Wednesday, July 21, 2021

జ్ఞాపకాలు మాత్రం పదిలం !

       బుడగవంటిదేనా ఈ జీవితం! అనిపిస్తోంది, ఈమధ్య నడుస్తూ నడుస్తూనే హఠాత్తుగా కనుమరుగైపోతున్న కొందరిని చూస్తుంటే! ఏదో తీవ్ర అనారోగ్యానికి గురై కొంతకాలం పాటు బాధపడి, మృత్యుముఖంలోకి పోతే, అది వేరే సంగతి. కానీ,   ' 'కరోనా' మహమ్మారి జనాల్లోకి ప్రవేశించిన తరువాత పరిస్థితి పూర్తిగా తలక్రిందులైపోయింది. మొదటి వేవ్ లో ఎక్కడో దూరాన మనకు తెలియని వ్యక్తులు, అతి కొద్దిమంది సెలబ్రిటీలు దీని బారిన పడి విగతజీవుల య్యారన్న వార్తలు చదివాం. కానీ, సెకండ్ వేవ్ లో   మన చుట్టూ ఉన్న వాళ్లే చాలా మంది దీని కాటుకు గురవడం చూస్తున్నాం. ఇంకా అత్యంత ఆప్తులు కూడా ఊహించని రీతిలో దూరమై పోయి, కుటుంబాల్ని శోక సముద్రంలో ముంచి వేస్తున్న ఉదంతాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. 
     కొద్ది రోజుల క్రితం మా కుటుంబ స్నేహితుడొకాయన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ఉదయం ఏడింటికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, ఎంతో ఉత్సాహంగా మరింత ఆనందంగా ఇంట్లో అందర్నీ ఆహ్వానించారు. ఆ సమయంలో ఆయన ఎంతో హుషారుగా, ఉల్లాసంగా ఇంకా ఆరోగ్యంగానూ కనిపించారు. మరో రెండు వారాల్లో పెళ్లి. తీరా ఆ రోజు అక్కడికి వెళ్తే ఎంతో సందడి సందడిగా ఉండాల్సిన ఫంక్షన్ హాల్ మూసివేయబడిఉంది. ఆరా తీస్తే, ఆయనకి కోవిడ్ సోకి హైదరాబాద్ హాస్పిటల్లో చేరార న్న వార్త తెలిసింది. మరో వారానికల్లా ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. షాకింగ్ న్యూస్ ! అంత ఆరోగ్యంగా కనిపించిన మనిషి ఇలా వెళ్ళిపోవడం ఏమిటి? ఎంతో అట్టహాసంగా, ఆనందంగా జరగాల్సిన కొడుకు పెళ్లి అర్ధాంతరంగా వాయిదా పడిపోయింది. పెళ్లి సందడి తో కళకళలాడాల్సిన ఆ ఇల్లు కళ తప్పి వెలవెలబోయింది. ఇలాంటివే మరికొన్ని ఉదంతాలు మా బంధుగణంలో  జరిగాయి. అందులో ఒకరు---
 కవితా  హృదయం గలిగి చక్కగా కవితలు రాసే  వాడూ, గాయకుడు, సంగీత సాహిత్యాభిలాషి, వరుసకు నాకు అన్నగారైన రాజశేఖర్ రెడ్డి గారు.  ఆంధ్రోపన్యాసకులుగా డిగ్రీ కళాశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన బంధువర్గంలో చక్కని ఆత్మీయ సంబంధాలు కలిగిన వ్యక్తి. దాదాపు రెండు నెలల క్రితం మా ఇంటికి వచ్చి, ఒకరోజు మాతో గడిపి చక్కగా కబుర్లాడిన ఆయన ఈరోజు లేడు ! నెలన్నర క్రితం కరోనా మహమ్మారి సోకి, హైదరాబాద్ హాస్పిటల్ లో మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. కుటుంబ సభ్యులకే కాదు, బంధువులందరినీ  కలచివేసిన వార్త ఇది ! అడపాదడపా ఫోన్లు చేస్తూ, క్షేమ సమాచారాలు వాకబు చేస్తూ ఆత్మీయంగా పలకరించే ఆ గొంతు ఇకపై మాట్లాడదు, పలకదు. శాశ్వతంగా మూగబోయింది. గతంలో ఆ గళం  నుండి జాలువారిన కవితా గానాలు మాత్రమే జ్ఞాపకాలుగా మిగిలి వాటినే  పదే పదే నెమరు వేసుకోమంటున్నాయి.  
    వీళ్లే కాదు, ఎంతో భవిష్యత్తు ఉండి, ఎన్నో బాధ్యతలు నిర్వహించవలసియున్న పిన్న వయస్కులు కూడా కోవిడ్  కాటుకు బలై అకాల మరణం చెందుతున్నారు.మనుషుల్ని ఇలా హఠాత్తుగా అదృశ్యం చేయడం కరోనాకే సాధ్యమేమో ! ఇవన్నీ చూస్తుంటే, ఏమిటీ దారుణాలు  ! జీవితమంటే  ఇంతేనా! అనిపిస్తూ, ఓ రకమైన వేదాంత ధోరణి లోకి పోవాల్సి వస్తోంది. 
     మరణమన్నది తథ్యం!నిజమే ! ఎవరికైనా ఎప్పుడైనా తప్పనిదే. కానీ ఇలా అకస్మాత్తుగా, అనూహ్యంగా సంభవించడమన్నది అత్యంత బాధాకరం. భగవంతుడు వారందరి ఆత్మలకు శాంతి కలగజేయాలని వేడుకుందాం. 

***********************************

No comments:

Post a Comment