Thursday, January 11, 2024

ముగ్గుల ముచ్చట్లు..!! కథ కాని ఓ కథ (సరదాగా కాసేపు )

💠🌸💮🌸💮🌸💮🌸💠💮🌸💮🌸💮🌸💮💠

                                             ~~ యం. ధరిత్రీ దేవి ~~

   ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఇంటి ఇల్లాలు ఇందుమతి తలుపు తీసుకుని నిద్రకళ్ళతోనే మూలనున్న చీపురుకట్ట దొరకబుచ్చుకుని బయటి గేటు తెరిచింది. నిన్న...'భోగి' పండుగరోజు వేసిన రంగవల్లి చెక్కుచెదరక అలాగే నిలిచిఉంది.     దానిమధ్యలో గొబ్బెమ్మలు...వాటిపై బంతిపూలు..చుట్టూ వెదజల్లబడ్డ పూరేకలు...కాస్త వాడినా.. కళగానే కన్పిస్తున్నాయి. అవన్నీ ఇందుమతిని చూసి పలకరింపుగా నవ్వాయి. ఇందుమతికి అదేమీ పట్టలేదు. చీపురుచ్చుకుని నిర్ధాక్షిణ్యంగా బరబరా ఈ మూలనుండి  ఆ మూలకు ఊడ్చేయడం మొదలెట్టింది. ముగ్గు, అందులోని రకరకాల రంగులు, గొబ్బెమ్మలు, పూలు...అన్నీ  ఒక్కసారిగా బావురుమన్నాయి. అప్పుడు ఆ  దృశ్యం చూసిన ఎవరికైనా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 'పుష్పవిలాపం' మదిలో మెదలక మానదు. నిన్న ఎంత శ్రమ తీసుకుని ఓపిగ్గా వేసింది...! ఎంత కళాత్మకంగా రంగులన్నీ నింపి రంగవల్లి తయారు చేసింది!! నవధాన్యాలతో గొబ్బెమ్మల్ని  అలంకరించి, బంతిపూలు అమర్చి, ముచ్చటగా పదేపదే చూసుకుని మురిసిపోయింది. ఇరుగమ్మలు,పొరుగమ్మల కంటే తన ముగ్గే బాగుండాలన్న తపన ఎంతలా పొంగిపొరలిందో కదా ఆ మొహంలో ! అంతా మరిచిపోయిందా! ఎంత దయలేకుండా ఊడ్చేస్తోందిప్పుడు! తెగ బాధ పడిపోయింది భోగి ముగ్గు..
   పావుగంటలో అంతా ముగించేసి, బకెట్ తో నీళ్ళు తెచ్చి ఛెళ్ళు చెళ్లుమంటూ అంతా చల్లేసింది. నిమిషాల్లో మొత్తం మటాష్ ! కాసేపాగి  ముగ్గుచిప్ప పట్టుకొచ్చి కొత్త ముగ్గుకు శ్రీకారం చుట్టింది. ఆరోజు మకర సంక్రాంతి. నిన్నటికంటే ఇంకా బాగుండాలి ముగ్గు... అందరూ తన ముగ్గునే మెచ్చుకోవాలి మళ్ళీ.. దీక్షగా నడుం నొప్పెడుతున్నా లెక్కచేయక కష్టపడి మరో అరగంటలో రంగులతో తీర్చిదిద్దింది. మిగతా అలంకరణలన్నీ అమర్చి, కాస్త దూరంగా వెళ్లి అన్నికోణాల్లోనూ చూసుకుని అక్కడక్కడా 'టచప్స్'ఇచ్చేసి, మళ్ళీ ఓసారి పరికించి, తృప్తిగా తల పంకించి , సరంజామా అంతా పట్టుకుని ఇంట్లోకి దూరిపోయింది. 
    కొత్త ముగ్గు 'మకర సంక్రాంతి'  ముగ్గు ఠీవిగా నిలబడింది. దాని సౌందర్యాన్ని పదే పదే చూసుకుని మురిసిపోయింది. తనను అంత అందంగా తీర్చిదిద్దిన  ఇల్లాలిని మనసారా మెచ్చుకుంది. అలా తనలో తనే తెగ మురిసిపోతున్నదానికి ఆ పక్కనే రంగు నీళ్లతో,  తడిసి ముద్దయిన గొబ్బెమ్మల ఆనవాళ్లతో,  చెల్లాచెదురైన పూరెక్కలతో అలుక్కుపోయి, దీనాతిదీనంగా తన వైపే చూస్తున్న నిన్నటి 'భోగి' ముగ్గు కంటబడింది. దాని దీనావస్థ  చూసి కిసుక్కున నవ్వేసింది  సంక్రాంతి ముగ్గు..
" ఏంటి ! అలా అయిపోయావు ! నేను చూడు. ఎలా కళకళలాడిపోతున్నానో !..."
అంటూ మళ్ళీ కిసుక్కుమంది. 
" మిడిసిపడకే వెర్రి మొహమా ! ఓరోజు ఆగు.. అప్పుడు నవ్వుదువుగానిలే..."
" నన్ను చూసి కుళ్ళుకుంటున్నావు.. నాకు తెలుసులే.. చూడు నన్ను ఎంత అందంగా తయారుచేసిందో ఇంటావిడ...!!"
భోగి ముగ్గుకు భగ్గుమంది. ఉండబట్టలేక, 
" ఓసి అమాయకురాలా...నన్ను కూడా ఇలాగే... చెప్పాలంటే,  ఇంతకంటే శ్రద్ధగా వేసిందే పిచ్చిమొహమా.. ఈరోజు చివరిసారిగా నా ముఖమైనా చూడకుండా ఒక దెబ్బతో ఊడ్చి పారేసి, నామరూపాలు లేకుండా చేసేసింది. అయినా, ఇప్పుడు నీకు అర్థం కాదులే.. రేపు మాట్లాడుకుందాం..."
అని గమ్మున ఉండిపోయింది. మూతి తిప్పుకుంది సంక్రాంతి ముగ్గు. ఆపై.... అలా మిడిసిపడుతూనే ఉంది రోజంతా...మరుసటి రోజు.. 
  మళ్ళీ తెల్లారింది.. ఇందుమతి మళ్లీ చీపురుచ్చుకుని బయటకు రివ్వుమంటూ వచ్చింది. ఇక అంతా మామూలే... నిన్నటి ముగ్గు నిమిషాల వ్యవధిలో గతంలోకి జారిపోయి,  అదృశ్యమై కొత్త ముగ్గు ప్రత్యక్షమైంది...' కనుమ ముగ్గు'...!
      సంక్రాతి ముగ్గు వచ్చి భోగి ముగ్గులో కలిసిపోయింది...వెలిసిపోయిన రంగులతో, ఆకారాన్ని కోల్పోయి దీనాతిదీనంగా...! ఇప్పుడు ఫక్కున నవ్వడం భోగి ముగ్గు వంతయ్యింది. 
" తెలిసిందా ! నిన్న నన్ను జూసి నవ్వావు. మిడిసిపడ్డావు. ఇప్పుడు చూడు నీ గతి ఏమయ్యిందో!"
అంది దాని అవస్థ చూస్తూ... 
" అవును సుమీ!ఎంత దయలేనివారు ఈ ఆడువారు!!నిన్నంతా ఎంత అపురూపంగా చూసుకుంది నన్ను !ఈరోజిలా.. !"
ఏడుపు ముఖం పెట్టింది సంక్రాతి ముగ్గు. 
"..నిజమే..బుద్ధదేవుని భూమిలో పుట్టినారు గానీ..వీళ్లకు ప్రేమ అన్నది అస్సలు లేదు.. ఛీ ఛీ.. "
అని రెండూ ఏకమై ఆడజాతినంతటినీ దుమ్మెత్తిపోశాయి కాసేపు...అలసిపోయి పక్కకు తిరిగిన వాటికి 'కనుమ' ముగ్గు కన్నులపండుగగా దర్శనమిచ్చింది..చిత్రంగా,  అది ఆరెంటినీ చూసి ఏమాత్రం నవ్వలేదు, ఎగతాళి చేయలేదు, అలాగని...అయ్యో పాపం అనీ అనలేదు..!ఓ వేదాంతిలా మెల్లిగా దరహాసం చేసింది. రెండు ముగ్గులూ విస్తుబోయాయి కనుమ ముగ్గు వింత ప్రవర్తన చూసి ! అదే అడిగాయి...
" అదేంటి ! ఈరోజు నీ వైభవం చూసుకుని చాలా సంబరపడిపోతావనుకున్నామే ! మమ్మల్ని చూసి నవ్వుతావనీ అనుకున్నాం. కానీ, నువ్వేమో.. "
" అయ్యో ! ఎంత అమాయకత్వంలో ఉన్నారే ఇద్దరూ!ప్రతీసారీ...ప్రతీ సంవత్సరం..ఇది మామూలే కదా !ఈరోజు వేయడం...రేపు తుడిచేయడం ! మళ్ళీ వేయడం...మళ్ళీ తుడిచేయడం ! ఏళ్లతరబడి చూస్తూ కూడా మీకు విషయం బోధపడ్డం లేదంటే ఏమనుకోవాలి ! రేపు ఇంకో ముగ్గు వస్తుంది...మనంత అందంగా కాకపోయినా...అదీ ఇంతే ! ఆమాత్రం దానికి ఒకర్ని చూసి ఒకరం కుళ్ళుకోవడం,ఏడ్చుకోవడం ఎందుకు? అయినా... మీ చుట్టుపక్కలంతా అటూఇటూ ఓసారి చూసుకోండి. ఈ ఇందుమతే  కాదు...అందరాడాళ్లూ చేస్తున్నపనే ఇదీ.."
అలా చూసినవాటికి అందరిళ్ల  ముందూ తమలాగే రంగు నీళ్లతో అలుక్కుపోయిన నిన్నా మొన్నటి ముగ్గులు కంటపడ్డాయి.దాంతో, 
"ఔరా ! ఇంతులంతా ఇంతే సుమా !"అని మూగవోయాయి. 
"... మరేమీ  పరవాలేదులే.. బాధపడాల్సిందేమీ లేదు. మళ్ళీ సంక్రాంతి రాదా! మళ్లీ ఈ ఇందుమతి మనల్ని ఆహ్వానించదా ! అయినా, ఎంతో శ్రధ్ధగా పెద్ద పెద్ద ముగ్గులు నేర్చుకుని,  ఓపిగ్గా నడుం నొప్పెడుతున్నా లెక్కచేయక పట్టువిడవక, ఇంత కళాత్మకంగా మనల్ని వాళ్ళ ఇంటి ముందు తీర్చిదిద్ది కొలువుదీరుస్తుంటే సంతోషించక పాపం ఈ ఆడవాళ్ళనలా ఆడిపోసుకోవడం మీకు తగునా !"
అంటూ చురకలంటించింది. నిజమే కదా అనుకుని లెంపలు వేసుకున్నాయవి...దాని తెలివికి, తర్కానికీ  అబ్బురంగా చూస్తూన్న వాటితో,  
".. పుట్టడం,  గిట్టడం మనుషులకేనా..! మనకూ సహజమే ! సరేలే, రేపు నేనూ వచ్చి మీలో కలుస్తాగా...!"
అనేసింది అలవోకగా,  కుసింత వేదాంతం గుప్పిస్తూ..
"అమ్మ కనుమ ముగ్గూ ! నీకెంత తెలుసే !"
బుగ్గలు నొక్కుకున్నాయి నిన్నా మొన్నటి ముగ్గులు రెండూ...!!

💠🌸💠💮💠🌸💠💮💠❄️💠🌸💠🌸💠🌸💠



No comments:

Post a Comment