సాయంత్రం కాస్త రిలాక్స్ అవుదామని టీ వీ ఆన్ చేశాను. అయిదారు చానల్స్ తిప్పి ఓ చోట ఏదోో కామెడీ ప్రోగ్రాం వద్ద ఫిక్స్ అయిపోయాను. అందులోో ఓ నటుడు పంచుల మీద పంచ్ లు పేలుస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. కానీ, తను చెప్పే డైలాగు ముగిసీ ముగియకముందే ప్రేక్షకుల కంటే ముందు తనే నవ్వేస్తూ ఉన్నాడు.. ఎందుకో... ఎక్కడో ఆ కామెడీలో ఏదో వెలితిగా తోచింది. అలా అలా చూస్తుండగా నాకు పాత తెలుగు సినిమాల్లో తమ అద్భుత నటనా చాతుర్యంతో హాస్యానికి భాష్యం చెప్పిన అలనాటి నటీనటులు కొందరు ఠక్కున గుర్తొచ్చారు
ఇదివరకు నేను రాసిన పోస్టుల్లో నటీమణి సూర్యకాంతం గారి గురించినదొకటుంది. ఆవిడ నటనా వైదుష్యం ఎంత చెప్పుకున్నా తక్కువే. తెరపై తను ఏమాత్రం నవ్వక చూసే అందర్నీ నవ్వించే అద్భుత నటనా పటిమ ఆమె సొంతం. అదే కోవకు చెందిన మరో విలక్షణ నటుడు నాగభూషణం గారు.' రక్త కన్నీరు' నాగభూషణం గా సుప్రసిద్ధుడైన ఈయన అప్పట్లో తెలుగు చిత్రసీమను రెండు దశాబ్దాలు పైగా ఏలా రని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఆయన లేని తెలుగు సినిమా దాదాపు లేదన్నా అతిశయోక్తేమీ కాదు.
ముఖంలో హావభావాల్ని అలవోకగా పలికిస్తూ సన్నివేశాల్ని హృద్యంగా పండించే నటనాచాతుర్యం పుణికిపుచ్చుకున్న అరుదైన నటుడాయన ! హాస్యం, వినోదం, క్రూరత్వం, గాంభీర్యం, రౌద్రం, విచారం, సరసం , కుటిలత్వం, బీభత్సము -- ఇలా అన్ని రసాల్ని పోషించడంలో దిట్ట అనిపించుకున్న ఘనత వీరి సొంతం ! అంతటి ప్రతిభావంతుడైన నాగభూషణం చిత్రసీమలో ప్రవేశించక ముందు రంగస్థల నటులు. తమిళంలో M.R.రాధా గారి నాటకాన్ని' రక్త కన్నీరు' గా తెలుగులోనికి అనువదింపజేసి కొన్ని వేల ప్రదర్శనలిచ్చారని విన్నాను. క్రమేణా ఆయన ఇంటి పేరే ' రక్త కన్నీరు' గా రూపుదిద్దుకుంది.
తెలుగులో వారి మొదటి సినిమా( 1952) ' పల్లెటూరు'. చిన్నతనంలో' ' మాయాబజార్' సినిమా చూస్తున్నప్పుడు తెలియలేదు గానీ తర్వాతి రోజుల్లో టీవీలో చూస్తున్నప్పుడు అందులో సాత్యకిగా ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించేది నాగభూషణం గారే అని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినా బాగా గుర్తింపు నిచ్చి సినీరంగంలో దూసుకుపోవడానికి తలుపులు తెరిచిన చిత్రం మాత్రం' మంచి మనసులు' ( ANR, సావిత్రి, షావుకారు జానకి ) అనే చెప్పాలి. అందులో ఓ అంధురాలికి అన్నగా అతని నటన ఎంతగానో అందరినీ ఆకట్టుకుని తెలుగు తెరకు ఓ అద్భుత క్యారెక్టర్ నటుణ్ని అందించింది. ఆతర్వాత రెండు దశాబ్దాలకు పైనే వారి సినీ ప్రయాణం అప్రతిహతంగా సాగిపోయింది.
విలన్ గా, కామెడీ విలన్ గానే గాక సాత్విక పాత్రల్లో కూడా తనకు తానే సాటి అనిపించిన ఘనతవీరిది.
* ఆదర్శ కుటుంబం లో నలుగురు అన్నదమ్ముల్లో ఒకరైన ఈయనది MLA పాత్ర. ఎప్పుడూ తాను కన్ఫ్యూజ్అవుతూ తమ్ముణ్ణి " తమ్ముడూ నువ్వు confuse అవుతూ నన్ను confuse చేయకు " అంటూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతూ ఉంటాడు.
* కథానాయకుడు ' లో సాఫ్ట్ విలన్ గా NTR గారికి దీటుగా నటించారు.NTR గారికి ఆయనపై ఉన్న ప్రత్యేక అభిమానంతో వారి సొంత సినిమాల్లో తప్పనిసరిగా నాగభూషణం గారికి పాత్ర ఉండేదట! అందులో కొన్ని --
వరకట్నం, ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెళ్ళామా,..
* ' బాలరాజు కథ' లో పనిగండం మల్లయ్య పాత్ర. పని చేస్తే చావు వస్తుందన్న నమ్మకంతో అసలు పని చేయకుండా ఎప్పుడూ బద్ధకంగా గడిపేసే పాత్ర నవ్వులు పూయిస్తుంది.
* ' బ్రహ్మచారి' ( ANR, జయలలిత ) లో సూర్యకాంతం గారి భర్త గా నటించారు. ఇందులో గయ్యాళి తనానికి మారుపేరుగా వినుతికెక్కిన సూర్యకాంతం గారినే గడగడలాడించే పాత్ర! విలనీకి, గడసరి తనానికి చిరునామాగా ప్రసిద్ధికెక్కిన ఆ ఇద్దరూ నెమ్మదైన పాత్రల్లో ఒదిగి పోవడం ముచ్చటగొల్పుతుంది.
* ' కల్యాణమంటపం ' లో రమాప్రభ భర్తగా ఆమె కళ్ళు తెరిపించే సన్నివేశాల్లో అంధుడిగా ఆయన నటన అద్వితీయం!
* ' ఇదాలోకం ' చిత్రంలో ఆయన ధరించిన దుష్ట పాత్ర మరిచిపోలేము. అందులో ఆయన అనుచరుని పాత్ర పోషించిన రావుగోపాలరావు గారు తర్వాతి రోజుల్లో నాగభూషణం గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారా అనేంతగా ఎదిగిపోయారు. కొంతకాలం వరకూ ఆయనలో ఆ ముద్ర కనిపిస్తూనే ఉండడం గమనార్హం.
* ' దసరా బుల్లోడు' లో పిల్లికి కూడా బిచ్చం పెట్టని పరమ పిసినారి పాత్ర!
* ' మాతృదేవత', ' భాగస్తులు' లాంటి చిత్రాల్లో సాత్విక ధోరణిలో సాగే పాత్రపోషణ వారి నటన లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
పైన ఉదాహరించిన వన్నీ కొన్ని మచ్చుతునకలుమాత్రమే. వందలాది సినిమాల్లోని వైవిధ్యమైన వారి పాత్ర పోషణ వర్ణించడం సాధ్యమా!
సినీరంగంలో తీరిక లేకుండా నటిస్తున్నా రక్తకన్నీరు. నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉండేవారట ! రవి ఆర్ట్స్ థియేటర్స్ పేరిట స్వీయనిర్మాణ సంస్థ నెలకొల్పి'నాటకాలరాయుడు', 'ఒకే కుటుంబం ' సినిమాలు తీశారు. కానీ, కథానాయకుడు గా నటించిన నాటకాలరాయుడు ఆశించినంత విజయం సాధించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ప్రేక్షకులు అయనకు బ్రహ్మరథం పట్టారు. ఏమైనా ఆ తరం వాళ్ళు నాగభూషణం గారినైతే మరిచిపోలేరన్నది వాస్తవం.
చివరగా ఆయన S.V. కృష్ణా రెడ్డి గారి 'నెం. 1' చిత్రం లో మరో అద్భుత నటుడు రాజనాల గారితో కలిసి రెండు మూడు సన్నివేశాల్లో కన్పించి పాత రోజుల్లో వారి ప్రాభవాన్ని తలపించారు. 'రక్తకన్నీరు' నాగభూషణం గా అశేష ప్రజానీకానికి సుపరిచితులైన చక్రవర్తుల నాగభూషణం గారు 5, మే, 1995 న కీర్తి శేషులైనారు. భౌతికంగా కనుమరుగైనా తెలుగు సినీ వినీలాకాశంలో ఓ తారగా చిరస్థాయిగా వెలుగొందుతూనే ఉంటారు.
**************************************
* భువి భావనలు *
**************************************
Excellent article Madam, thank you very much.
ReplyDeleteThank you very much for your comment 🙏
DeleteAtanni oka vilangane chusham .meeru manchi information echaru
ReplyDeleteHe is a very good character artist. Thanks for the comment.
ReplyDelete