Friday, May 31, 2024

ఎవరు వింటారు నోరున్న మనుషుల ఆర్తనాదాలు...!!

 **************************************
🐕🐶

వీధివీధినా విచ్చలవిడిగా 
విహరించే వీధి శునకాలు..
అడ్డు అదుపూ లేక....
సమయం సందర్భం గానక..
చెవులు చిల్లులు పడేలా 
భౌభౌమంటూ అరుపులు..
ఆ వీధి కుక్క పొరబడి 
ఈ వీధిని అడుగిడెనా...
తమ సామ్రాజ్యమేదో 
ఆక్రమించినంతగా రగులుతాయి 
రౌద్రా వేశాలు..!
మానవజాతిని మించి 
పెచ్చరిల్లుతాయి పగలూ ద్వేషాలు!!
ఆ గగ్గోలు తాళలేక 
జడుసుకుంటూ జనాలు !!
మరోవైపు....
పురిటికందును పీక్కుతింటున్న హృదయవిదారక దృశ్యాలు!🙁
పసివాడిపై దాడి...
నూరేళ్ళ వాడి బ్రతుకు సమాధి !!😓
మిన్నంటిన ఆప్తుల రోదనలు!
తప్పని జీవితకాల వేదనలు !!
చిత్రం! జాతి ఒక్కటే..!
పెంపుడు కుక్కలకూ 
వీధికుక్కలకూ క్షణం పడదాయె !!
విశ్వాసానికి మారుపేరంటారే...
మరి.. ఈ కొరగాని బుద్ధి బహువింతే !
అనాదిగా ఉంటోందిగా ఇంటికి కాపలా 
యజమానికి అదో ఆసరా.. భరోసా..
పిడికెడు మెతుకులు విదిలిస్తే 
వదలక వేళ్ళాడే మూగప్రాణి ఇది కదా!
పెంపుడు జంతువుగా ముందు వరుసలో మున్ముందుగా నిలిచి మది గెలిచే 
సాధుజీవి ఇది కాక ఇలను 
ఇంకొకటున్నదా !మరి..నేడు...
క్రూర జంతువుగా 
నలుగురి నోళ్లలో నానుతూ 
నిందలు మోయుచున్నదే...!అకటా !!
జాతి రక్షణ మన ధర్మం 
జనాల పరిరక్షణ కాదే అప్రాధాన్యం...
నోరులేని జీవులకు 
హాని చేయరాదంటూ చట్టాలు...
ఎవరు వింటారు...?!
నోరున్న మనుషుల ఆర్తనాదాలు...!!
అందుకే మరి...!
ఈ వీధి కుక్కల బెడద 
ఇంతింత కాదయా...
భరించడం తప్ప దారి 
వేరే  లేనే లేదా...!!!😞
పరిష్కారం ఏదయా ??? !
దారి చూపవా దయామయా... 😂

********************************




Thursday, May 23, 2024

కనిపించని కోయిల... వినిపించిందిలా...!


                       🦜

సంధ్యాసమయం...
వర్షం కురిసి వెలిసిన క్షణం...
కనిపించని కోయిల...
వినిపించిందిలా...
వెతికాను కొమ్మల్లో... 
కొమ్మ చాటు రెమ్మల్లో..
బదులిచ్చింది వీనుల విందుగ..
కుహూ కుహూ...అంటూ...
ఆ గొంతులో  కమ్మదనం...!
ఆ గానంలో మాధుర్యం..!
అనిర్వచనీయం..!
అనితరసాధ్యం..!
అదిగో మళ్ళీ..మళ్లీ మళ్లీ..కూస్తోంది..
కాదు కాదు.. పాడుతోంది..
కుహూ కుహూ అంటూ...! 
అది కోకిల గానం...!
పరవశిస్తూ... పరవశింప  జేస్తూ...
అలా... కనిపించని కోయిల...
నాకు వినిపించిందిలా..!!  🦜

🤱🌺🤱🌺🤱🌺🤱🌺🤱🌺🤱🌺🤱🌺




Monday, May 20, 2024

హ్యాండ్ బ్యాగ్

ఓ కథ కాని కథ 
--------------------   😊
      ' వదినా, రెడీయా? ' 
 గేటు చప్పుడు ఆ వెంటనే వసంత పిలుపు వినిపించడంతో హడావిడిగా చీర కుచ్చిళ్ళు దోపుకుంటూ, 
" ఆ, రెడీయే !ఒక్క నిమిషం, రా, వచ్చి కూర్చో వసంతా ' అంటూ లోపలి నుంచే ఆహ్వానం పలికింది ప్రసూనాంబ.
  వసంత, ప్రసూనాంబ ఇద్దరూ ఒకే వీధిలో ఉంటున్నారు. ఇద్దరూ ఇంటిపట్టున ఉండే గృహిణులే. భర్తలు వాళ్ల వాళ్ల ఉద్యోగ నిర్వహణ మీద, పిల్లలేమొ స్కూళ్లకు బయటికి వెళ్ళగానే పనులన్నీ ముగించుకుని, పిచ్చాపాటి కోసం ఒకరిళ్లకొకరు వెళ్తుంటారు. దాదాపు నాలుగేళ్లుగా ఒకే చోట ఉంటున్నందుకో ఏమో ఇద్దరూ బాగా స్నేహితులై పోయారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరగడానికి కారణం నెలకు కనీసం ఒక్కసారైనా వారు చేసే రకరకాల షాపింగ్ లేనంటే అతిశయోక్తి కాదేమో! మరీ ముఖ్యంగా ఆ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ అంటూ వస్త్ర దుకాణాలవాళ్ళు చేసే హంగామా వీళ్లను నిలబడనీయదు. దాంతో వీళ్లకు ఎక్కడ లేని ఉత్సాహం ముంచుకొచ్చి, వెంటనే వెళ్లి ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చేసుకుంటే గానీ నిద్ర పట్టదు. రాను రానూ అదొక వ్యసనం అయిపోయింది ఇద్దరికీ. ఇప్పుడు కూడా అంతే. దసరా పండుగ సందర్భంగా యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటూ టీవీల్లో ఒకటే మోత ! అది చాలదన్నట్టు నాలుగు రోజుల నుండి వీధి వీధీ తిరుగుతూ వ్యాన్లలో, ఆటోల్లో మైకుల ద్వారా ఒకటే అరుపులు!
  దీంతో వసంత, ప్రసూనాంబ లకు మళ్లీ పనివడినట్లయింది. రెండ్రోజుల క్రితమే ఇద్దరూ సమావేశమై ఈరోజు ఒంటి గంటకంతా భోంచేసి మరీ షాపింగ్ కు బయలుదేరాలని ప్రోగ్రాం నిర్ణయించేసుకున్నారు, ఎటొచ్చి బయటకెళ్లిన భర్త, పిల్లలు ఇద్దరిళ్లలోనూ ఇల్లు చేరేది సాయంత్రం నాలుగు తర్వాతే కాబట్టి.
  కానీ, ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రసూనాంబ కెందుకో లోపల గుబులుగా ఉంది. దానికి కారణం లేకపోలేదు. దాదాపు నెలా రెండు నెలల నుంచీ వింటున్న దొంగతనాల వార్తలు -- అదీ, ఇటీవలే వాళ్ల వీధిలోనే రెండిళ్లలో కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే జరిగినవి తలచుకుంటే గుండె గుభిల్లుమంటోందామెకు. రెండు మూడు గంటలు ఇంటికి తాళం వేసి వెళ్ళినా చాలు, తాళాలు పగులగొట్టి ఇంట్లో దూరి పోతున్నారు దొంగలు, అదీ పట్టపగలే !
  ఇదిలాగుంటే  -- వారం క్రితం పేపర్లో వార్త మరీ చోద్యంలా అనిపించింది. ఒకావిడ ఉదయమే లేచి ఇంటి ముంగిట కల్లాపి జల్లి ముగ్గేస్తోంటే, వెనకాలనుంచి బైకు మీద ఒకడు రివ్వుమని వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు పుటుక్కున తెంపుకుని రయ్యిమని దూసుకుపోయాట్ట  ! ఆమె తేరుకుని అరిచే లోగానే కనుమరుగైపోయి లబోదిబోమంటూ కూలబడి పోయిందట! మరో సంఘటన. ఇంకొకావిడ, ఇంటికి దగ్గర్లోనే ఉన్న రోడ్డు మీద మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే బైక్ మీద ఇద్దరు యమస్పీడుగా వెళుతూ ఆమె మెడలో గొలుసు అతి లాఘవంగా లాగేసుకుని క్షణాల్లో అదృశ్యమై పోయారట ! ఆ ఊపు కి ఆమె కిందపడిపోయి పెద్ద ప్రమాదం కాస్తలో తప్పిపోయిందన్న వార్త అంతటా పాకిపోయింది. ఎంత దారుణం ! బంగారానికి ఇంట్లో ఉన్నా, ఒంటి మీద ఉన్నా రక్షణ లేకుండా పోతోందే ! ఇవన్నీ వింటూ నగలతో వీధిలో కెళ్ళాలంటే తిరిగి వాటితో తిరిగి వస్తామా అన్న శంక వేధిస్తోంది ఆమెను. ఇంట్లో బీరువాలో దాచి, ఒకట్రెండు రోజులు అత్యవసరమై ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. పోనీ ఏదైనా బ్యాంకులో లాకర్ తీసుకొని అందులో ఉంచేద్దామా అంటే హఠాత్తుగా ఏ శుభకార్యమో అనుకోకుండా పడిందంటే మరీ బొత్తిగా బోసి మెడతో ఎలా వెళ్ళగలం? ఈ మాటే ఓసారి వసంతతో అంటే తను తేలిగ్గా కొట్టి పారేసింది
   నగల కోసం ప్రాణాలు కూడా తీస్తున్నారన్న వార్తలు అడపాదడపా వింటుంటే ప్రసూనాంబకు ఠారెత్తి పోతోంది. భర్త కష్టార్జితంతో ఎంతో పొదుపుగా దాచుకున్న డబ్బుతో కొన్న రెండు మూడు నగలు ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది ఇన్నేళ్లుగా. అవి కాస్తా దొంగల పాలయితే ! అమ్మో! ఇంకేమైనా ఉందా! జన్మలో మళ్ళీ చేయించుకోగలదా? 
   ఇన్నాళ్లుగా షాపింగ్ అంటే ఎంతో హుషారుగా బయలుదేరే ఆమెకు ఈమధ్య ఇదే దిగులు పట్టిపీడించ సాగింది. తాళం వేసి వెళ్తే తిరిగి వచ్చేలోగా ఏ దొంగ వెధవో ఇంట్లో దూరి, ఉన్న నగానట్రా కాస్త దోచుకుని పోతే తన గతేం కాను?  ఇదీ ఆమెను ప్రస్తుతం వేధిస్తున్న సమస్య. అందుకే ఎప్పట్లా హుషారుగా ఉండ లేక పోతోంది. దీనికి పరిష్కారం ఏమిటబ్బాఅన్న  ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోతోంది.
 ఆమె ఆలోచనలిలా సాగిపోతూండగా  -- లోనికి వచ్చిన వసంతను అన్యమనస్కంగానే కూర్చోమని చెప్పి, లోపలికెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటకు రాబోతూ, క్షణంలో మెరుపులా ఓ ఆలోచన రావడంతో ఠక్కున ఆగిపోయింది.
" నిజమే, అలా చేస్తే పోలా,.... " అనుకుంటూ అంతటి దివ్యమైన ఆలోచన వచ్చినందుకు తనను తానే లోలోపల అభినందించుకుంటూ గబగబా లోనికెళ్ళి ఐదు నిమిషాల్లో హుషారుగా బయటకొచ్చేసింది. ఇద్దరూ కలిసి బిలబిలమంటూ ఆటో ఎక్కి షాపింగ్ సెంటర్ కు పోనిమ్మన్నారు. దాదాపు మూడు గంటలు అన్ని షాపులూ తెగ తిరిగి చెరో రెండు వేలు ఖర్చు చేసి, రెండేసి ప్యాకెట్లు పట్టుకుని బయట పడ్డారు.
   అసలే ఎండలు మండిపోతున్నాయి. అంతవరకూ తెలీని శ్రమ ఆటో ఎక్కగానే తెలిసొచ్చి, ఇద్దరూ రిలాక్స్ అయిపోయారు. ప్రసూనాంబ అంతవరకూ చేత్తో జాగ్రత్తగా పట్టుకున్న ప్యాకెట్లను ఆటోలో పక్కన పెట్టుకుని కర్చీఫ్ తీసుకుని మొహాన పట్టిన చెమటంతా తుడుచుకొంది. 
    మరో ఇరవై నిమిషాల్లో ఇద్దరూ ఇంటికి దగ్గర్లో రోడ్డుపై ఆటో దిగారు. ఇద్దరికీ కలిపి వసంతే ఆటో వాడికి డబ్బిచ్చేసింది. ప్యాకెట్లు పట్టుకొని ఆనందంగా నవ్వుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరిపోయారు.
  వాకిట్లోనే ఎదురైన భర్త ప్రకాశరావు ను చూసి సంతోషంతో డిస్కౌంట్ లో తాను చవగ్గా కొట్టేసిన చీరలు చూపిద్దామని గబగబా ఇంట్లోకి వెళ్లిన ప్రసూనాంబ చేతుల్లో ఉన్న ప్యాకెట్లు టీపాయ్ మీద పెట్టేసింది. ఉన్నట్టుండి గుర్తొచ్చి, హ్యాండ్ బ్యాగ్ కోసం చూసింది. అది కనిపించలేదు. ఒక్కసారిగా గుండె గుభిల్లుమనగా కెవ్వున కేకేసింది. కంగారుగా వచ్చిన ప్రకాశరావు కొయ్యబారిపోయిన భార్యను చూసి ఆమెను పట్టుకొని గట్టిగా కుదిపాడు. 
    ప్రసూనాంబ బిత్తర చూపుల్తో టీపాయ్ వేపు చేయి చూపిస్తూ, 
" బ్యాగ్... నా హ్యాండ్ బ్యాగ్....." 
 అంటూ అక్కడ కనిపించని తన హ్యాండ్ బ్యాగ్ కోసం కళ్ళతో వెతుకుతూ నోట మాట రాక అచేతనంగా నిలబడిపోయింది.
  ఆటోలో చీరల ప్యాకెట్ల తో పాటు అనాలోచితంగా హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టి, దిగేటప్పుడు ప్యాకెట్లు మాత్రమే పట్టుకుని దిగిన ప్రసూనాంబ కు తన హ్యాండ్ బ్యాగ్ ఆటోలోనే ఉండి పోయిందన్న విషయం స్పురణకు రాగానే ఒక్కసారిగా ఆమె గుండె లయ తప్పింది.
   షాపింగ్ కి వెళ్లేముందు తనకు వచ్చిన దివ్యమైన ఆలోచనతో ( అతి జాగ్రత్తతో ) లోనికి వెళ్లి బీరువాలో భద్రంగా దాచుకున్న లాంగ్ చైన్, రెండు జతల గాజులు, మూడు తులాల నెక్లెస్-- అన్నీ గబ గబా తీసి తన హ్యాండ్ బ్యాగులో పడేసుకున్న వైనం గుర్తొచ్చి, భర్త వైపు చూస్తూ గుడ్లు తేలేసింది.

*************************************
                🌺 భువి భావనలు 🌺
*************************************
    
    

Saturday, May 11, 2024

మేమే వస్తున్నాం తల్లీ... చిన్న కథ

🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱
  
  మధ్యాహ్నం వంటింట్లో ఉన్న శాంతమ్మ ఫోన్ రింగ వ్వడం విని కొంగుతో ధారగా కారుతున్న చెమట తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి సెల్ అందుకుంది. కూతురు వనజ..
" అమ్మా, ఏం చేస్తున్నావు? "
" ఈ టైంలో ఏం చేస్తాను...! వంటింట్లో ఉన్నాను.. "
" సరె సరే గానీ.. వచ్చే శుక్రవారం నాడు నేను,పిల్లలు,ఆయన అందరం వస్తున్నాం. మదర్స్ డే కదా..!"
గుండె గుభిల్లుమంది శాంతమ్మకు. ఒక్కసారి గత సంవత్సరం  మదర్స్ డే ఆమె కళ్ళ ముందు కదలాడింది. తల్లిని సంతోషపెట్టాలని కూతురు, ఇద్దరు కొడుకులు అనుకోవడం వరకు  బాగానే ఉంది గానీ.. ఆ నెపంతో పిల్లాజెల్లా తో అంతా దిగిపోయి తల్లిని మరింత హైరానా పెడుతున్నామన్న ఆలోచనైతే వాళ్లకు ఏకోశానా రాకపోవడం ఆమెకు ఎందుకో ఓ మూల బాధనిపించింది. పోయినసారి ఇలాగే ఫోన్ చేసి, తనే కాక ఇద్దరు తమ్ముళ్లకూ విషయం చేరవేసి వాళ్లనూ సమాయత్తం చేసేసింది. ఆ విధంగా అందరూ కలిసి మదర్స్ డే కి రెండు రోజులు ముందే అమ్మానాన్నల ముందు వాలిపోయారు. ఇప్పుడు మళ్లీ ఈ ఫోన్..!!
   పేరుకు తగ్గట్టే శాంతమ్మకు సహనం, దాంతోపాటు ఓపిక ఎక్కువే. విసుక్కోకుండా ఇంటిల్లిపాదికీ వండి వార్చడమే కాకుండా అన్ని సేవలు చిరునవ్వుతో చేస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఉగాది,దసరా సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు అన్నింటికీ ముగ్గురు పిల్లలు వాళ్ల పిల్లల్ని తీసుకుని రావడం ఏళ్లుగా సాగుతున్నదే. అల్లుళ్ళు, కోడళ్ళు సరే సరి..  గతేడాది నుండీ వనజ ఈ మదర్స్ డే అన్నది కొత్తగా కనిపెట్టింది. అంతటితో ఊరుకోక ఇద్దరు తమ్ముళ్లనీ ఉసిగొలిపింది. పెద్దదానిగా పుట్టింది... తనూ ఇద్దరు ఆడపిల్లల తల్లి  అయింది. కానీ ఏమాత్రం అర్థం,అవగాహన లేక తల్లిదండ్రుల శ్రమ,ఆరోగ్యం,వయసు దృష్టిలోకి తీసుకోకుండా ఇలా ప్రవర్తించడం తండ్రి నారాయణమూర్తికి ఏమాత్రం నచ్చలేదు.కానీ ఏంచేయ గలడు... కడుపున పుట్టిన పిల్లలాయే!
   అలా పోయినసారి మదర్స్ డే అంటూవచ్చారా.. తల్లికి వంటింట్లో కాస్త చేయందుకోవాలా...! అబ్బే...! ఒకరోజు సినిమా అంటూ, ఇంకో రోజు  షాపింగ్ అంటూ ఆరుగురు పిల్లల్ని ఇంట్లో వదిలేసి మూడు జంటలూ పొలోమని తిరిగి రావడం...! ఇక్కడ పిల్లలు అంతా ఇల్లు పీకి పందిరేయడం! వాళ్లను కంట్రోల్ లో పెట్టలేక తామిద్దరూ బేజారయిపోవడం!! పోనీ... బయటికి వెళ్ళిన వాళ్ళు బయటే ఏదో ఒకటి తినేసి వస్తారా  అంటే... అదీ లేదు... వస్తూనే వంటింట్లో దూరి ఆవురావురంటూ అమ్మ చేతి వంట తినేయడం...!
    మదర్స్ డే అన్నారా...! ఆరోజన్నా వంటింట్లో  చేరి కూతురు గానీ,కోడళ్లు గానీ పెద్దావిడకు సాయం చేశారా అంటే... అహ... ఎక్కడ తీరింది వాళ్ళకి! వాళ్ల షోకులు.. పిల్లల్ని తయారు చేయడాలు!అదే సరిపోయే!మగవాళ్లేమో టీ వీ కి అతుక్కుపోయారు.    సాయంత్రం ఇద్దరినీ కూర్చోబెట్టి ఓ పూలదండ ఇద్దరికీ చుట్టబెట్టేశారు. ఓ బొకే అందించి, చెరో స్వీట్ ముక్క నోట్లో కుక్కేశారు. అదీ... వాళ్ల మదర్స్ డే సెలబ్రేషన్!
 కనీసం తల్లికి ఓ చీర బహుకరించాలన్న ధ్యాస కూడా ముగ్గురు ఆడవాళ్లకు ఏకోశానా పట్టలేదు. వెళ్ళేటప్పుడు  భార్య పోరగా పిల్లలందరికి చేతుల్లో తలా ఓ ఐదొందలు పెట్టి సాగనంపారు. ఆ తర్వాత వారం రోజులు భార్య మంచానపడ్డ సంగతి ఆయన ఇంకా మర్చిపోలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా... ఎందుకో గతసంవత్సరం నుండే ఆయనలో అంతర్మధనం మొదలైంది. అరవై దాటిన భార్యను అడపాదడపా పలకరిస్తున్న అనారోగ్య సమస్యలు, ప్రయాసపడుతూ పనివత్తిడిని ఆమె ఎదుర్కొంటున్న తీరు... ఆయన్ని పరిష్కారం కోసం వెతికేలా పురికొల్పాయి. అక్కడే పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న ఆయన కూతురుతో భార్య మాట్లాడటం చూశాడు. ఆమె ముఖంలో మారిన రంగుల్ని గమనించిన ఆయన వెంటనే విషయం గ్రహించాడు.తాను ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైందనిపించి, ఆ వెంటనే లేచి భార్య చేతిలో ఫోన్ అందుకున్నాడు.
" హలో వనజ,బాగున్నావా తల్లీ.."
" బాగున్నా నాన్నా... "
" ఏమిటి చెప్పు తల్లి విశేషాలు... "
" ఏమీ లేదు నాన్న.. మదర్స్ డే వస్తోంది కదా... అక్కడికి రావాలని ప్లాన్ చేస్తున్నాం. తమ్ముళ్లకు కూడా ఫోన్ చేశాను... "
" అలాగా.. కానీ వనజమ్మా, ఈసారి మేము ఇంకోలా ప్లాన్ చేశాం కద తల్లి... "
" ఏంటి నాన్న...? "
" చాలా రోజులైంది కదా... మేము ఇల్లు వదిలి బయటకి రాక.. అందుకని ఈసారి హైదరాబాద్ మేమే మీ దగ్గరకు రావాలనుకుంటున్నాం.. ఎలాగూ తమ్ముళ్లు కూడా అక్కడే ఉంటున్నారాయే.. ముగ్గురి దగ్గర ఓ వారం పాటు గడపాలని ఉంది తల్లీ... "
 అవతల కాసేపు మౌనం...!
" వనజమ్మా,.. వింటున్నావా..? "
" ఆ.. నాన్న.. వింటున్నా.. "
" రెండు రోజుల్లో బయలుదేరి వస్తాము. మాకు,మీకు ఇద్దరికీ కాస్త వెరైటీగా ఉంటుంది... ఏమంటావ్ తల్లి.."
" అ.. అ.. అలాగే నాన్న తప్పకుండా... రండి"
 తడబాటు కప్పిపుచ్చుకుంటూ అంది.
" తమ్ముళ్లకు కూడా  ఇదే విషయం చెప్పు తల్లి... ఉంటాం మరి.. "
 ఫోన్ పెట్టేశాడు నారాయణమూర్తి. భార్య మంచితనాన్ని, ఓర్పుని భరిస్తోంది కదా అని కడుపున పుట్టిన పిల్లలు సైతం ఇలా వాడుకోవడం చూసి చూసీ విసుగు పుట్టిన ఆయన ఇక రంగంలోకి దిగక తప్పలేదు. భార్యకు సహనం తప్ప చాకచక్యం, గడసరితనం మచ్చుకైనా లేవని  ఆయనకు బాగా తెలుసు మరి...
" అయ్యో అదేంటండి అలా అనేశారు.. "
 కంగారుగా అంది శాంతమ్మ.
" మరేం పర్వాలేదు లేవే.. "
" అది కాదండి,ఈ ఎండలకు మనం గడప దాటడం లేదు.. ఇప్పుడు హైదరాబాద్ అంటే.. "
" పిచ్చి మొహమా... మనం వెల్తామా పాడా...!"
" అంటే... "
" ఎక్కడికీ వెళ్ళం. ఇక్కడే.. మన ఇంట్లోనే... మనిద్దరమే... "
" మరి వాళ్ళు ఫోన్ చేస్తే... "
" అదంతా నేను చూసుకుంటాగా... వెళ్ళు..వెళ్లి వంట పూర్తి చెయ్.. ఆకలి దంచేస్తోంది... "
 చిద్విలాసంగా నవ్వుతూ తీరిగ్గా వెళ్లి మళ్లీ పేపర్ అందుకున్నాడాయన. భర్త మనోగతం అవగతమైన  శాంతమ్మ చిరునవ్వుతో వంటింటి వైపు నడిచింది. భార్య కష్టం అర్థం చేసుకునే భర్త లభించిన ఇల్లాలికి అంతకంటే అదృష్టం మరొకటుంటుందా..!!

🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱🤱

  అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Tuesday, May 7, 2024

' నాన్నా, నాకు డబ్బు కావాలి, ఇవ్వు... ' 🌷 చిన్న కథ

   భర్త తోసిన తోపుకి విసురుగా వెళ్లి గోడకు తగిలి కింద పడిపోయింది కరుణ. ఆరేళ్ల సుధీర, నాలుగేళ్ల సురేష్ ఏడుపు లంకించుకుని ఓ మూల కూర్చుండిపోయారు. 
  " పనికి మాలిన దానా, అలసి వచ్చిన మొగుడికింత తిండి సరిగా పెట్టాలని ఉండదా నీకు... "
   అంటూ ఇంకా మీదికి వచ్చి మళ్లీ కొట్టబోయాడు వెంకట్రావు,  కానీ పిల్లలిద్దరూ భయంతో గట్టిగా అరవడంతో ఆగిపోయాడు. 
                         ***********
     కొన్నేళ్ళు గడిచాయి. 
" ఏమండీ, ఉగాది పండుగొస్తోంది కదా, బట్టలు కొనాలి..... " తలవంచుకుని మెల్లిగా అడిగింది కరుణ
    విసుక్కుంటూ ఐదొందలు చేతిలో కుక్కాడు వెంకట్రావు. 
"... నాక్కూడా బొత్తిగా చీరలు పాత పడిపోయాయి, ఓ రెండు కొనుక్కుంటాను, మరో ఐదు వందలు.... "
 కస్సుమని లేచాడతను. 
 " నోర్ముయ్, ఇక్కడరాశులేమీ పోసుకుని కూర్చోలేదు నేను నీకివ్వడానికి... వెళ్లి నీ బాబునడిగి కొనుక్కో చీరలు... "
 అంటూ విసవిసా బయటికి వెళ్లిపోయాడు. 
    పక్కనే కూర్చుని చదువుకుంటున్న సుధీర, సురేష్ మ్రాన్పడిపోయారు. వాళ్లిద్దరూ ఇప్పుడు ఎనిమిది, ఆరు తరగతుల్లోకి వచ్చేశారు. తండ్రి ఎప్పుడూ ఎందుకు అంత కోపంగా ఉంటాడో, తల్లిని ఎందుకలా
హింసిస్తుంటాడో మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల బుర్రలకు అర్ధమయ్యేది కాదు. కానీ పెరిగే కొద్దీ తండ్రి కర్కశత్వం పట్ల ఓ విధమైన ఏవగింపు కలగసాగింది.. ముఖ్యంగా సుధీరకు. తల్లి అవసరాలన్నీ ఇంకా తాతయ్యే చూడాలనడం ఆ పసిదానికి ఎంతకీ అర్థం కాని విషయం!
                             ********
   అలా అలా రెండేళ్లు భారంగా గడిచాయి. సుధీర ఇప్పుడు స్కూల్ ఫైనల్లో ఉంది. పబ్లిక్ పరీక్షలు. ఫీజు కట్టాలి. దేనికి డబ్బు కావాలన్నా ఒకటికి నాలుగు సార్లు అడుక్కుంటేనే గానీ డబ్బులు రాల్చడు తండ్రి. తల్లికా నోట్లో నాలుక లేదు. సంవత్సరానికి ఒక జత బట్టలు పిల్లలకు కొనడమే గగనం. తల్లి పరిస్థితి చూస్తే ఆ పిల్లకు ప్రాణం ఉసూరుమంటూ ఉంటుంది.
   తన తోటి క్లాస్మేట్స్ ఎంత ' జాలీ ' గా ఉంటారు! వాళ్ల నాన్నల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. అలాగని తన తండ్రికి సంపాదన లేదా?  గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ మంచి జీతమే తీసుకుంటున్నాడు, కానీ కట్టుకున్న భార్యకి రెండు కట్టుడు చీరలు కొనడానిక్కూడా ఎందుకంత గింజుకుంటాడో అర్థం కాదు. తను మాత్రం చాలా దర్జాగా తయారవుతాడు !
పసిపిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఏరోజూ తమని దగ్గరకు తీసినట్లుగానీ లాలించినట్లు గానీ సుధీరకు గుర్తు లేదు. 
   ప్రతీసారీ తల్లిద్వారానే ఏదైనా అడిగించేది తనకు తండ్రి ఎదురుగా నిలబడే ధైర్యం లేక. కానీ ఈసారి ఏదో మొండి ధైర్యం వచ్చిందా పిల్లకి. మనసులో స్థిరంగా నిశ్చయించుకుంది. 
   ఆరోజు యధావిధిగా తయారై ఆఫీస్  కు బయల్దేరుతున్నాడు వెంకట్రావు. సుధీర వెళ్లి అతని  కెదురుగా నిలబడింది. 
" నాన్నా, నాకు డబ్బులు కావాలి, ఇవ్వు..."
    చివుక్కున తలెత్తాడు వెంకట్రావు. తండ్రి కళ్ళల్లోకి స్థిరంగా చూస్తూ, 
" ఫీజు కట్టాలి, పండక్కి నాకూ, తమ్ముడికీ, అమ్మకూ బట్టలు కొనుక్కోవాలి. డబ్బు కావాలి ఇవ్వు..."దృఢంగా అంది తొణుకూ బెణుకూ లేకుండా. 
" ఏమిటీ, కొత్తగా.... ఫీజుకిస్తా, బట్టలూ గిట్టలూ కుదర్దు..." జేబులో చెయ్యి పెట్టబోతూ అన్నాడు. 
" కుదర్దు.... అంతా కలిపి 5000/- ఇవ్వాల్సిందే.. "
" నోరుమూసుకుని అవతలికి పద..... "
" లేదు, ఈరోజు...ఇప్పుడే...ఇచ్చి తీరాలి.... "
" ఏమిటే, నోరు లేస్తోంది... ఎప్పుడూ లేనిది?  మీ అమ్మ గాని నూరిపోసిందా?  ఇప్పట్నించీ దానికే గాదు మీక్కూడా కొనివ్వను. వెళ్లి ఆవిడ పుట్టింట్లో తెచ్చుకోమను...వెళ్ళు.."
" తాతయ్య ఎందుకివ్వాలి? "
" ఎందుకా? దాన్ని కన్నాడు కాబట్టి... "
" సరే అయితే. రేపు నాకూ పెళ్లి చేస్తావుగా ఎవడికో ఒకడికిచ్చి. వాడు కూడా ఇలాగే నన్ను ప్రతీదానికీ నీదగ్గర ముష్టెత్తుకోమని పంపిస్తాడు, ఇస్తావా మరి.."
   ఒక్కసారిగా వెంకట్రావు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఆ పిల్ల నోట్లోంచి వచ్చిన ప్రతీ మాటా ఓ తూటాలా అతని గుండెల్లో సూటిగా దిగబడి తూట్లు పొడిచేసింది. ఇన్నాళ్లూ మన్ను తిన్న పాములా పడి ఉన్న దీనికి ఇంత నోరెలా వచ్చింది? 
  కోపంతో ఊగిపోతూ కట్టుకుంటున్న బెల్టు తీసి కూతురివేపు ఉరికి రాబోయాడు.ఇంతలో సుధీర తండ్రి వైపు విసురుగా అడుగులు వేసింది.
" ఎందుకు నాన్నా అంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదేగా! నీ పద్ధతి ప్రకారం రేపు నాకు పెళ్లి చేశాక కూడా నా బాధ్యతలన్నీ నీవేగా తీసుకోవాల్సింది... "
" ఊరుకునే కొద్దీ మాటలు మితిమీరుతున్నాయే.. నోరు మూస్తావా లేదా... "
 వెంకట్రావులో ఆవేశం కట్టలు తెంచుకుంది.
" అదేంటి నాన్నా, తాతకోపద్ధతి,నీకో పద్ధతీనా... ఇదిగో చూడు, ఇక్కడే ఉన్నాడుగా నీ కొడుకు  సురేష్...  ఊహ తెలిసినప్పటినుంచీ నిన్ను చూస్తూ పెరుగుతున్నాడు. నీవు చేసేది కరెక్టే అని అనుకుని, రేపు వీడి పెళ్లయ్యాక వీడి పెళ్ళాన్నీ ప్రతిదానికీ దాని పుట్టింటికి వెళ్లి తెచ్చుకోమంటాడు... మంచి పద్ధతులే నేర్పిస్తున్నావు నాన్నా... "
 తెల్ల మొహం వేసుకుని చూస్తున్న సురేష్ కు అంతా అయోమయంగా తోచింది. ఓవైపు  తండ్రి ఉగ్రరూపం, మరోవైపు ఎన్నడూ ఎదురు మాట్లాడని అక్క!!
 పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన వెంకట్రావు లో సహనం నశించిపోయింది.
" నోరు ముయ్యమన్నానా... "
 అంటూ బెల్టు తీసుకుని విసురుగా ముందుకురికాడు.అంతవరకూ ఆ పక్కనే నిల్చుని చూస్తున్న కరుణ అనుకోని ఈ పరిణామానికి అవాక్కైపోయింది. ఒక నాడు పొత్తిళ్లలో తన ఒడిలో పసిగుడ్డుగా ఉండిన సుధీరేనా ఈ పిల్ల ! తన ఒంటి మీద వాతలు తేలేలా ఆడిన ఆ బెల్టు ఇప్పుడు తన బిడ్డ మీద పడబోతోంది. ఒక్కసారిగా ఆ అర్భకురాలిలో వెయ్యేనుగుల బలం వచ్చి చేరింది. అంతే, ఒక్క ఉదుటున వెళ్లి భర్తను అడ్డుకుంది. 
" ఆగవయ్యా, పిల్ల ఒంటిమీద చేయి పడిందంటే మర్యాద దక్కదు... "
 వెంకట్రావు వీపుమీద చెళ్ళున కొరడాతో కొట్టినట్టు అయింది. కోపం రెట్టింపవగా అటు నుండి ఇటువైపు తిరిగి కరుణ మీదికి  రాబోయాడు. వెంటనే అతన్ని బలంగా పక్కకు తోసేసింది కరుణ. ఊహించని ఆ ప్రతిచర్యకు అటు పక్కగా ఉన్న సోఫాలో కూలబడిపోయాడు వెంకట్రావు. నోరు విప్పింది కరుణ.
"... ఆ పిల్లకున్న తెగువ, ధైర్యం కాస్తయినా నాకు ఉండి ఉంటే ఈరోజు నా బ్రతుకిలా తగలడి ఉండేది కాదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా పిల్లలు నా పంచ ప్రాణాలు. వాళ్ళను బాధ పెడితే మాత్రం సహించేది లేదు. అలాగని ఇల్లు విడిచి పోతానని అనుకోకు, ఇది నా ఇల్లు. ఇక్కడే ఉంటాను నా పిల్లలతో. జాగ్రత్తగా ఉండు.. "
  మొట్టమొదటిసారి ఆమె రౌద్ర రూపం చూసి విస్తుపోయాడు వెంకట్రావు. మరోవైపు సుధీరలో పెల్లుబికిన ఆనందం ! ఇంకోవైపు ఏం జరుగుతోందో అర్థంకాక సురేష్ ! అతను తేరుకునేలోగా నెమ్మదించి పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకుంది కరుణ. దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు ఇంతకాలం నియంతలా ఉన్న వెంకట్రావు. ఇంట్లో అంతా కలిసి ఎదురుతిరిగితే పరిస్థితి ఎంత విషమమో అతగాడికి తొలిసారిగా తెలిసొచ్చింది. కోరలు పీకి పడేసిన కోడె నాగులా తలదించుకుని బయటకెళ్లబోయాడు. 
" ఆగండి నాన్నా, డబ్బు.. డబ్బు కావాలి.అంతా కలిపి 5000 /-  ఇక ప్రతిసారీ నువ్వే మా ముగ్గురికీ బట్టలు కొనాలి, నువ్వు ప్రతీ పండక్కీ కొనుక్కుంటావే అలాగన్నమాట... "
  కూతురి మాటలకు బయటకు పోతున్నవాడల్లా ఆగిపోయి ఇక తప్పేలా లేదనుకున్నాడో ఏమో , అప్రయత్నంగా బీరువా తెరిచి ఐదువేలూ  లెక్క పెట్టి ఆ పిల్ల చేతిలో పెట్టేసి గబగబా వెళ్ళిపోయాడు. పరమ సాత్వికురాలైన భార్య, తల్లి చాటు గా మౌనంగా పెరుగుతున్న కూతురు ఈరోజిలా చెలరేగి పోవడానికి తన నిరంకుశత్వ ధోరణి, క్రూర నైజమే కారణమన్న పచ్చినిజం ఆ పురుషపుంగవునికి తెలిసి వచ్చిందో లేదో తెలీదు గానీ... లోపల తల్లీ పిల్లలు మాత్రం ఏళ్లతరబడి కారాగారంలో పడి మగ్గిపోయి బయటపడ్డ ఖైదీల్లాగా అయిపోయారు. అక్కడి దృశ్యం ఓ సారి చూస్తే..... 
     సుధీరను గట్టిగా పొదువుకుంది కరుణ. సురేష్ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. ఊహ తెలిశాక మొదటిసారి తల్లి కళ్ళలో మెరుపు చూసింది సుధీర. తల్లీకూతుళ్ళిద్దరి చెంపలమీదనుండి ధారలుగా కన్నీళ్లు ! ఇద్దరికీ తెలుసు, అవి ఆనందబాష్పాలని !
                        *****************
పెళ్లి అయ్యాక భార్యాబిడ్డల బాధ్యతలు తనవే అని భావించక ఆ భారమంతా అత్తమామల మీద తోసేసే కొందరు ( అందరూ కాదు  ) ప్రబుద్దుల నిర్వాకం చూస్తూ...... ఆ స్పందనతో... 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                        యం. ధరిత్రీ దేవి 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Saturday, May 4, 2024

' చిన్నారి '... అమ్మను నేనైతే... బాలగేయం



🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜

అమ్మ ను నేనైతే....🤱
పాపను లాలిస్తా....🧑‍⚕️
పాపను నేనైతే....🙍
అమ్మను మురిపిస్తా..🤱
కవినీ నేనైతే....🧖‍♂️
కావ్యాలల్లేస్తా....📝
కావ్యం నేనైతే....📋
కర్తవ్యం బోధిస్తా....💁🥰

🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜

( ఇది నా  సొంత కవిత కాదు.చాలా ఏళ్ళ క్రితం ఒకటవ తరగతి తెలుగు వాచ
కంలోని ఓ బాలగేయం.నాకెంతగానో నచ్చింది )