Monday, March 25, 2024
Wednesday, March 20, 2024
పని'మనీ'షి
☺️
************************************************
ఇంటి మనిషి కాదు, కానీ...
ఇంటి ముందు పెడుతుంది
ముచ్చటైన ముత్యాల ముగ్గు !
ఇల్లు తనది కాదు, అయినా...
ప్రతి మూలా తనకు తెలుసు !!
తెలతెలవారుతుండగా
తలుపు తడుతుంది...
ఇంట్లో అందర్నీ తట్టిలేపుతుంది...
చీపురుతో మొదలెడుతుంది...
చెత్తాచెదారం వదిలిస్తుంది..
అద్దంలా మెరిపిస్తుంది...
అంట్లగిన్నెల పనిపడుతుంది..
అవి నా నేస్తాలంటుంది...😊
చకచకా కదులుతుంది
చలాకీ తనం తన సొంతమంటుంది
నాలుగిళ్లలో పనిచేస్తేనే కదా,
నలుగురి కడుపూ నిండేదంటుంది !
బ్రతుకుదెరువు కిదే నా దారంటుంది !
అవసరానికి ఆదుకో మంటుంది
మీ అవసరానికి 'నేను'న్నానంటుంది !
పాత చీరిస్తే పొంగిపోతుంది...
పట్టెడు మెతుకులతో సరిపెట్టుకుంటుంది
పరామర్శించి పోయే చుట్టం కాదు
పరిపరివిధాల సాయపడే నేస్తం !🙂
ఆమె రానినాడు ఇల్లాలికి ఇక్కట్లే !
ఇల్లంతా అల్లకల్లోలమే !!
అవును, ఆమె ఇంటి పనిమనిషి !
నిజం ! ఒప్పుకుని తీరాలి సుమా !
ఆమె--- గృహిణులకు ఓ ఆసరా !
ఉద్యోగినులకు భరోసా !
పరస్పరం ఆధారపడ్డ జీవులు మరి !
'మనీ 'తో ముడివడ్డ బంధం వారిది !
అందుకే అయిందామె పని'మనీ'షి !!😊
*****************************************
Sunday, March 10, 2024
కొత్త కోణం....కథ
🌷🌹
సెల్ లో అలారం మోగింది. టైం చూస్తే నాలుగున్నర కావొస్తోంది. దిగ్గున లేచింది విశాలి. నిద్రమత్తు వదిలించుకుంటూ చకాచకా పనుల్లో చొరబడింది. ఏడున్నరకు మిగతావాళ్లూ లేచారు. టిఫిన్ టేబుల్ మీద పెట్టేసి, పిల్లలకు, భర్తకు, మరిదికీ, ఆడపడుచుకూ లంచ్ బాక్సులు సర్దేసింది. ఎనిమిదిన్నరకంతా పిల్లలు, తొమ్మిదింటికి భర్త ఆఫీస్ కూ, మిగతా ఇద్దరూ కాలేజీలకు బయలుదేరారు. అత్తమామలకు టిఫిన్లు పెట్టేసి, స్నానాదికాలు పూర్తి చేసుకుని, టిఫిన్ తిందామని బౌల్ తెరిచింది. ఒకే ఒక్క దోశ, గిన్నెలో అడుగున కాస్త చట్నీ దర్శనమిచ్చాయి. ఫ్రిజ్ లో దోసెల పిండి ఉంది. కానీ మళ్ళీ వేసుకునే ఓపికెక్కడ ? ఉన్న ఆ ఒక్కటీ ఏదో తిన్నాననిపించి చేయి కడిగేసుకుంది. పన్నెండింటికి అత్తమామలకు స్టవ్ మీద అన్నానికి పెట్టేసింది. ఉదయమే అందరితోపాటు వండితే... చల్లారిపోయింది తినలేమంటూ సణుగుడు మరి !
*** *** ***
సాయంత్రం ఆరయింది. అందరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. విశాలి వంటింట్లో బజ్జీలు వేస్తూ, మరో చేత్తో అందరికీ ప్లేట్లలో పెట్టి అందిస్తోంది. అంతా లొట్టలు వేసుకుంటూ తింటూ టీవీ ప్రోగ్రాం ఎంజాయ్ చేస్తున్నారు. వంటింట్లో చెమటలు కారిపోతూ విశాలి ! రెండు రోజుల క్రితం భర్త శంకర్ మాటలు గుర్తొచ్చాయామెకు.
" ఏంటీ, రోజూ ఈ మిక్సరేనా ! మరేదైనా చేసి పెట్టొచ్చు కదా! ఏం చేస్తుంటావు...! రోజంతా ఇంట్లోనేగా... పనీపాట ఏముంది నీకు...!!"
ఆ మాటలు శూలాల్లా వచ్చి విశాలి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. గుడ్ల నీరు కుక్కుకుందేగానీ, పెదవి విప్పలేదు. చిన్నా పెద్దా... అంతాచూస్తున్నా చెవిటి వాళ్ళలా మౌనముద్ర దాల్చారు...! చేసేదేముంది ! ఈరోజు అందుకే ఈ బజ్జీల కార్యక్రమం..!
ఉన్నట్టుండి ఆడపడుచు మానస,
" అమ్మా, మా కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ గల కొందరు స్త్రీలను సన్మానించాలనుకుంటున్నారు. అందుకోసం స్టూడెంట్స్ అందరినీ మాకు బాగా తెలిసిన కొందరి పేర్లను ఇవ్వమన్నారు. అందులో నుండి కొందరిని సెలెక్ట్ చేస్తారట. నేనేమో..మన ఎదురింటి ఆంటీ శ్రీవిద్య గారి పేరు ఇద్దామనుకుంటున్నా.. వంటలు బాగా చేస్తుంది. కుట్లు అల్లికలు, టైలరింగ్ అంతా వచ్చు.. చక్కగా మాట్లాడుతుంది. ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి కదా ఆంటీ కి..."
" ఔనౌను, వెనక వీధిలో ఉంటుందే...రాధాబాయి... ఆవిడ పేరు కూడా ఇవ్వు. ఉద్యోగం చేస్తూ కూడా రకరకాలుగా అందరికీ సేవలు చేస్తూ ఉంటుంది..."
"... మరిచిపోయాను, బాగా గుర్తు చేశావు.."
వద్దనుకున్నా ఆ మాటలు చెవుల్లో దూరి,
" అంతేలే, గొడ్డు చాకిరీ చేస్తూ ఇంట్లో ఉన్న వదిన, కోడలు మాత్రం మీ కంటికి ఆనరు... "
అనుకుని నిట్టూర్చింది. నిజానికి తనకూ రకరకాల టాలెంట్స్ ఉన్నాయి. ఒకటి రెండు కంప్యూటర్ కోర్సులు కూడా చేసింది. ఇంగ్లీషులో చక్కటి పరిజ్ఞానమూ ఉంది. కానీ ప్రస్తుతం అవన్నీ సమసిపోయి వీళ్ళ దృష్టిలో ఎందుకూ పనికిరాని దానిలా తాను మిగిలిపోయింది. పెరటి చెట్టు మందుకు పనికి రాదు కదా! పొరుగింటి పుల్లకూరే రుచి మరి !! అలాగని సన్మానాలూ, సత్కారాలూ కోరుకోవడం లేదు తను. కాస్త గుర్తింపు.. అంతే! ఆమెలో బాధ, ఆవేదన అంచలంచెలుగా పెరిగిపోసాగాయి. ఇది ఒక నాటిది కాదు, పదేళ్లుగా గూడు కట్టుకున్న వ్యధ !
ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునే వరకు తను లేనిదే క్షణం గడవదు వీళ్ళందరికీ. వదినకు కాస్త సాయపడమని చెప్పే ఆలోచన అత్తగారికి ఉండదు. రేపు తనూ ఒకింటి కోడలు కావాల్సిందే కదా ! అప్పుడెలా ఉంటుందో ! వెంటనే...
" తనలా మాత్రం ఉండదులే... ఆ గడుసుదనం, ఆ అతితెలివీ నాకెక్కడివి? అవేవీ లేకనే నేనిలా ఉన్నాను..."
అనుకుంది మళ్ళీ. డిగ్రీ దాకా చదివిన విశాలి పెళ్లికి ముందు ఓ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత భర్త ససేమిరా వద్దన్నాడని మానేసింది. పది సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లల తల్లయింది. ఇంట్లో జీతభత్యాలు లేని పనిమనిషి పోస్టు సరే సరి !!
ఆమె దృష్టి పక్కనే కూర్చుని పుస్తకాలు ముందేసుకుని హోంవర్క్ చేసుకుంటున్న కూతురు, కొడుకు మీదకు మళ్ళింది. అమాయకంగా కనిపిస్తున్న కూతురు శృతిని చూస్తూ,
" ఇంత గారాబంగా చూసుకుంటూ, ఇంత లేసి ఫీజులు కడుతూ చదివిస్తున్న ఈ పిల్ల గతి కూడా రేపు ఇంతేనా ! నాలాగేనా ! అదేదో సినిమాలో ఓ ఆడపిల్ల తండ్రి,
" ప్రాణప్రదంగా, అడుగేస్తే ఎక్కడ కందిపోతుందో అని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వచ్చిన బిడ్డను పెళ్లి పేరిట మరో ఇంటికి ఓ పనిమనిషిగా పంపిస్తున్నాం ."
అంటాడాయన ఓ సందర్భంలో ఆవేదనగా !! ఆమాత్రానికి అంతంత ఖర్చుపెట్టి వీళ్ళని అంత గొప్పగా చదివించడమెందుకో!తల పట్టుకుంది విశాలి. టీవీలో పాట వస్తోంది.
"మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా.. "
నిజమే! సహనం ఉండాలి. ఆ సహనానికి హద్దులూ ఉండాలి. ఇంట్లో వాళ్లకే తన విలువ తెలియదు. లోకానికంతా తెలుసా అనడుగుతున్నాడు. పాటలు ఎంత బాగా రాస్తారు ! పాడేవాళ్లు అంతకన్నా అద్భుతంగా పాడుతారు... కానీ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది... అసలు బాధ..!
మహిళా దినోత్సవం అనేసరికి గుర్తొచ్చింది ఆమెకు, రెండు సంవత్సరాల క్రితం తను తీసుకున్న ఓ నిర్ణయం గురించి... అది తను మళ్లీ ఉద్యోగం చేయాలని..! ఏ చిన్నదైనా సరే....చేయాలి..! తప్పదు.. అనుకుంది. రెండు మహిళా దినోత్సవాలు గడిచిపోయాయి గానీ, అనుకున్నది మాత్రం జరగలేదు.
ఎలా ఉండేది చదువుకునే రోజుల్లో ! ఎప్పుడూ చుట్టూ పదిమంది ఫ్రెండ్స్! రకరకాల వ్యాపకాలు! ఆ విశాలి ఇప్పుడేదీ? ఎక్కడ ? ఆ గలగల నవ్వులేవీ ? ఏమైపోయాయి? ఇలా మూగగా మిగిలిపోయిందేమిటి!
ఆరాత్రి ఆమె కన్నీటితో చెంపలు తడిసిపోయాయి. ఆ తడి ఆమెకో పాఠం నేర్పింది. ఆ పాఠమే ఆమెకో దిక్సూచి అయింది . కరడు గట్టిన ఆమె గుండె స్థిరత్వం సంతరించుకుంది.
*** *** ***
మూడు నెలలు గడిచిపోయాయి. ఆఉదయం.... పిల్లలిద్దరూ ఆటోలో స్కూల్ కి వెళ్ళిపోయారు. మరిది, ఆడపడుచు కాలేజీకి బయలుదేరుతున్నారు. భర్త షూ వేసుకుంటున్నాడు. అత్తమామలిద్దరూ టిఫిన్ చేస్తున్నారు. ఇంతలో విశాలి రెడీ అయి, బ్యాగ్ భుజానికి తగిలించుకుని వచ్చింది.
" నేనూ మీతో వస్తున్నా.... నన్ను నవోదయ స్కూలు దగ్గర డ్రాప్ చేయండి. ఈరోజు నుండీ నేను ప్రీ ప్రైమరీ క్లాస్ టీచర్ గా జాయిన్ అవుతున్నానక్కడ...."
అంతా ఒక్కసారిగా ఆమె వంక చూశారు చిత్రంగా.
విస్తు పోయిన శంకర్,
" అదేంటీ ! చెప్పా పెట్టకుండా..."
" చెబితే ఏం జరుగుతుందో తెలుసు.. పదండి"
భర్త ముఖం చూడకుండా బయటికి దారి తీసింది విశాలి.
" అది కాదే... నీవిలా వెళ్ళిపోతే, ఇంట్లో ఎలా? "
కాస్త దూరంలో రోడ్డు మీద నిలబడి ఉన్న విశాలి పక్కన బండి ఆపాడు శంకర్.
" ఎలా ఏమిటి? నలుగురున్నారు.. పనులన్నీ తలా కాస్త షేర్ చేసుకోండి... చేతకాకపోతే.. ఓ మనిషిని పెట్టుకోండి.. నేను లేకపోతే ఇంట్లో అంతా స్తంభించిపోతుందని మాత్రం అనుకోకండి. చూస్తూ ఉండండి. అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి... "
మరో మాటకవకాశం లేకుండా ఎక్కి కూర్చుంది విశాలి. ఆ స్వరంలో, ఆ మొహంలో మునుపెన్నడూ లేని స్థిరత్వాన్ని గమనించిన శంకర్ కు భార్యలో ఇంతవరకూ తానెరుగని ఓ కొత్తకోణం గోచరించింది. క్షణం అతని గుండె రెపరెపలాడింది. మరుక్షణం దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.... తనూ కారణమా అనిపించి, ఏదో మూల అతనిలో ' గిల్టీ ఫీలింగ్'!! వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుంటూ, బండి స్టార్ట్ చేశాడు.
విశాలి పెదాలపై చిరునవ్వు ! ఆమెలో ఈ ప్రపంచాన్నే జయించినంత తృప్తి !!
******************************************
[ ప్రతీ ఆడదీ ఉద్యోగమే చేయాలనేమీ లేదు. ఇంట్లో ఆమె శ్రమను గుర్తిస్తే చాలు. ఆమె సహనాన్ని అభినందించాలి. సేవాగుణాన్ని, సర్దుబాటుతత్వాన్ని కొనియాడాలి. ఆమె విలువ తెలుసుకుని గౌరవించాలి. ప్రతీ ఇంట్లో ఇది జరిగితే... అల్పసంతోషి అయిన స్త్రీ ఆనందానికి అవధులుండవు. ఆమె కంట కన్నీరన్నది అసలుండదు. ]
******************************************
Saturday, March 9, 2024
హోమ్ మినిస్టర్....కథ
🌷 ~~యం.ధరిత్రీ దేవి~~
కిటికీలోంచి సూర్యకిరణాలు చురుక్కుమని తగిలేసరికి కళ్ళు నులుముకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు సాంబశివరావు. అప్రయత్నంగా గోడకేసి చూసిన అతనికి గడియారం ఎనిమిది గంటలు చూపించింది. 'మై గాడ్' అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి హాలు లోకెళ్ళిన అతనికి అడ్డదిడ్డంగా పడి ఇంకా లేవని ఇంటర్, డిగ్రీ చదువుతున్న సుపుత్రులు వంశీ, వరుణ్ దర్శనమిచ్చారు. తండ్రి అరుపులకు దిగ్గున లేచి బాత్రూంలోకి దూరిపోయారిద్దరూ.
హడావుడిగా కిచెన్ లో అడుగుపెట్టిన అతనికి రాత్రి తిని పడేసిన ఎంగిలి కంచాలు, అంట్లగిన్నెలు వాసన కొడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా నీరసం కమ్ముకొచ్చి ఠక్కున ఇల్లాలు గుర్తొచ్చింది.
నిన్న ఉదయం వాళ్ళనాన్న బాత్రూంలో జారిపడి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, హాస్పిటల్లో ఉన్నాడు అర్జెంటుగా రమ్మని వాళ్ళ అమ్మ ఫోన్ ! అంతే!గబగబా వంట చేసేసి, రెండు చీరలు ఓ సంచీలో కుక్కుకుని ముక్కు చీదుకుంటూ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయింది జానకి...అతని అర్ధాంగి. ప్రస్తుతం ఇంటి దీన పరిస్థితికి అదీ కారణం...
అరగంటలో స్నానాలు, గీనాలు ముగించేసి బయటపడ్డారు ముగ్గురూ.అలా అలా నాలుగు రోజులు గడిచాయి. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం భయంగా ఉంటోంది సాంబశివరావుకి... ఇల్లంతా దుమ్ము...! ఎక్కడి సామాన్లు అక్కడే! విడిచి బట్టలన్నీ మంచాల మీద !! వంటిల్లయితే చెప్పనలవికానట్లుంది... ఇంటి బయట ఎండిన ఆకులు, దుమ్ము ధూళి.. అంతా పరుచుకొని కంపరంగా అనిపిస్తోంది. వాటి కింద నుండి జానకి వెళ్లే రోజు ఉదయం వేసిన ముగ్గు దీనంగా తొంగి చూస్తూ కనిపిస్తోంది. ప్చ్ ! ఎలా ఉంచేది ఇల్లు!! అద్దంలా... ముట్టుకుంటే మాసిపోతుందా అన్నట్లు..!
వారం దాటింది. జానకి జాడలేదు. ఫోన్ చేస్తే... "వయసు బాగా మీద పడింది కదా... నాలుగైదుచోట్ల కాలి ఎముకలు విరిగాయట...రెండు ఆపరేషన్లు అయ్యాయి. మరో వారం దాకా హాస్పిటల్లోనే ఉండాలట... మా అమ్మ ఒక్కతే ఇంట్లో, హాస్పిటల్లో చూసుకోలేకపోతోంది. వచ్చేవారం మా అన్నా, వదిన వస్తామన్నారు. అందాక నేను రాలేను... ఎలాగోలా మీరే సర్దుకోండి..."
అంటూ చెప్పేసింది జానకి. గుండెల్లో రాయి పడింది సాంబశివరావుకి. ఇద్దరు కొడుకులు తల వేలాడేసుకుని, మౌనంగా ఉండి పోయారు. చేసేదేముంది... అనుకుంటూ.. ఉదయం కాఫీలు మాత్రమే ఇంట్లో... టిఫిన్లు, మధ్యాహ్న భోజనం... బయట. రాత్రి మాత్రం ఏ ఉప్మానో, చపాతీనో చేసుకుని చట్నీలతో, కారంపొడులతో కానిచ్చేస్తున్నారు.
సాంబశివరావుకి వంట బొత్తిగా రాదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకొని ఉండేవారు. అప్పుడు కాస్త అలవాటు అయినవే..ఈ ఉప్మా, చపాతీ ప్రిపరేషన్లు... భార్య వచ్చాక, ఇక వంటింట్లో అడుగు పెట్టే అవసరం నాకేంటి.... అన్న ఫీలింగుతో కాలర్ ఎగరేసి తిరిగాడు.అంతేనా ! ఇద్దరూ కొడుకులే పుట్టారని తెగ మురిసిపోయాడింతవరకూ. కానీ.. ఇప్పుడు తెలిసి వస్తోందతనికి... ఆడపిల్ల లేని లోటు..! దేవుడా! నిజంగా ఆడది లేని ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా..! ఇంటికి దూరంగా ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు జానకి... కాన్పుల సమయంలో కూడా వాళ్ల ఊర్లో వైద్య సౌకర్యం సరిగా ఉండదని ఇక్కడే ఉండిపోయింది మరి... నిస్సహాయ స్థితిలో పడిపోయిన సాంబశివరావుకి పదేపదే పెళ్ళాం గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేముంది...!
ఎలా ఉండేది ఇల్లు జానకి చేతిలో! ఉదయం ఎప్పుడు నిద్ర లేచేదో ఏమిటో... ఎనిమిదింటికంతా ఒంటిచేత్తో అన్నీ సిద్ధం చేసి ఉంచేది. పనిమనిషి కూడా వద్దని సర్వం తనే చేసుకునేది. అందరి బట్టలూ ఉతికి ఇస్త్రీ చేసి టైంకు రెడీగా ఉంచేది. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టేసరికి.... ఇల్లంతా ఆహ్లాదకరంగా. హాయిగొల్పుతూ ఉండేది. ఇప్పుడు..! తను లేని ఇల్లు బావురుమంటూ భారంగా అనిపించింది సాంబశివరావుకి! ఉన్నప్పుడు తెలియలేదు గానీ తన విలువ...ఎంతైనా ఆడవాళ్లు గ్రేట్ !! అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో 'ఇల్లాలు', 'ఇల్లాలే దేవత ', 'ఇంటికి దీపం ఇల్లాలు '...లాంటి సినిమా టైటిల్స్ అన్నీ గుర్తొచ్చాయి. దాంతోపాటు...
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి,
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి "
"ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం "
లాంటి సినిమా పాటలు కూడా గుర్తొచ్చి, గుచ్చి గుచ్చి మరీ వేధించాయి.
ఆ సాయంత్రం వంటింట్లో అడుగు పెట్టిన అతని చూపు అప్రయత్నంగా ఆ పక్కనే ఉన్న దేవుని గూడుపై పడింది. జానకి వెళ్లేరోజు పూజ చేస్తూ పెట్టిన పూలు, వాడి ఎండిపోయాయి. అగరొత్తుల తాలూకు ఆనవాళ్లు అక్కడ గూటినిండా పరుచుకుని ఉన్నాయి. అతని మనసంతా కలచివేసినట్లయింది. వెంటనే చీపురు తీసుకుని ముందు వంటిల్లంతా శుభ్రం చేశాడు.అలవాటు లేని పని !దేహం మొరాయించింది. అయినా, అలాగే మిగతా రూములూ అయిందనిపించాడు. .. కొడుకులు అది చూసి లేచారు. పక్క బట్టలన్నీ సర్దేశారు.
లోపల ఎలాగోలా అయిపోయింది... మరి గేటు బయట సంగతి! ఊడ్చడానికి నామోషీ ఒకటి! తల పట్టుకుని, "ఈ ఇల్లు అద్దెకిస్తారా " అని ఎవరూ అడగకముందే జానకి వచ్చేస్తే బాగుండు అనుకున్నాడు లోలోపల సాంబశివరావు. పోనీ, ఎవరైనా పనిమనిషిని చూద్దామా అనుకుంటే అంత అర్జెంటుగా దొరకడం గగన కుసుమమే! ఫోన్ చేసి భార్యను రమ్మనేద్దామా అనుకున్నాడో క్షణం. అత్తింటి వాళ్ళు ఎన్నడూ తన సహాయం కోరింది లేదు ఇప్పటివరకూ. లేక లేక అవసరమొస్తే తానలా చేయడం నచ్చక ఆ ఆలోచన విరమించుకున్నాడు వెంటనే..వారం అన్న జానకి మరో వారం దాకా రాలేదు. వాళ్ళ అన్నకు సెలవు దొరకలేదట..డీలా పడిపోయి జ్వరం వచ్చినంత పనయింది సాంబశివరావుకి.
ఆరోజు ఉదయం తెలతెలవారుతుండగా గేటు చప్పుడయింది. జానకి రెండు సంచులతో ఇంట్లో అడుగు పెట్టింది. వంటింట్లో పాలు మరగబెట్టే పనిలో ఉన్న సాంబశివరావు అది గమనించి, అకస్మాత్తుగా దేవత ప్రత్యక్షమైనట్లు సంబరపడిపోయాడు..
" జానకీ, వచ్చేశావా...! ఫోనయినా చేయలేదే!.."
అంటూ సంచులు అందుకున్నాడు.
" అవునండీ, అన్న, వదిన నిన్న సాయంత్రం వచ్చేశారు. ఇప్పటికే లేటయిందని నేను రాత్రి బస్సుకే బయలుదేరాను...ఏమిటీ, వీళ్ళింకా లేవలేదా..!"
అంటూ పిల్లల గదిలోకి తొంగి చూసింది. తల్లి గొంతు వినిపించి ఇద్దరూ గబగబా లేచి వచ్చారు వంశీ, వరుణ్. ఇల్లంతా ఓసారి పరికించి చూసిన జానకికి అంతా అర్ధమైపోయింది. అప్పటికప్పుడు ఏమీ అనాలనిపించలేదామెకు. చీర కొంగు బిగించి, చీపురు అందుకుంది. అరగంటలో ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఇన్నేళ్లుగా తాను చేస్తున్న తప్పిదం బాగా తెలిసి వచ్చిందామెకు. దాంతోపాటు తన కర్తవ్యం కూడా బోధపడింది. ఇదంతా ఏమీ పట్టని సాంబశివరావు ఊపిరి పీల్చుకొని ఈజీ చైర్ లో రిలాక్స్ అయ్యాడు.
ఆ సాయంత్రం...
" రేయ్ఎక్కడికి బయల్దేరారు?... "
కాలేజీ నుండి వచ్చి బ్యాట్లు పుచ్చుకుని బయటకు దారి తీయబోతున్న వంశీ, వరుణ్ తల్లి వైపు బ్యాట్లు చూపిస్తూ,
" క్రికెట్ ప్రాక్టీస్ కు మమ్మీ.."
అన్నారు ఒకేసారి.
" అవన్నీ తర్వాత. ముందు అవి పక్కన పెట్టి ఇలా రండి, మీతో మాట్లాడాలి"
" అబ్బా,మమ్మీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాక్టీస్ కు లేట్ అవుతుంది..."
"కుదరదు, నోరు మూసుకుని రండి."
గద్దించేసరికి అలాగే బ్యాట్లు పట్టుకొని వచ్చి సణుగుతూ కూర్చున్నారు..
" జాగ్రత్తగా వినండి. ఈరోజు నుండీ కొన్ని అలవాట్లు మార్చుకోండి ఇద్దరూ . మీ పనులు మీరే చేసుకోవాలి.అంటే మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మీ పుస్తకాలు అన్నీ మీరే సర్దుకోవాలి. ఇంటిపనులతోపాటు చిన్న చిన్న వంటపనులూ చేయాలి.... "
"...................."
"...రేపేదో మీ పెళ్ళాలకు చేసిపెట్టాలని కాదు, ఇదిగో, ఇప్పుడొచ్చిపడిందే గడ్డు పరిస్థితి...!అలాంటపుడు ఇబ్బంది పడకూడదని....! కనీసం కొంతలోకొంతైనా ఎవరికోసం చూడకుండా చేసుకోగలగాలని... అంతే.."
తలెత్తి చూశారిద్దరూ.
"...అయినా మీ తప్పేమీ లేదులే. అంతా నాదే నాదే. మీకు మొయ్యకుండా ప్రతీదీ అమర్చిపెడుతున్నా చూడండీ... నాదీ.. నాదీ తప్పు. మగపిల్లలు మహారాజులూ... వాళ్ళు ఆడపనులు చేయకూడదూ అని మా అవ్వ, ముత్తవ్వ కాలం నాటి చాదస్తాలన్నీ నేనూ పాటించాను చూడూ...నాదీ..నాదే తప్పంతా. బుద్దొచ్చింది. ఉదయం మీఇద్దర్నీ చూశాక బాగా బుద్ధొచ్చింది. నాన్న వంటింట్లో ఒక్కడే అవస్థ పడుతుంటే మీరేమో హాయిగా గుర్రుపెట్టి నిద్దరోతున్నారు. సిగ్గుగా లేదురా మీకు !.."
"మమ్మీ, అదీ... "
" ముయ్యండి నోరు. ఇకనుంచీ నేను చెప్పినట్టు చేసితీరాల్సిందే.. "
"సరే మమ్మీ, ఈరోజు ప్రాక్టీస్ కెళతాం. రేపటినుండీ... "
"...కుదరదు. ఈరోజే ఇప్పుడే. మొదలెట్టాలి. మిగతావన్నీ తర్వాత.. "
తల్లి గొంతులో, ప్రవర్తనలో ఇదివరకెన్నడూ చూడని కాఠిన్యం చూశారిద్దరూ. మెల్లిగా బ్యాట్లు మూలన పెట్టి మాసిన బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు నడిచారు. టీ తాగుతున్న సాంబశివరావుకు భార్య ఏమిటో కొత్తగా కనిపించిందా క్షణంలో.
" మొక్కై వంగనిది మానై వంగదండీ. అలవాటు పడాలి వీళ్ళు, తప్పదు. కొద్ది రోజులు నేను లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎలా తయారైందో... !"
భార్య పరోక్షంగా తననూ అంటోందా అనిపించింది సాంబశివరావుకు. అయినా,సబబుగానే తోచింది అతనికి. ఈ మూడు వారాలూ తను పడ్డ కష్టం తలుచుకుంటే...! ప్రతీ ఇంట్లో చిన్నప్పట్నుంచీ మగపిల్లలకు తల్లో, అమ్మమ్మో, నాయనమ్మో లేకుంటే అక్కో, చెల్లో... ప్రతిదీ అందిస్తూ, అన్నీ అమరుస్తూ వాళ్ళను సోమరులుగా, ఏపనీ చేతగానివాళ్ళలా తయారుచేస్తున్నారు. ఇది ఆడపని..మేమెలా చేస్తాం అన్న ధోరణిలో పెరుగుతున్నారు. డిపెండెంట్ నేచర్ డెవలప్ అవుతోందని వాళ్ళకర్థం కావడం లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే ముందు తల్లులు మారాలి.. ఇదిగో...ఇలా...జానకిలా...! మనసులోనే భార్యను అభినందించాడు. కానీ, పైకి మాత్రం,
" అది సరే వింటారంటావా... !"
అంటూ తటపటాయిస్తూనే సందేహం వెలిబుచ్చాడు.
" తమరు వీళ్లకు వత్తాసు పలక్కుండా ఉండండి చాలు.. "
దండం పెట్టింది జానకి.
" ఓకే ఓకే. హోమ్ మినిస్టర్ ఆదేశించాక తప్పుతుందా మరి !"
నవ్వుతూ, మరి ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని మెల్లిగా లేచి,అలా బయటికెళ్ళొస్తా... అంటూ గేటు దాటాడు. అక్కడ ఇంటి ముందు ముచ్చటగా ఓ కొత్త ముగ్గు..! మురిపెంగా కనిపించింది. అక్కడ నిన్న పరుచుకున్న చెత్త ఇప్పుడు మచ్చుకైనా లేదు.
"ఆహా ! ఆడది ఉన్న ఇంటికీ లేని ఇంటికీ ఎంత తేడా! ఇదంతా ఇల్లాలి మహిమే కదా!"
భార్యపై ప్రేమతో పాటు గౌరవమూ కలిగింది సాంబశివరావుకి.అంతలో ఠక్కున ఏదో స్ఫురించింది. బాపురే !ఈరోజు ఏదో విశేషమున్నట్లుందే !ఏమిటబ్బా!
బుర్ర గోక్కున్నాడు. మార్చ్, 8. Women's Day. మహిళాదినోత్సవం..! మరిచేపోయా... ఈ సందర్భంగా నా ప్రియమైన శ్రీమతికి ఓ చక్కటి బహుమతి ఇచ్చి తీరాల్సిందే... తృప్తిగా, సంతోషంగా ముందుకు కదిలాడు సాంబశివరావు.
🌷💐🌹🌷💐🌹🌷🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌹💐
Friday, March 8, 2024
పాప పుట్టింది
🤗
పాప పుట్టింది
ఓ జీవితం మొదలైంది
ఈ ఇంటి దీపం
ఆ ఇంట వెలుగవుతుంది
మరో తరానికి ఊపిరి పోస్తుంది
తనను తాను మరుస్తుంది
తన వారి గురించే తలుస్తుంది
బ్రతుకంతా త్యాగాల మయం
తరుణీ ! నీకు వందనం.... 🌷
Subscribe to:
Posts (Atom)