నేరాలు, ఘోరాలు గురించిన వార్తలు పేపర్లలో, టీవీల్లో రావడం మామూలే. వాటిని చదువుతున్నప్పుడు క్షణకాలం'ఔరా' అనుకోవడమూ అందరికీ అలవాటే. కానీ, ఇటీవల కొన్నింటి గురించి వింటుంటే,
"మై గాడ్' ఇదేమిటి ! ఇలా కూడా ఉంటారా? అసలు వీళ్ళు మనుషులేనా!"
అన్న ప్రశ్న ఉదయిస్తోంది.మూడు రోజుల క్రితం చదివిన ఓ వార్త. ....
అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఓ కత్తి కొని అతని గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిందట ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి ! వినటానికి తమాషాగా లేదూ ! కానీ ఎంత అసంబద్ధమైన, ఆలోచనా రహితమైన చర్య ! విషయంలోకెళ్తే.......
-- పెళ్లి నిశ్చయమైన తర్వాత తన స్నేహితులకు పరిచయం చేస్తానంటూ ఆ వరుణ్ణి బయటకు రమ్మని చెప్పిందట ఆ పెళ్ళికూతురు. అతను సరేనంటూ ఆమెతో వెళ్ళాడట. దారిలో ఓ షాపు వద్ద ఆగి, లోనికి వెళ్ళి, ఓ కత్తి కొనుగోలు చేసిందట ఆ అమ్మాయి !
ఏం కొంటున్నావని అతనడిగితే...
'బహుమతి ' అని బదులిచ్చిందట !.. ఆతర్వాత అక్కడక్కడ కాసేపు గడిపాక,
" ఏరీ నీ ఫ్రెండ్స్ " అని అతనడిగితే, కేక్ తేవడానికెళ్లారని చెప్పి,
" ఈలోగా నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ "
అంటూ చున్నీతో అతని కళ్ళకు గంతలు కట్టి, కొని తెచ్చుకున్న కత్తితో అతని మెడ మీద బలంగా కోసేసిందట !! అతను బలవంతంగా ఆమెను వదిలించుకుని చున్నీ విప్పేయగానే...
" నీతో పెళ్లి నాకిష్టం లేదు..."
అని భోరుమందట !ఆ అమాయకుడు మళ్లీ ఆమె కూడా ఏం చేసుకుంటుందో అని భయపడి, వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఆమెను కూర్చుండబెట్టుకొని బయలుదేరాడట ! మధ్యలో రక్తస్రావం అధికమై ఇక చేతకాక స్పృహ తప్పుతున్న దశలో దారిని పోయే వాళ్ళు చూసి హాస్పిటల్ కు తరలించారట ! విషయం పోలీసుల దాకా వెళ్ళాక.... ఆ అమ్మాయి తనకు అతనితో పెళ్లి ఇష్టం లేకనే అలా చేశానని నేరం ఒప్పుకుందట ! నవ్వాలా, ఏడవాలా?
-- ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు... ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇష్టం లేకపోతే బాహాటంగా చెప్పేయాలి. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయడమేంటి? ఫలితంగా జరిగిందేమిటి? వెళ్లి కటకటాల వెనక కూర్చుంది ! ఇంట్లో పెద్దలు ఒప్పుకోరన్న భయం ఉంటే ధైర్యంగా అతనికే చెప్పొచ్చుకూడా. ఇదో నేరప్రవృత్తి. మానసిక బలహీనత !
--- మరో వార్త ! ఆమెకు పెళ్లయి ఏడేళ్లయింది. ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. ఇప్పుడేమో భర్త అదనపు కట్నం కావాలని వేధిస్తున్నాడట ! ఇదెక్కడి న్యాయం ! ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాక కూడా ఈకట్నాల గోలేమిటి !! ఆత్మాభిమానమున్న ఏ మగాడైనా ఇలా భార్య తెచ్చే డబ్బుకై వెంపర్లాడతాడా? కుటుంబాన్ని పోషించాల్సింది అతనే కదా! అలాకాక ఆమెను వేధిస్తూ నరకం చూపిస్తూ.... ఆఖరికి ఇనుప రాడ్ తో కొట్టి,చీరతో గొంతు నులిమి హతమార్చాడట !
--- ఇలాంటి దారుణాల్ని విన్నపుడు.... ఎందుకిలా ప్రవర్తిస్తారు ! తాము ప్రశాంతంగా ఉండక, చుట్టూ ఉన్నవాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వక... చివరికి ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడడం లేదు. దరిమిలా వాళ్ళు బావుకుంటున్నదేమిటి? హంతకుడన్న ముద్ర ! జైలు జీవితం ! సర్వం కోల్పోయి తల బాదుకోవడం !అంతకన్నా మరేమైనా ఉన్నదా?
కాస్త విచక్షణ, ఆలోచనా పరిజ్ఞానం ఉంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడరు కదా, అనిపిస్తుంది ఇలాంటి వాళ్లను తలచుకుంటూ ఉన్నప్పుడు.
--- ఇదిలా ఉంటే... ఇంతకన్నా ఘోరమైన అకృత్యం -- వినడానికే అతి హేయంగా అనిపిస్తూ నిన్నటి పేపర్లో వచ్చింది... ఓ మానసిక దివ్యాంగురాలిని ఇరుకైన గదిలో బంధించి ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారన్నది ఆ వార్త ! తల్లిదండ్రులు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినా ఏ ఫలితం లేకపోవడం మరీ దారుణం!
-- ఈ మూడు సంఘటనలూ కేవలం మూడు రోజుల వ్యవధిలో జరిగినవే. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉండొచ్చు. మనసంతా కలచివేసే ఈ దుశ్చర్యలకు రోజురోజుకూ అంతూ పొంతూ లేకుండా పోతోంది. సభ్యత, సంస్కారం, నాగరికత లేశమాత్రం లేని వీళ్ళు అసలు మనుషులేనా?ఎన్ని చట్టాలు చేసినా నేర ప్రవృత్తి, క్రూర మనస్తత్వం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రానురాను ఈ సమాజం ఏమై పోతోంది! ఊహించుకోవడానికే విపరీతమైన భయమేస్తోంది !!
++++++++++++++