~ యం. ధరిత్రీ దేవి
ఉంటే..ఏడీ..ఎక్కడ ??
భగభగ మండుతూ భూగోళమంతా వెలుగులు విరజిమ్ముతూ..జీవకోటికి జవసత్వాలిస్తున్న
భానుడు కాడా..కనిపించే భగవానుడు...!🙏
రేయంతా వెండి వెన్నెల కురిపిస్తూ చల్లచల్లగా
జనాల్ని సేదదీరుస్తూ..హాయిగొలిపే
నిండు చందురుడు కాడా..కనిపించే దేవుడు !!🙏
గుండె గదులకు ఊపిరులూదుతూ
నిత్యం..ప్రతి నిత్యం శ్వాసలో శ్వాసగా నిలుస్తూ
చుట్టూ ఆవరించి ఉన్న ఈ గాలి
కాదా...కనిపించే దేవుడు !!🙏
బీడును చిరుజల్లుతో సస్యశ్యామలం చేస్తూ...
జలధారలతో కరుణించే వరుణుడు
కాడా...కనిపించే దేవుడు !! 🙏
ఆరుగాలం శ్రమించే రైతన్న..మట్టి పిసుక్కునే
ఆ మనిషే లేకుంటే..మనిషికి మెతుకన్నదే లేదు కదా!
ఆ మట్టిమనిషి 'దేవుడు' కాక మరేమిటి ?? 🙏
దేశక్షేమం కోసం స్వార్ధం వీడి సరిహద్దుల నిలిచి
నిద్ర మరిచి మనల్ని నిద్రబుచ్చుతూ
తమ ప్రాణాలడ్డువేస్తూ కాపుగాస్తున్న
మన వీరసైనికులు కారా..కనిపించే దేవుళ్ళు!!🙏
యావత్ప్రపంచాన్ని గడగడలాడించిన 'కరోనా' రక్కసికెదురొడ్డి పోరాడి నమ్ముకున్నవాళ్ళను
కంటికి రెప్పలా కాచుకున్న వైద్యనారాయణులు...🙏
సవాల్ విసిరిన మహమ్మారిని మట్టుబెట్టే మందుకోసం...మానవాళి మనుగడ కోసం
రేయింబవళ్ళు తపించిన మన శాస్త్రజ్ఞులు 🙏.
వీరంతా...కారా కనిపించే దేవుళ్ళు...!!
కిరీటం దాల్చి.. నాలుగు చేతులు.. శంఖుచక్రాలతో
పట్టుపీతాంబరాలతో ధగధగా మెరుస్తూ దర్శనమిస్తేనే దేవుడా! చూసే కళ్ళకు 'హృదయమే' ఉంటే...ఆపదలో చేయందించే ప్రతి మనిషీ
కనిపించే దేవుడే !! ప్రతీ మంచి మనసూ భగవత్స్వరూపమే !! కనిపించే ప్రత్యక్షదైవమే!!🙏
No comments:
Post a Comment