Sunday, May 3, 2026

'చిన్నారి'...అమ్మమ్మ తాతయ్య..రావాలీ రావాలీ...బాలగేయం


                                            ~యం.ధరిత్రీ దేవి

తాతయ్య తాతయ్య కథ చెప్పు తాతయ్య 
కథవింటూ నేను బబ్బుంటా తాతయ్యా 
నిదురలోన కలలెన్నో కంటాను నేనూ
కలలన్నీ కథలల్లి నీతోనే చెబుతాను     //తాతయ్య //

ఆకాశం చూపిస్తే చందమామ దిగివచ్చేను 
తారలన్ని తరలివచ్చి ముంగిట్లో వాలేను
చక్కనైన చుక్కలన్ని చూడు చూడు తాతయ్య
చుట్టుముట్టి నా చుట్టూ తిరిగేను తాతయ్య 
                                                         //తాతయ్య //
అనగనగా ఓ రాజుకు ఏడుగురు కొడుకులూ 
డు చేపలంటావు..ఎండలేదు అంటావు 
ఏడిస్తే ఒప్పుకోవు నవ్వాలీ అంటావు /
నవ్వుతోనే బలమంతా ఉంటదంటావు     
                                                       //తాతయ్య //
కాకమ్మల చిలకమ్మల కబురులే చెబుతావు 
సింహానికి చిట్టెలుకకు నేస్తం కట్టేస్తావు 
నక్కబావ జిత్తులు..ఎలుగుమామ ఎత్తులు
నువు చెప్పని కథ ఏది..నువ్వెరగని నీతి ఏది 
                                                       //తాతయ్య//
అమ్మమ్మా అమ్మమ్మా కథ చెప్పు అమ్మమ్మ 
కథ వింటూ నేను నీ ఒడిలో బబ్బుంటా 
నిదురలోన కలలెన్నో కంటాను నేనూ
కలలన్నీ కథలల్లి నీతోనే చెబుతాను 
                                                     //అమ్మమ్మా //
అమ్మ చేతి గోరుముద్ద నాకెంతో కమ్మన
మీరు చెప్పు కథలేమో అంతకన్న తీయన
అమ్మకేమొ ఇంటి పనులు 
నాన్నకేమొ బయటి పనులు
మా పిల్లలకేమొ కరువాయెను కథలూ

స్నేహితుల ఊసులేదు.. ఆటకెక్కాయ్ ఆటలన్ని..
సరదాలకు చోటు లేదు.. పోటీలతో కుస్తీలు..!
పాఠాలు..పరీక్షలు.. ఇంకెక్కడి వినోదాలు!!
ఏం చేస్తాం.. వచ్చా వచ్చేశాయ్ మా చేతికి ' సెల్ఫోన్లు'!

అందుకే  మీరంతా కదలాలి కదలాలీ 
కదిలివచ్చి చెప్పాలి కథలెన్నో మాతోటి..
అమ్మమ్మలు.. నానమ్మలు రావాలి రావాలీ 
చెప్పాలి చెప్పాలి కథలెన్నో మా తోటి 
మీరొస్తే చాలు మాకు.. మీకివే స్వాగతాలు
చెప్పేస్తాం సెల్ఫోన్లకు టాటాలు గుడబైలు 

అవ్వలూ తాతలూ కదలాలీ కదలాలీ
కదిలివచ్చి చెప్పాలి కథలెన్నో మాతోటి 
                                                  
అమ్మమ్మలు తాతయ్యలు రావాలీ రావాలీ
చెప్పాలీ  చెప్పాలీ  కథలెన్నో మాతోటి    //అమ్మమ్మా// 
                      •••••••••••••


[ 'సంచిక ' అంతర్జాల వార పత్రిక  5.4.26 లో ప్రచురితం]




No comments:

Post a Comment