Sunday, February 21, 2021

అమ్మ భాష

'అమ్మ' అన్న మాటే మధురం కాదా 
అమ్మ మనసు అమృతం కాదా !
అమ్మ ప్రేమ అపురూపం అయినప్పుడు 
అమ్మ భాష మరింత ప్రియం కాదా !

ఉగ్గు పాలతో రంగరించి పోసేది 
ఏ శిక్షణ అవసరం లేనిది 
పుట్టుక తోనే సంక్రమించేది 
మాతృభాష కాక మరేది? 

పరభాష తో వద్దు శత్రుత్వం 
ప్రతీ భాషకూ ఇద్దాం గౌరవం 

కానీ --
మాతృభాషకే అగ్ర తాంబూలం !ఇది నిజం !
అది మరచిననాడు మనుగడ శూన్యం !
అవగాహనే అన్నింటికీ మూలం 
అమ్మ భాషతోనే అది సాధ్యం 
భాషేదైనా సరే ప్రతీవారూ 
ప్రేమించాలి సొంతభాషను 
అమ్మ ఎవరికైనా 'అమ్మే' కదా మరి !!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
            నేడు [ 21.02.2021] 
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం 
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  ****************************
        *  భువి భావనలు * 
  *********************************
 

Thursday, February 11, 2021

మనిషి

ఆధునిక  సాంకేతికతకు 
అభివాదం 🙏
అది సమకూర్చిన 
సౌకర్యాలెన్నో !
అందించిన 
ఉపకరణాలెన్నెన్నో !
అధిరోహించిన 
శిఖరాలు మరెన్నో !
కానీ -- అదంతా 
మానవ సృష్టియే కదా ! 
మరి --
మనిషిని మించిన 
యంత్రమున్నదా? 
మనిషి చేయిని మించిన 
ఉపకరణమున్నదా? 
మనిషి మేధస్సుకు సరిసాటి 
మరేదైన ఇలపై ఉన్నదా? 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
               భువి భావనలు 
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Monday, February 1, 2021

దేవుడెక్కడ?


దేవుడెక్కడ?  అసలున్నాడా? 
గుళ్ళూ గోపురాలు తిరిగాను
 పుణ్యక్షేత్రాలెన్నో దర్శించాను
 పండితులను ప్రశ్నించాను
 పామరులతో ముచ్చటించాను 
 ఆస్తికులందర్నీ ఆశగా చూశాను
 ఎక్కడా జవాబు లేదు
 ఇంతకీ --
 దేవుడెక్కడ? అసలున్నాడా? 
 కడకు,
 ఇంటి దారి పట్టాను విసిగి వేసారి
 ఆగుతూ ఆగుతూ సాగుతూ 
 చూశాను అటూ ఇటూ ఓసారి
 బీటలు వారిన భూమి!
 పైనేమో మబ్బులు కమ్మిన ఆకాశం!
 ఉన్నట్టుండి  రాలిందో చల్లటి చినుకు!
 చూస్తూనే ఉన్నా.... 
 చిరుజల్లు కాస్తా అయింది జడివాన!
 పులకించిపోయింది పుడమి తల్లి! 
 ఆపై --
 రోజుల వ్యవధిలో నేలతల్లి ఒడిని
 చిన్ని చిన్ని మొలకలు! బీడు కాస్తా 
 అయింది నేడు సస్యశ్యామలం!
 అంతే! ఎన్నో ఏళ్ల నా నిరీక్షణ
 ఫలించెనో ఏమో ! అయ్యాడు ప్రత్యక్షం
 హఠాత్తుగా నా ముందు' దేవుడు' 
' వానదేవుడు' !
 గాలికి తలలూపుతూ నులివెచ్చని
 సూర్యకిరణాల స్పర్శ అనుభవిస్తూ
 పచ్చ పచ్చగా దర్శనమిస్తూ పంట పొలాలు!
 ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు మరో' దేవుడు'
' సూర్య భగవానుడు' !
 అదిగో! కోతకొచ్చాయి పండిన పంటలు!
 రైతన్న కళ్ళలో కోటి కాంతులు!
 ఆరుగాలం శ్రమకు అందిన ఫలం!
 కళ్లెదురుగా నిండైన ధాన్య రాశులు! 
 మళ్లీ ప్రత్యక్షం!
' అన్నదాత' గా మరో' దేవుడు'!
 కనిపించే దేవుడు!
 మట్టి పిసుక్కునే ఆ మనిషే లేకుంటే
 మనిషికి మెతుకన్నదే లేదు కదా !
 మరి --
 ఆ మట్టి మనిషి' దేవుడు'
 కాక మరేమిటి ? 
 కరిగాయి కంటిపొరలు!
 విడివడ్డాయి సందేహాలు
 గర్భగుడిలో లేడు దేవుడు
 అంతటా ఉన్నాడు 
 నా చుట్టూ నన్నావరించి 
 ఆపదలో నన్నాదుకునే ప్రతీ మనిషిలో 
 పొరుగువాడికి సాయమందించే 
 క్షణాన స్వయానా నాలో
 నిండి ఉండేది దర్శనమిచ్చేదీ 
 దైవత్వమే !
 నా లోనే కొలువై ఉన్న' దేవుణ్ణి' 
 గుర్తించ జాలక ఎక్కడెక్కడో తిరిగిన
 నా అజ్ఞానం పటాపంచలై
 అయ్యిందొక్కసారిగా జ్ఞానోదయం !!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                🌺 భువి భావనలు 🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏