Saturday, October 26, 2024

నా అందం నాది... నా ప్రత్యేకత నాది...!

 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

                                              ~ యం. ధరిత్రీ దేవి 
చెత్తాచెదారం...చుట్టుముడుతూ 
పిచ్చిగా అల్లుకున్న కొమ్మలూ..రెమ్మలు..!
ఆపై కంపచెట్లు...!ఆ నడుమ నిలబడి...
బిక్కు బిక్కు మంటూ  ఔషధ మొక్క...!
ఓ తెల్లని పుష్పంతో ఒంటరిగా ...!!
'అయ్యో పాపం!' అనుకునేంతలో...
" అనాధను కాను నేను... 
ఏకాకిని అంతకన్నా కాదు...
నా చుట్టూ పచ్చని మొక్కలు...నా నేస్తాలు...
కంపచెట్లు...నాకు రక్షణ వలయాలు...!
చెత్తాచెదారమా...నన్నేమీ చేయలేదు...
నా అందం నాది...నా ప్రత్యేకత నాది...
నా ఉనికిని గుర్తించి...నాకోసం నా చుట్టూ 
పరిభ్రమించే ఈ తుమ్మెదే సాక్షి... "
అనేసింది కిలకిల నవ్వుతూ ఆ 'ఉమ్మెత్త '...!!
నిజం తెలిసి...తెల్లబోయి 
తేరుకొని శృతి కలిపా... 🙂

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

Wednesday, October 16, 2024

దానగుణం మంచిది కాదా !


  🌺గేటు దగ్గర అలికిడి వినిపించి వంటింట్లోంచి అరుంధతి ముందు గదిలోకి వచ్చి తొంగి చూసింది. గేటు  అవతల ఓ ఆడ  మనిషి!  పొట్టిగా, ఓ మోస్తరు లావుగా, నేత చీరలో ,  జుట్టు ముడి వేసుకుని ఉన్న యాభై ఏళ్ళు పైబడ్డ ఆవిడ నిలబడి చూస్తోంది. వెంటనే గుర్తుపట్టింది అరుంధతి ఆవిణ్ణి చూడగానే. అంతలోనే ఒక్కసారిగా ఆమెలో విసుగు తలెత్తింది. 
    దాదాపు రెండు సంవత్సరాలవుతుందేమో, మూడు నాలుగు నెలలకోసారి వస్తుంది. ఏదైనా వస్త్రం ఇవ్వమని అడుగుతుంది. వస్త్రం అంటే  ఆమె భాషలో చీర అని అర్థం. మొదట్లో అడగంగానే వెంటనే లోనికెళ్లి ఓచీర  తెచ్చి ఇచ్చేసింది అరుంధతి. అంతే! అలా అలా అలవాటయిందామెకు. ఈమే  కాదు, మరొక ఆవిడ కూడా ఇలాగే రెగ్యులర్ గా  రావడం, వచ్చినప్పుడల్లా చీర అడగడం -- అరుంధతి ఇవ్వడం మామూలైపోయింది రాన్రానూ. ఎవరైనా ఇలా ఇంటికి వచ్చి  ఏదైనా అడిగితే లేదన లేకపోవడం అరుంధతి బలహీనత. పైగా ఆమెకున్న దయాగుణం దీన స్థితిలో ఉన్న వాళ్ళకి దానం చేయాలని ప్రేరేపిస్తుంది కూడా. అదామె స్వభావం! అంతవరకూ బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆమెకు అదో విధమైన అసహనం, చిరాకు కలుగుతోంది. కారణం -- అరుంధతి బలహీనతను బాగా కనిపెట్టారేమో, ముఖ్యంగా ఆ ఇద్దరు ఆడవాళ్లు! అడపాదడపా రావడం, తప్పనిసరిగా చీర అన్నది ఇచ్చేదాకా వదలక పోవడం, మొండికి  పడడం చేస్తుంటే, రాన్రాను అరుంధతిలో సహనం నశించి పోతోంది. ఏమిటి వీళ్ళు ! ఇస్తే తీసుకోవాలి, అంతేగానీ ఇలా విసిగించడంఏమిటీ !  పైగా ఓ వేళా పాళా ఉండదు వీళ్ళరాకకి ! ఒక్కోసారి ఉదయమే ఇంటి పనుల్లో మునిగిపోయి  ఉన్నప్పుడు, మరోసారి భోజనాలయిపోయి, అలసిపోయి కాస్త నడుం వాల్చి విశ్రాంతిగా కునుకు  తీస్తున్నప్పుడు దబ్బున  గేటు చప్పుడు చేయడం, పిలవడం! లేచి వచ్చేదాకా పిలుస్తూనే ఉండడం,  ఏదో ఒకటి చేతిలోపెట్టేదాకా కదలకపోవడం ! క్రమంగా ఈ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా పరిణమించి పోయింది. ఇంట్లో ఉన్న పాత చీరలు ఏం చేసుకుంటాం, ఇలా ఇస్తేనన్నా మరొకరికి ఉపయోగపడతాయి కదా అన్న ఆలోచనతో తానిలా  చేస్తే వీళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని, అలవాటు  చేసుకుని తననిలా బాధపెడతారని  ఆమె ఊహించలేకపోయింది పాపం! అందుకే బాగా ఆలోచించి, ఈమధ్యే  ఓ నిర్ణయం తీసుకుంది,  ఇకపై ఇలా ఇంటి వద్దకొచ్చి అడిగే వాళ్ళకి చీరలు గీరలు అసలు ఇవ్వకూడదని! ఎలాగైనా ఆ మాటకు కట్టుబడి ఉండాలని స్థిరంగా అనుకుంది కూడా. ఈరోజు గేటు వద్ద ఆవిణ్ణి చూడగానే ఆ నిర్ణయం గుర్తొచ్చి, వెంటనే బయటికొచ్చేసి, చెప్పేసింది, 
" చూడమ్మా, చాలా ఇచ్చాను నీకు, వచ్చిన ప్రతిసారీ ఇవ్వాలన్నా, ఇచ్చే తీరాలన్నా కుదిరేపనిగాదు. పైగా నీవు ఒక్కత్తివే కాదు, ఇంకా ఇలా వస్తూనే ఉంటారు, ఎందరికని  ఇవ్వను!... ఇక నీవు వెళ్ళవచ్చు.. " 
 గట్టిగానే చెప్పేసి, లోనికి వెళ్ళిపోయింది. కానీ ఆమె వింటేగా! అలాగే నిలబడి మళ్లీమళ్లీ అడగడం మొదలెట్టింది. అరుంధతి లోపల్నుండే  మళ్ళీ గట్టిగా చెప్పింది, వెళ్లిపొమ్మని. కానీ ఆమె మాత్రం వినిపించుకోకుండా అలాగే నిలబడింది యథాప్రకారంగా. అరుంధతిలో కోపం కట్టలు తెంచుకుంది, అయినా తమాయించుకుని, 
" ఎన్ని సార్లు చెప్పాలి, వినిపించదా?... " అంటూ బయటకొచ్చేసింది. అంతే! ఆమె కోపంగా చూస్తూ మెట్లు దిగుతూ, 
" ఏ, పోయేప్పుడు కట్టుకుని పోతావా?....... "
 అంటూ అంతకంటే కోపంగా గట్టిగా  అరుస్తూ గొణు క్కుంటూ  విసవిసా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అరుంధతి అవాక్కై స్థాణువై నిలబడిపోయింది. 
" ఏమిటి! ఇన్నాళ్ళూ నేను ఇచ్చిందంతా ఏమైపోయింది? అదేమీ పట్టదా ఇలాంటి వాళ్ళకి! ఒక్కసారి లేదు పొమ్మంటే చాలు ఇలా అనేయడమేనా!"
  మదనపడుతూ మెల్లిగా లోనికి కదిలింది. ఇదంతా లోపల్నుండి గమనిస్తూన్న ఆమె భర్త ఈశ్వరరావు, అరుంధతి మ్లానవదనం చూస్తూ, 
" ఏమిటీ, ఫీలవుతున్నావా ! అసలు పొరపాటు నీది. వాళ్లకు అలవాటు చేసింది నువ్వు! ఏదో అపర దానకర్ణుడి  చెల్లెల్లా ఇలా అడిగినోళ్లందరికీ  దానాలు చేస్తూ పోతే ఇలాగే ఉంటుంది మరి!..."
 అసలే బాధలో ఉన్న అరుంధతికి ఈ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. 
" అంటే దానం చేయడం తప్పా? "
" దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం తప్పు. నీవు గమనించినట్లు లేదుగానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళ తీరు చూస్తే వాళ్లు  మరీ అంత దయనీయస్థితిలో ఉన్నట్లుగా అనిపించలేదు నాకు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ల స్థితిగతుల్ని కూడా గమనించాలి మరి!.."
 అంటూ చిన్న సైజు క్లాసు పీకాడు. అంతలోనే అరుంధతి చిన్నబు చ్చుకున్నట్లు గమనించి, 
"చూడు, జరిగిందేదో జరిగింది, ఇకపై ఇలాంటి వాళ్ల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే, ఇచ్చి చెడ్డ గావడం కంటే ఇవ్వకుండా చెడ్డ కావడం మేలనుకుంటా... "
 చిన్నగా నవ్వుతూ, వాతావరణాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాడు.మళ్ళీ అందుకుని, 
"... నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఏదైనా వృద్ధాశ్రమానికి అప్పుడప్పుడూ వెళ్లి వాళ్లకి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ పద్ధతి బాగుంటుంది, నీకు సంతృప్తి, సంతోషం దక్కుతాయి, " 
 అంటూ ఓ సలహా ఇచ్చాడు. అదేదో బాగున్నట్లు అనిపించింది అరుంధతికి. అయినా  రాను రాను మనిషిలో మంచితనం ఉండడం కూడా తప్పేమో అనిపించిందామెకి ఆ క్షణాన  ! ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చి, ' దేవుడా' అనుకుంటూ తల పట్టుకుని కుర్చీలో కూల బడింది.
               **    **     **     **    **
    ఇది అరుంధతి అనుభవమే కాదు, నా  అనుభవం కూడా.అంతే కాదు, ఇంకా మరికొందరు కూడా ఇలాంటివి ఎదుర్కొనే  ఉంటారు. ఇలా జరిగినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, దాన గుణం మంచిది కాదా అని! 
   ఈ సందర్భంగా చిన్నతనంలో బళ్ళో  చదువుకునేటప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పిన ఓ పిట్ట కథ గుర్తొస్తోంది  నాకు. ఓ ఊర్లో ఓ  యాచకుడు ఉండేవాడట. అతను ప్రతి రోజూ  ఆ ఊర్లోని అన్ని వీధులు తిరిగి ముష్టి ఎత్తుకునే వాడట. ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఓ ఇల్లాలు మాత్రం ఖచ్చితంగా అతనికి బిక్షం వేసేదట ! ఓ రోజు పాపం, ఆమెకు చేయి ఖాళీ  లేకనో, లేక సమయానికి  పెట్టడానికి ఏమీ లేకనో అతనికి ఏమీ  పెట్టకనే  పొమ్మందట! అంతే! ఆ యాచ కుడు వెంటనే, 
"  రోజూవేసే..... దీనికే మాయ రోగం వచ్చిందోఇయ్యాళ !...." 
 అంటూ పైకే అనేసి గొణుక్కుంటూ  వెళ్ళిపోయాడట! ఆ మాటలు ఆ ఇల్లాలి చెవిని పడనే పడ్డాయి. హతాశురాలైపోయిందటావిడ, ఆ బిచ్చగాడి ప్రవర్తన చూసి ! 
 అదే మాస్టారు మరోసారి మరో యాచకుని  గురించి చెప్పారు. అతను ఆ  ఊర్లో ప్రతిరోజూ మూడే మూడు ఇళ్లకు యాచనకు వెళ్తాడట ! ఆ మూడిళ్ల వాళ్ళు ఏదైనా పెడితే తింటాడు, అంతే! మరుసటిరోజు మరో మూడిళ్లకు వెళ్తాడట. ఆ రోజు వాళ్ళు ఏమీ పెట్ట లేదనుకోండి, తలవంచుకుని మౌనంగా వెళ్ళి పోయి, ఖాళీ కడుపుతో పడుకుండి పోతాడట ! అది  అతని అలవాటు, స్వభావం! ఇంకా చెప్పాలంటే, ఓ రకమైన'పాలసీ' కి కట్టుబడి ఉండడం! అప్పట్లో  ఏమీ తెలియలేదు గానీ, తర్వాత్తర్వాత కొన్ని ఉదంతాలు జరిగాక తెలిసొచ్చింది ఇలా యాచకుల్లోనూ రకాలుంటారని ! 
   ఇంతకీ దానగుణం మంచిదా కాదా?  మంచిదే, కానీ ఏదీ  మితిమీరి ఉండకూడదు. విజ్ఞులు ఏమంటారో ఏమో గానీ, ఆయా మనుషుల్ని బట్టి కూడా మనం  మారుతూ ఉండాలి అన్నది స్వానుభవంతో తెలుసుకున్న నా అభిప్రాయం ! కాదంటారా !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                   




Sunday, October 13, 2024

పుస్తకం... నా ప్రియ నేస్తం...

.                                          
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                            ~ యం. ధరిత్రీ దేవి 
   పుస్తకం నా ప్రియ నేస్తం...
   నాకు ప్రాణప్రదం...
   అలసిన వేళ సేదదీర్చే ఔషధం
   ఒంటరినైన...ఊరడించే నెచ్చెలి...
   తెరిస్తే చాలు... అక్షరాలు కావవి...
   అనంత కోటి ఆలోచనలు 
   కొలువుదీరిన కూటమి...!
   మేధావుల కలం నుండి జాలువారి
   చెక్కుచెదరక నిలిచిన 
   అక్షర శిల్పాలే మరి...!!
   అలరిస్తూ..మురిపిస్తూ ఒకసారి...
   నవ్విస్తూ..విషాదంలో ముంచేస్తూ
   మరోసారి... అంతలోనే...
   ఓదారుస్తూ.. నిద్రాణమైన శక్తిని 
   తట్టిలేపుతూ.. బద్ధకాన్ని వదిలిస్తూ...
   గమ్యం చూపిస్తూ.. ఆగకుమా 
   సాగిపొమ్మంటూ..వెన్నుతడుతూ 
   ముందుకు తోసే స్ఫూర్తిప్రదాతలు 
   ఆ అక్షర దీపాలు...!!
   హస్తభూషణం కాదు పుస్తకం...
   మస్తిష్కాన్ని మధించే 
   మహిమాన్విత ఉపకరణం..
   ఉజ్వల భవితకు సోపానాలు 
   వేసే ఉత్తమోత్తమ సాధనం...!
   విజ్ఞాన వినోదాల భాండాగారం...
   కాలక్షేపం కలగలసి..లభ్యం..
   మానసికోల్లాసం...!
   పుస్తకపఠనం..మెదడును
   పదును పెట్టే ఇంధనం...
   కావాలి దినచర్యలో అదో భాగం..
   నూతనోత్తేజానికి పడుతుందపుడే బీజం!!
   అందుకే... పుస్తకం నా ప్రియనేస్తం..
   నాకు ప్రాణప్రదం...!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








Friday, October 4, 2024

అమ్మ గురించి పాప...

         

   🌺🌺 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

   పసిపాపకు పాలిచ్చి జోకొడుతూ నిద్రబుచ్చుతుంది తల్లి.అది పాలు తాగే పసిపాపల వరకే వర్తిస్తుంది. అందులో ఆ అమ్మ శ్రమ ఉంటుంది, కానీ... కొంతవరకే...! అయితే... రెండు నుండి ఐదేళ్ల పిల్లల విషయంలో  అది మాత్రమే సరిపోదు. వాళ్లకి అన్నం తినిపించడమన్నది ఆ తల్లికి...అబ్బో!! చాలా కష్టంతో కూడుకున్న తతంగమే...! ఒకచోట కూర్చోరు... ఒకచోట నిలబడరు... అటూ ఇటూ పరుగులు! దాక్కోవడాలు !! అంతేనా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో... చిలిపి చేష్టలు...! అలాగని బుజ్జి తల్లి కడుపు నింపకుండా ఆ తల్లి ఉండగలదా !

    ఎన్నో ఊసులు చెప్తుంది... ఏవేవో కబుర్లు చెప్తుంది... ఉన్నవీ లేనివీ కల్పించి కాసేపు మైమరపిస్తుంది. ఏదైతేనేం... ఆకాస్త  బువ్వ బుజ్జిదాని కడుపులోకి వెళ్లేదాక ఊరుకోదుగా...! ఆ సహనమూర్తికి జోహార్లు అర్పించాల్సిందే..!
   ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ఓ తీపి అనుభవం ఇది...కాదంటారా!ఆ బుజ్జితల్లి రేపు తానూ తల్లిగా మారినపుడు..తన పాపకు అలాగే తినిపించాల్సి వచ్చినప్పుడు...ఆ తల్లికి  ఒకనాటి తన తల్లి పాట్లు, పాటలు గుర్తుకు రాక మానవు.ఒకనాటి తన అల్లరి, తల్లి మురిపెం ఆమె పెదాలపై చిరునవ్వు చిందించక మానదు.తనలో నిక్షిప్తమై దాగివున్న ఆ జ్ఞాపకాల దొంతర..అలా అలా కదిలి...ఇలా ఓ పాటగా ఎలా మారిందో వినండి... 🙂





       అమ్మ నాకు తినిపించే 
       అల్లిబిల్లి కబుర్లతో 
       ఆకాశం చూపిస్తూ 
       అపరంజిని నేనంటూ    //అమ్మ//👧

        ఇలకు దిగిన ఇలవేల్పునట 
        ఈశ్వరవరప్రసాదినట 
        ఉన్నదంత నాదంటూ 
        ఊర్వశినీ నేనంటూ        //అమ్మ//🤱

        ఎన్నడూ లేదంట 
        ఏలోటూ నాకంట 
        ఐశ్వర్యం నాదంటూ         
        ఐశ్వర్యను నేనంటూ       //అమ్మ//👧

        ఒరులెవరూ సాటిరారంట 
        ఓనాటికి నేనవనికి 
        ఔతానట మహారాణిని 👧
        అందలాలు ఎక్కేనట 
        అః !అహహ !! 
        నేనే ఒక నియంతనట !!  //అమ్మ//


🤗

   ఎప్పుడూ పాప గురించి అమ్మ చెప్పే కబుర్లేనా...! ఓసారి అమ్మ గురించి పాప చెప్పే కబుర్లు వింటే ఎలా ఉంటుంది...! ఆ ఆలోచనతో ఓ చిన్న ప్రయత్నం చేశానంతే 🙂
    తల్లి అయిన ప్రతి స్త్రీకి ఇది తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవమే... మరపురాని జ్ఞాపకమే...! బిడ్డకు జోల పాడి నిద్ర బుచ్చడానికి ఆ తల్లి గొప్ప సింగరే అయి ఉండాల్సిన అవసరం లేదు కదండీ..! అమ్మ ఎలా పాడినా పాపకు ఇష్టమే. హాయిగా కళ్ళు మూసుకుని  నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటుంది. అదండీ...🙂🤱
         .
    మరొక విషయం... ఈ బాల గేయాన్ని గమనిస్తే, ప్రతి లైన్  లోని మొదటి పదంలోని మొదటి అక్షరం మన తెలుగు వర్ణమాలలోని అచ్చులు... అ నుండి అః వరకు కనిపిస్తాయి. చాలా కాలం క్రితం చిన్నపిల్లల కోసం నేను రాసుకున్న పాట ఇది. ఈ పాట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ తరగతుల విద్యార్థులకు నేర్పించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను. 
 అందరికీ ధన్యవాదాలు.
*******************************
 

Wednesday, October 2, 2024

ప్రశ్నలు... ప్రశంసలూ...


      
*****************************************

      అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఓ ఆహ్లాదకరమైన అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను. ముద్దబంతి పూల గురించి మనందరికీ బాగా తెలుసు కదా.. వీటిని తలుచుకుంటే చాలు...మన తెలుగు సినిమాల్లో చాలా చాలా పాటలు గుర్తొస్తాయి కూడా..


--- ముద్దబంతిపువ్వులో మూగకళ్ల ఊసులో...
--- బంతిపూల రథాలు మా ఆడపడుచులు...
--- భామా భామా బంతీపువ్వా...
--- బంతిపూల జానకీ జానకీ...

ఇలా చాలా చాలా పాటలే ఉన్నాయి బంతిపూల మీద...
---- ఈవిధంగా సినీకవుల కలం  బంతిపూల మీదకు మళ్ళడానికి ఆ పువ్వు యొక్క ముగ్ధమనోహర అందమేనంటే అతిశయోక్తి కాదేమో!
   కన్నెపిల్లల వాలుజడల్లో ఒక్క పువ్వు పెట్టినా చాలు ఆ జడకే కొత్త అందాన్నిచ్చి అలరించే ఈ ముద్దబంతి పువ్వు ఇంతులందరికీ ఇష్టసఖి అంటే వింతేముంది!!
 ఒక్క సిగ సింగారానికేనా...! పండగపబ్బాలొస్తే చాలు...వీధుల్లో రాశులుగా దర్శనమిచ్చే ఈ పసుపు,ఎరుపు వర్ణాల బంతిపూలు మన గుమ్మాలకు తోరణాలుగా, సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఏ శుభకార్యం జరిగినా  అలంకరణలో ముందుగా కనిపించేదీ ఈ సుమబాలలే...!
   ఓ సంక్రాంతి పర్వదినాన బుట్ట నిండుగా మా ఇంటికొచ్చిన ఈ పరిమళభరిత బంతి పూలను చూడగానే...వెంటనే వాటితో మాట కలిపి,ఏవేవో ప్రశ్నలు అడగాలనిపించింది నాకు... వాటిలో మరీ ముద్దొస్తున్న ఓ పువ్వును అందుకుని మొదలెట్టాను ఇలా...🙂




ఏ తోటలోన..ఏ కొమ్మ పైన..విరబూసినావే...
ఏ దోసిలి నిండి...ఎన్నెన్ని దూరాలు నడిచొచ్చినావే 
మాకోసం విరిసీ...మాముంగిట నిలిచి 
మా ఇంట వెలుగులే వెదజల్లినావే 
బంతిపువ్వా...ఓ బంతిపువ్వా...        /ఏతోటలోన /

మా ఇంటి గడపకు పసుపునే అద్దినావు 
మామిడాకు పచ్చదనం నీకు జంట కాగా 
గుదిగుచ్చిన మాలవై గుభాలిస్తు నువ్వు 
మాఇంటి గుమ్మానికి తోరణం అయ్యావు...
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...     /ఏ తోట లోన /

ముంగిట్లో ముత్యాల ముగ్గులు 
ఆనడుమ గొబ్బెమ్మల మెరుపులు 
ఆపైని ఠీవిగ  నీ సోయగాలు 
వర్ణించ నా తరమా...ఓ పుష్పరాజమా...
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...    /ఏ తోట లోన /

వాలుజడల వయ్యారి భామలు 
ఆ సిగలో ఒదిగిన పూబంతులు 
వేయిరేకులొక్కపరి విచ్చుకున్న రీతి గనీ 
చందమామ చిన్నబోయి దాగింది చూడు మరీ...!

ముద్దరాలి ముద్దుమోము నీముందది ఏపాటి..!
నిజం నిజం... నిజం'సుమా'.. నీకు నీవె సాటి..
బంతిపువ్వా... ఓ బంతిపువ్వా...  /ఏ తోట లోన /

  🙂 
అలా చూడచక్కని ఆ ముద్దబంతి పూలపై ప్రశ్నలూ, ప్రశంసలు కురిపించాను. బదులుగా అవి ఏమివ్వగలవు చెప్పండి...! వాటి అందచందాలతో పరిమళాలు వెదజల్లుతూ మనల్ని అలరించడం, మన గృహాలకు అలంకారాలుగా మారడం తప్ప...!!
   అదండీ... ముద్దబంతి పూల ముచ్చట.. 🙂🤗

           🌺 అందరికీ ధన్యవాదాలు 🌺