🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పువ్వు విరిస్తే నవ్వు విరుస్తుంది
పాప నవ్వితే పలుకు పాటవుతుంది...
కోయిల కుహూ అంటే పాడాలనిపిస్తుంది..
కవిహృదయం అంటే ఇదేనా !!
నింగిని మబ్బులు కమ్మితే...
అవి కరిగి జల్లుగా మేను తడిపితే...
ఊహలకు రెక్కలొచ్చి...హృది స్పందనల
జడివాన కురిపిస్తుంది..అదే కవిత్వమా!!
ఆకులు రాలుతున్న వేళ...రాలినచోట
కొత్త చివుళ్ళు తొంగి చూస్తున్న వేళ...
భావనల పరంపర ముంచెత్తే క్షణాన...
మెరిసే అక్షరమాల కవితాకుసుమమా..!!
కలతల కన్నీళ్లు..ఆనందబాష్పాలు..
కడలి కెరటాలై కాగితాల్ని తడిపేస్తూ...
అక్షరరూపం దాలిస్తే..!
హృదయాన్ని మెలిపెడుతూ..ఒకసారి...
మోదం కురిపిస్తూ మరోసారి...
చెలరేగే భావనలు సజీవంగా
ముందు నిలిస్తే..!! అది కవిత్వమా..!!
ఆ హృదయస్పందనే కవితాహృదయమా..!!
~ యం. ధరిత్రీ దేవి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 నేడు ప్రపంచ కవితా దినోత్సవం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment