తేడా! ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ తన మేలు కోసమే చెప్తోంది. 

".....మన ఇంటి వ్యవహారాలు ఇంటి గడప లోపల ఉంటేనే మనకు గౌరవం. నాకూ ఇంటి నుండి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ బయట వాళ్ళతో చెప్పుకుంటే పోయేది నా పరువే. ముఖ్యంగా అత్తా కోడళ్ళు ఈ విషయం ఎరిగి మసలుకోవాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్ళిద్దరూ కుటుంబం పరువు ప్రతిష్టలనుకుంటాను... "

 వసుధ చేతిమీద లలిత చేయి వేసి మెల్లిగా స్పృశించింది. ఆమె కళ్ళలో భావం చూసిన వసుధకు ఇంతకన్నా చెప్పడం అనవసరం అనిపించింది. 

" వసుధ గారు, నిజం చెప్పారు, మా ఆయన అదోరకం. నా బాధ ఆయన కెన్నడూ పట్టదు. అన్నీ తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఒత్తిడి భరించలేని నేను ఇలా అందరి ముందూ బయట పడిపోతుంటాను. అంతేగానీ నన్ను నేను అందరి ముందూ చులకన చేసుకుంటున్నానన్న ఆలోచన ఇంతవరకు రాలేదు. మీకు చాలా చాలా థాంక్స్..... " 

"....అర్థం చేసుకుంటావన్న నమ్మకంతోనే సాహసించి చెప్పాను, లలితా. నేనే మీకు థాంక్స్ చెప్పాలి...." 

వాచీ చూసుకుంటూ లేస్తూ అంది వసుధ. 

 ఇద్దరూ వాళ్ల క్లాసులవేపు కదిలారు. వసుధలో ఓ తృప్తి ! రాత్రంతా ఆలోచించిన ఫలితం!! లలితలో అంతర్మధనం మొదలైంది. వసుధక్కావలసిందీ అదే !

                        ************

  నిజమే కదా! అత్తాకోడళ్ళిద్దరూ ఇంటికి మూలస్తంభాలు. కుటుంబం పరువుప్రతిష్ఠలు. అవి నిత్యం కాపాడ్డం వాళ్ల బాధ్యతే కదా మరి!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                 

Sunday, February 2, 2025

పెడదారుల్లో సాంకేతికత...

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

                   
                                                  ~ యం. ధరిత్రీ దేవి 
📲☎️📠

 ఒకప్పుడు ఏదైనా సమాచారం చేరవేయాలంటే రెండు మూడు రోజులైనా పట్టేది. ఇప్పుడు...సెల్ ఫోన్లు వచ్చాక విదేశాల్లో ఉండే వాళ్ళతో కూడా రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికత పుణ్యమాని ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్నవారిని ఇక్కడ మన ఇంట్లోనే కూర్చుని చూస్తూ మాట్లాడే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. బయట షాపుల్లోకి వెళ్లి అన్ని వీధులూ తిరిగే శ్రమా, ఖర్చు తప్పి ఆన్లైన్ షాపింగులూ వచ్చాయి. ఇదంతా నేటి ఆధునికతను ప్రతిబింబిస్తోంది.
   పూర్వం పావురాలతో సందేశాలు పంపించేవారని విన్నాం. అటుపిమ్మట  ఎంత దూరమైనా సరే కాలినడకన మనుషులే వెళ్లేవారట! కాలక్రమేణా  తపాలా శాఖ పుణ్యమాని ఉత్తరాలు రాసుకోవడం మొదలైంది. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్ సేవలు అన్నవి అందుబాటులోకి వచ్చాయి. రాను రాను సాంకేతికత పెరిగిపోయి ల్యాండ్ ఫోన్లన్నవి మొదట కార్యాలయాల్లో, తర్వాత  ప్రతి ఇంటిలో కొలువుదీరిపోయాయి. ఆ తర్వాతే మొదలైంది సెల్ ఫోన్ల ఆవిర్భావం! ఇంకేముంది! కొత్తనీరొస్తే పాత నీరు పారిపోవాల్సిందేకదా!! దాంతో.. క్రమంగా ముందున్నవన్నీ అదృశ్యమైపోయాయి.
    ఇంతవరకూ బాగానే ఉంది. శతాబ్దాలు గడిచి ఆదిమానవుడు నవనాగరీకుడయ్యాడు. కంప్యూటర్ యుగం వచ్చి సాంకేతికత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఏ పనైనా నిమిషాల్లో సునాయాసంగా జరిగిపోతోంది. సంతోషించవలసిన పరిణామమే ! కానీ...మరో వంక మనస్థాపానికి లోనయ్యే దుస్థితి కూడా సంభవించడం శోచనీయం. సాంకేతికత విజృంభణతో మార్కెట్లోకి జెట్ స్పీడుతో ప్రవేశించిన స్మార్ట్ ఫోన్లు జనాల్ని ఆకర్షించి ఆకట్టుకున్న వైనం మాటల్లో చెప్పలేనిది. మొదట్లో అవసరాలకు మాత్రమే అన్నట్లుగా ఉన్న ఈ ఫోన్లు రాను రాను యువతనే కాక చిన్న పిల్లలను సైతం జాడ్యంలా పట్టుకున్నాయని చెప్పక తప్పదు.
   పెద్దలు ఎప్పుడో అన్నారు..., "అతి సర్వత్రా వర్జయేత్ " అని ! ఎందుకంటే.. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ప్రయోజనం. ఆ గీత దాటితే.. తిప్పలు తప్పవు.. అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి!
   యువతీ యువకుల మధ్య అవసరానికి మించిన సంభాషణలు, వేళాపాళా లేకుండా సందేశాలు, ఫోటోలు,వీడియోలు పంపుకోవడాలు... ఒక్కటేమిటి!! అవి శృతిమించి పక్కదారి పట్టి వాళ్ల జీవితాల్ని సమస్యల సుడిగుండాల్లోకి నెట్టడం!! ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో దారుణాల్ని వినాల్సి, చూడాల్సి వస్తోంది.
   సాంకేతికతను సక్రమంగా ఉపయోగించుకుంటే సామాన్యులు సైతం సత్ఫలితాలు పొంది సంతోషించే అవకాశం ఉంటుంది. కానీ, విచారించదగ్గ విషయం ఏమిటంటే..నాగరికత వెర్రితలలు వేస్తూ అద్భుతమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం కొన్ని దుష్టశక్తుల చేతజిక్కి దుర్వినియోగం అవుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. అందులో మచ్చుకు కొన్ని----
* ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చడం వల్ల ఏదేని నేరం జరిగినప్పుడు వాటిలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నేరగాళ్లని గుర్తించే వీలు ఉంటుంది. ఇది ఉపయోగమైతే....
 షాపింగ్ మాల్స్ లోనూ, మరికొన్ని చోట్ల టాయిలెట్స్ లోనూ ఇలాంటి కెమెరాలు అమర్చి తర్వాత వాటిని ఇతరులకు చేరవేస్తూ అమ్మాయిల, తద్వారా వారి కుటుంబ పరువు మర్యాదల్ని మంటగలపడం... మానసికంగా వేధించడం..! ఇత్యాదివన్నీ మాటల్లో చెప్పలేనంత దుర్వినియోగం కిందకి వస్తాయి.
   విద్యావంతులనబడే వారు సైతం ఇలాంటి అసాంఘిక నేర ప్రవృత్తుల్ని రెచ్చగొడుతూ నైతిక విలువలను దిగజారుస్తున్నారు. ఇదిలాగుంటే.. మరోపక్క ఆన్లైన్ మోసాలు !!
* మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లో మన డబ్బు మాయమై పోవడం !
* మనకు చెందిన భూములు మరొకరి పేర మార్చబడడం! జరిగిన విపత్తు ఎప్పటికోగానీ వారి దృష్టిలో పడకపోవడం.. పడ్డ తర్వాత లబోదిబోమంటూ గుండెలు బాదుకోవడం !! 
  ఇవన్నీ కూడా మనిషిని మానసికంగా కృంగదీసేవే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో!! ఈమధ్య సైబర్ నేరాల గొడవ మరీ శృతి మించిపోయి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్న కథనాలు వార్తాపత్రికల్లో తరచుగా రావడం అందరికీ విదితమే..వీటిని ఛేదించడానికి, కట్టడి చేయడానికి ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నా నేరగాళ్ళు ఏమాత్రం దారికి రావడం లేదని ఇంకా ఇంకా జరుగుతూనేఉన్న  ఈ నేరాలు తేటతెల్లం చేస్తున్నాయి.
   ఒకప్పుడు నిరక్షరాస్యులు కూడా బయట పనులన్నీ స్వయానా చెక్కపెట్టుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు సైతం కాల్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఏ పనులు సకాలంలో సజావుగా సాగక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
   ఏ టెక్నాలజీ లేని కాలంలోనే మనిషి అంతో ఇంతో  ప్రశాంతంగా జీవించేవాడు.  కానీ ఈ కంప్యూటర్ యుగంలో మనశ్శాంతి కరువైపోయింది మనిషికి. కారణం...ఎంతో విలువైన మనిషి మేధస్సు మలినమైపోవడమే! అలా జరగకూడదు అంటే.. ఏది మంచి, ఏది చెడు అన్న చిన్నపాటి ఆలోచన నేర ప్రవృత్తి గలవాళ్లలో మొదలవ్వాలి. రేయింబవళ్ళు కష్టపడి తమ విజ్ఞానాన్ని ధారపోసి, కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్న మేధావుల శ్రమ కొందరి స్వార్థపూరిత దురాలోచనలకు లోనై సమాజంలో విష సంస్కృతిని నెలకొల్పడం ఎంత మాత్రమూ అభిలషణీయం కాదు.
   ఆధునిక పరిజ్ఞానం జనాల్ని ప్రగతి బాట పట్టించాలి గానీ పక్క దారి కాదు కదా!!

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️