Tuesday, July 27, 2021

కళ్ళు

కళ్ళు 
కథలు చెబుతాయి 
కబుర్లాడతాయి 
మౌనంగానే మాట్లాడతాయి 
ఊసులెన్నో వినిపిస్తాయి !
కళ్ళు 
కలలెన్నో కంటాయి 
ఊహల పల్లకీలో తేలిపోతాయి 
అవి కల్లలైతే కన్నీటి కుండలౌతాయి !
అంతలోనే తెప్పరిల్లి తేరుకుంటాయి !
కళ్ళు 
సృష్టి లోని అందాలు, అవకరాలూ 
చిమ్మచీకట్లు, వెలుగు రేఖలు 
వీక్షించి, ప్రతీ దృశ్యం ముద్రించి 
మదిని నిక్షిప్తం చేయగల 'కెమెరాలు '
కళ్ళు 
గుండె చప్పుళ్లకు దర్పణాలు 
మనసు పొరల రెపరెపలకు ప్రతిబింబాలై 
రెప్పల తలుపులు తెరుచుకుని 
సడిసేయక అందిస్తాయి సందేశాలు !

అవి మనిషి కళ్ళు !
మనిషికి దేవుడిచ్చిన 
దివ్య వరమే కదా ఈ నయనాలు !!

*********************************
             🌺 భువి భావనలు  🌺
*********************************

Wednesday, July 21, 2021

జ్ఞాపకాలు మాత్రం పదిలం !

       బుడగవంటిదేనా ఈ జీవితం! అనిపిస్తోంది, ఈమధ్య నడుస్తూ నడుస్తూనే హఠాత్తుగా కనుమరుగైపోతున్న కొందరిని చూస్తుంటే! ఏదో తీవ్ర అనారోగ్యానికి గురై కొంతకాలం పాటు బాధపడి, మృత్యుముఖంలోకి పోతే, అది వేరే సంగతి. కానీ,   ' 'కరోనా' మహమ్మారి జనాల్లోకి ప్రవేశించిన తరువాత పరిస్థితి పూర్తిగా తలక్రిందులైపోయింది. మొదటి వేవ్ లో ఎక్కడో దూరాన మనకు తెలియని వ్యక్తులు, అతి కొద్దిమంది సెలబ్రిటీలు దీని బారిన పడి విగతజీవుల య్యారన్న వార్తలు చదివాం. కానీ, సెకండ్ వేవ్ లో   మన చుట్టూ ఉన్న వాళ్లే చాలా మంది దీని కాటుకు గురవడం చూస్తున్నాం. ఇంకా అత్యంత ఆప్తులు కూడా ఊహించని రీతిలో దూరమై పోయి, కుటుంబాల్ని శోక సముద్రంలో ముంచి వేస్తున్న ఉదంతాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. 
     కొద్ది రోజుల క్రితం మా కుటుంబ స్నేహితుడొకాయన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ఉదయం ఏడింటికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, ఎంతో ఉత్సాహంగా మరింత ఆనందంగా ఇంట్లో అందర్నీ ఆహ్వానించారు. ఆ సమయంలో ఆయన ఎంతో హుషారుగా, ఉల్లాసంగా ఇంకా ఆరోగ్యంగానూ కనిపించారు. మరో రెండు వారాల్లో పెళ్లి. తీరా ఆ రోజు అక్కడికి వెళ్తే ఎంతో సందడి సందడిగా ఉండాల్సిన ఫంక్షన్ హాల్ మూసివేయబడిఉంది. ఆరా తీస్తే, ఆయనకి కోవిడ్ సోకి హైదరాబాద్ హాస్పిటల్లో చేరార న్న వార్త తెలిసింది. మరో వారానికల్లా ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. షాకింగ్ న్యూస్ ! అంత ఆరోగ్యంగా కనిపించిన మనిషి ఇలా వెళ్ళిపోవడం ఏమిటి? ఎంతో అట్టహాసంగా, ఆనందంగా జరగాల్సిన కొడుకు పెళ్లి అర్ధాంతరంగా వాయిదా పడిపోయింది. పెళ్లి సందడి తో కళకళలాడాల్సిన ఆ ఇల్లు కళ తప్పి వెలవెలబోయింది. ఇలాంటివే మరికొన్ని ఉదంతాలు మా బంధుగణంలో  జరిగాయి. అందులో ఒకరు---
 కవితా  హృదయం గలిగి చక్కగా కవితలు రాసే  వాడూ, గాయకుడు, సంగీత సాహిత్యాభిలాషి, వరుసకు నాకు అన్నగారైన రాజశేఖర్ రెడ్డి గారు.  ఆంధ్రోపన్యాసకులుగా డిగ్రీ కళాశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన బంధువర్గంలో చక్కని ఆత్మీయ సంబంధాలు కలిగిన వ్యక్తి. దాదాపు రెండు నెలల క్రితం మా ఇంటికి వచ్చి, ఒకరోజు మాతో గడిపి చక్కగా కబుర్లాడిన ఆయన ఈరోజు లేడు ! నెలన్నర క్రితం కరోనా మహమ్మారి సోకి, హైదరాబాద్ హాస్పిటల్ లో మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. కుటుంబ సభ్యులకే కాదు, బంధువులందరినీ  కలచివేసిన వార్త ఇది ! అడపాదడపా ఫోన్లు చేస్తూ, క్షేమ సమాచారాలు వాకబు చేస్తూ ఆత్మీయంగా పలకరించే ఆ గొంతు ఇకపై మాట్లాడదు, పలకదు. శాశ్వతంగా మూగబోయింది. గతంలో ఆ గళం  నుండి జాలువారిన కవితా గానాలు మాత్రమే జ్ఞాపకాలుగా మిగిలి వాటినే  పదే పదే నెమరు వేసుకోమంటున్నాయి.  
    వీళ్లే కాదు, ఎంతో భవిష్యత్తు ఉండి, ఎన్నో బాధ్యతలు నిర్వహించవలసియున్న పిన్న వయస్కులు కూడా కోవిడ్  కాటుకు బలై అకాల మరణం చెందుతున్నారు.మనుషుల్ని ఇలా హఠాత్తుగా అదృశ్యం చేయడం కరోనాకే సాధ్యమేమో ! ఇవన్నీ చూస్తుంటే, ఏమిటీ దారుణాలు  ! జీవితమంటే  ఇంతేనా! అనిపిస్తూ, ఓ రకమైన వేదాంత ధోరణి లోకి పోవాల్సి వస్తోంది. 
     మరణమన్నది తథ్యం!నిజమే ! ఎవరికైనా ఎప్పుడైనా తప్పనిదే. కానీ ఇలా అకస్మాత్తుగా, అనూహ్యంగా సంభవించడమన్నది అత్యంత బాధాకరం. భగవంతుడు వారందరి ఆత్మలకు శాంతి కలగజేయాలని వేడుకుందాం. 

***********************************

Friday, July 9, 2021

నిన్ను చూసి మైమరిచి నా మది పలికిందిలా !



సృష్టిలోని అందమంతా నాకేే సొంత మన్నట్లు
ఎంత ఠీవిగా  నిలబడినావే కొమ్మా, ఓ మందారం కొమ్మా  !
విచ్చుకున్న పచ్చపచ్చని ఆ పత్రదళాలు 
రక్షకభటులై నిను చుట్టుముట్టి ఉండగా
రెట్టింపైన  నీ అందం చూపరులనిట్టే కట్టిపడవేయుచున్నదే!
ఎర్రెర్రని ఆ పుష్ప సోయగం పూరేకుల ఆ పరిమళం 
నీ ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతున్నాయిలే !
చెంత  నిలిచిన చిన్నారి చిట్టిమొగ్గలు నీ దర్పం తిలకిస్తూ 
" మిడిసి పడకు సోదరీ, రేపో మాపో 
నీకు దీటుగా వికసిస్తాములే మేమూ "
అంటూ గుసగుసలు  పోతున్నాయి చూడు !
నీ వెనుక నిలిచిన మరో పూబాల నీ నెచ్చెలి 
నీ వయ్యారం గని ఈసుతో అలిగి అంతలోనే తెప్పరిల్లి 
" చెలీ, నీ సోయగం నాకూ పంచవా"అంటోంది వింటివా!
సూర్యకిరణాల నులివెచ్చని తాకిడి 
నీపై వెలుగులు విరజిమ్మగా ఆ వెలుగుల మెరుగులతో 
బంగరుకాంతులలముకొన్న నీ ప్రతీ కొమ్మా 
గాలికి ఊగుతూ  కురిపిస్తోంది సౌరభాల వృష్టి !

ముద్దు ముద్దుగ కొమ్మను విరిసిన
ఓ అందాల కోమల కుసుమమా !
"ఆయువు రోజైతే నేమి గాక, 
ఈ రోజు నాది, నాకు నేనే సాటి "
అంటూ నువు చూపే ధీమా 
నవ్వుతూ నలుగురినీ అలరించడమే 
నీ ధ్యేయమన్న సందేశం 
చెప్పకయే చెబుతోంది సుమా !!


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
                  *భువి భావనలు *
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Saturday, July 3, 2021

ఏడంతస్తులమేడ

         ఏడంతస్తులమేడ 
                    ~ ధరిత్రీ దేవి 
                     
 అందమైన బొమ్మరిల్లు నా ఇల్లు
 పూరిళ్లయితేనేమి గాక !
 నాకదే ఏడంతస్తుల మేడ!
 ఇది  మమతానురాగాలు
 వెల్లివిరిసిన చోటు
 మధురమైన జ్ఞాపకాలు
 నిక్షిప్తమైన ఓ నిధి !
 ఇవన్నీ నా ఆత్మీయులైతే 
 కలతలు, కన్నీళ్లు
 కష్టాలు, కడగండ్లు
 వచ్చి పోయే చుట్టాలు మాత్రమే !
నా ఈ కుటీరం 
 నను సేదదీర్చే బృందావనం !
 ముంగిట్లో ముచ్చటగా
 ముత్యాల ముగ్గులు
 అటూ ఇటూ అలరించే
 మందారాలు, మల్లెమొగ్గలు !
 అటుపై నర్తించే పలువన్నెల 
 సీతాకోక చిలుకలు !
 అనుదినం అనుక్షణం
 నను ఆహ్లాదపరుస్తోంటే 
 అల్లంత దూరాన పారే 
 సెలయేటి గలగలలు
 సరిగమలై వీనులవిందులు 
 చేస్తూ మురిపిస్తాయి!
 గాలికి ఊగే కొమ్మల రెమ్మల
 వాయిద్యగోష్ఠులు 
 ఆపై వంత పాడుతూ 
 కొమ్మ చాటు కోయిల
 కుహూ-కుహూ రాగాలు !
 అలసిసొలసి మేను వాల్చిన నాకు 
 జోల పాటలై నిదురమ్మ ఒడినిజేర్చి 
 విశ్రమింపజేస్తాయి !!
 ఇంతకన్నా వైభోగం
 మరెక్కడైనా దొరకునా? 
 పోటీ పడగలదా దీనితో
 ఏ భవంతైనా? 
 అందుకే --
 నా ఈ కుటీరం నాకెంతో ప్రియం 
పూరిల్లయితే నేమి గాక !
నాకిదే ఏడంతస్తుల మేడ !!
                ________________