Sunday, November 10, 2024

కొత్తదారి... చిన్న కథ

 [ 'వనితాజ్యోతి' మాసపత్రికలో ప్రచురింపబడ్డ నా రచన ]

" పెళ్ళై ఇన్నాళ్లవుతోంది, ఓ అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అయినా ఎవర్ననుకుని ఏం లాభం? మా అదృష్టాలిలా తగలడ్డప్పుడు... "

ఆ ఉదయం రుసరుసలతో మొదలైన వర్ధనమ్మ వ్యాఖ్యానం మిట్ట మధ్యాహ్నం అయేసరికి తారస్థాయినందుకుంది.ఆ ఇంట్లో అందరి ప్రాణాలూ ఆమె వాగ్దాటిని ఆలకించటమే తప్ప ఎదుర్కోవటానికి సాహసించనివి.

   అలాంటి లోగిట్లోకి దాదాపు సంవత్సరం క్రితం విరిసిన గులాబీ లాంటి వాసంతి వచ్చిపడింది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగో ఆడపిల్లగా ఓ పేద ఇంట్లో పుట్టిన ఆ పిల్లకు సర్దుబాటు అన్నది వెన్నతో పెట్టిన విద్యే. ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండీ అడుగడుగునా అన్నింటికీ సర్దుకుపోతూనే ఉంది. వారసత్వంగా పుట్టింటి నుంచి సంక్రమించిన దరిద్రంతోపాటు సంస్కారమనే అమూల్యమైన ఆస్తి కూడా ఆమెతో బాటే వెన్నంటి ఉంది. అందుకనే అణకువతో అన్నీ భరిస్తూ వస్తోంది. అయినా ఆమెకు అర్థం కానిది ఒక్కటే... ఆ ఇంట్లో మగవాళ్ళంతా ఎందుకిలా  నోట్లో నాలుక లేని వాళ్ళలా ఉంటారు?! ఒక ఆడ మనిషి అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే వీళ్లంతా ఎందుకలా మౌనవ్రతం దాలుస్తారు !?

    చిలికి చిలికి గాలి వానగా మారి, ఆ రాత్రి భోజనాల వద్ద అత్తగారి నోటి నుండి మాటల తూటాలు ఎక్కుపెట్టిన విల్లు నుండి వదిలిన బాణాల్లా వచ్చి వాసంతి గుండెలు తూట్లు పొడిచాయి.

" ఇదిగోరా, నీవిలా దేభ్యంలా ఉండటం నేను చూడలేను. ఈ ఇంట్లో అంతా సంపాదించే వారే... నీవు తప్ప.. నీకు ఉద్యోగం దొరికేదెన్నడో ఏం పాడో.. నిన్ను సరే తప్పదు, నీ పెళ్ళాన్ని కూడా సాకాలంటే  కుదిరే పని కాదు. ముష్టి కట్నం ముక్కుతూ,మూల్గుతూ  ఇదిలించడానికి నీలిగారు. కనీసం ఉద్యోగానికి కావాల్సిన పైకమన్నా తెమ్మని దాన్ని పుట్టింటికి తోలడమో, లేక తన్ని తగలెయ్యడమో... ఏదో ఒకటి తేల్చేయ్... "

 తలవంచుకుని భోంచేస్తున్న భర్త శంకర్ ను తలుపు చాటు నుండి కళ్ళెత్తి చూసింది వాసంతి. దించుకున్న అతని మొహంలో భావాలేవీ ఆమె చదవలేకపోయింది. అతనితో పాటు భోంచేస్తున్న తండ్రి, అతని ఇద్దరు అన్నలు, తమ్ముడు ఇదేం పట్టించుకోవాల్సిన విషయం కానట్లు యధాలాపంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. వంటింట్లో పాత్రలు సర్దుతున్న తోడికోడళ్ళు  " ఇదేం మాకు కొత్తా..!" అన్నట్లు నర్మగర్భంగా ఒకరిపై ఒకరు చూపులు గుప్పించుకున్నారు. వీటన్నింటికీ అతీతంగా వర్ధనమ్మ వాగ్ధాటి కొనసాగుతూనే ఉంది.

                        ***          ***          ***

   గదిలో భర్త అడుగుల చప్పుడు గ్రహించిన వాసంతి గుండె చిక్కబట్టుకొని మరింత బిగదీసుకుని పడుకుంది.జరగబోయే పరిణామం ఎలాంటిదైనా సరే... ఎదుర్కోవడానికి ఆమె మానసికంగా ఎప్పుడో సిద్ధపడేఉంది.

" వాసంతీ, "

 ఆ పిలుపులోని ఆర్ద్రత ఆమెకు కొత్తగా అనిపించింది.

" నా ప్రవర్తన నీకు బాధాకరంగా ఉందని తెలుసు. కానీ నేను నిస్సహాయుణ్ణి. అన్నలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నాకా... చదువు పూర్తయి  ఇనేళ్ళయినా ఏ చిన్న పనీ దొరకడం లేదు. మా అమ్మకు మేము ఎవరము ఎదురు చెప్పలేము.  అట్టడుక్కుపోయిన సంసారాన్ని ఆమె తన రెక్కల కష్టంతో ఇంత ఎదిగేలా చేసింది. కొడుకులే ఆమె లోకంగా వాళ్ళ చుట్టూ ఎన్నో ఆశల్ని అల్లుకుంది.  ఫలితం! వాళ్ల మీద తనకు తప్ప మరెవ్వరికీ హక్కు ఉండరాదన్న భావం ఆమెలో పాతుకుపోయింది..." 

 మౌనంగా వింటున్న వాసంతితో చెప్పుకుంటూ పోతున్నాడు శంకర్.

"...మా అమ్మకు నేను అడ్డు చెప్పలేను... అలా అని ఆమె చర్యల్ని హర్షించనూలేను. ఈ ఇంట్లో నేను నీకు ఏ న్యాయం చేకూర్చలేను..."

 భర్త అంతరంగం ఏమిటో అర్థం కాక, బేలగా అతని కళ్ళలోకి చూసింది  వాసంతి. ఆ కళ్ళల్లో బెదురు చూసిన అతను ఆమెను దగ్గరకు తీసుకుంటూ,

"... కానీ, ఎవరికీ ఏ బాధ లేని మార్గం ఒకటి చెప్తాను. నీవు రేపే నీ పుట్టింటికి వెళ్ళు. అక్కడే ఉండి ఫైనల్ ఇయర్ తో ఆగిపోయిన నీ డిగ్రీ చదువు పూర్తి చెయ్. ఇక్కడ నుండి డబ్బు తెమ్మన్నారని మీ వాళ్ళతో నీవు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కూడా వచ్చి నేను దిగబెడతాను. అదీ మా అమ్మకు తెలియకుండానే... నీవు డిగ్రీ పూర్తి చేసే లోగా నాకు ఏదైనా ఉద్యోగం దొరక్కపోదు. అంతవరకూ ఓపిక పట్టలేవా...!"

 కరడుగట్టి పోయిందనుకున్న అతని మనసులో ఇంతటి ఆర్ద్రత, అంతులేని లోతైన ఆలోచన దాగి ఉన్నాయని ఆమెకాక్షణంలోనే తెలిసింది.ఆ సంభ్రమం నుండి తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది వాసంతికి. భార్య భుజం మీద చేయి వేస్తూ కొనసాగించాడు శంకర్.

"... అటు కన్నతల్లినీ, ఇటు కట్టుకున్న భార్యనూ బాధ పెట్టడం ఇష్టం లేక మధ్యలో నలిగి పోతున్న నన్ను అర్థం చేసుకుంటావనే ఇన్నాళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి, వాసంతీ, అంతదాకా నాకోసం సహనంతో వేచిఉండలేవా?"

ఆమెను కుదుపుతూ అడిగాడు కళ్ళలోకి చూస్తూ.

"మీ అండ నాకుంటే అంతదాకా ఏమిటి, ఈ జన్మంతా వేచి ఉండమన్నా ఉంటాను..."

 సంతోషం పట్టలేక, కన్నీళ్లు ధారగా కారుతుండగా భర్తను రెండు చేతులతోనూ చుట్టేసింది వాసంతి. ఆ సమయంలో ఆమెకు అతనో సరికొత్త దారిలో పయనిస్తూ గమ్యం వైపు సాగిపోతున్న బాటసారిలా గోచరించాడు...

******************🥀🥀🥀****************

14 comments:

  1. హేవిటి మేడమ్? విద్యాధికులైన మీరు, బాధ్యతాయుతమైన ఉద్యోగం చేసిన మీరు కూడా ఇటువంటి కథ వ్రాయడమేమిటి? కథ యొక్క పునాదే సరిగా లేదని నా అభిప్రాయం. ఉద్యోగం లేనివాడు పెళ్ళి చేసుకోవడమేమిటి? ఆ అమ్మాయి తండ్రి పిల్లనివ్వడమేమిటి? పైగా కట్నం కూడానూ. అసమంజసంగా ఉందని చెప్పక తప్పదు.

    ReplyDelete
    Replies
    1. నలుగురు ఆడపిల్లలున్న తండ్రి కూతురికి పెళ్లి అయితే చాలు అనుకునే కుటుంబాలున్న సమాజం మనది. ఆర్థిక పరిస్థితి బాగోలేక రెండో పెళ్లి వాడైనా, మూడో పెళ్లి వాడైనా.. అంతో ఇంతో ముట్టజెప్పి ఆడపిల్ల భారం దించుకునే వాళ్ళను చూస్తూనే ఉన్నాము.కాదంటారా. కథలో వాసంతి పరిస్థితి అదే

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. చాలా బావుంది కథ.

    ఏ ఒక్కరినీ కించ పరక తల్లి యెందుకలా‌ వుందో చెబుతూ, తన ప్రస్తుత సమస్యకు పరిష్కారం కనుక్కుంటూ , భార్యను భరించ లేని తన ప్రస్తుత అసహాయత మార్పు చెందేదానికి ఆస్కారముందన్న నమ్మకంతో , మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వాసంతి చదువు పూర్తి చేసుకోవటానికి వెసులుబాటు చేసుకుంటూ_ అన్నిటికీ కాలం పరిష్కారం తప్పకుండా చూపుతుందన్న ఆశాజనకమైన అంశాన్ని ప్రస్తావిస్తూ సాగిన చిన్నకథైనా అద్భుతమైన కథ.


    జోహార్లు.







    ReplyDelete
    Replies
    1. “జిలేబి” గారు,
      అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా.

      Delete
    2. ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగో ఆడపిల్లగా ఓ పేద ఇంట్లో పుట్టిన ఆ పిల్లకు
      అడుసైనా అందలమే నండీ వినరా వారు

      ఇలాంటివి మీ లాంటి ధనవంతులకు తెలిసే అవకాశాలు తక్కువే సుమీ


      Delete
    3. అడుసు తొక్కింది ఆ పిల్ల మొగుడు …. అని నా భావం.

      Delete
    4. మగవారి సైడు నుండే ఎప్పుడూ థాట్సా!
      ఎమ్....

      కొంత ఆడవారి గురించి ఆలో చించండి స్వామీ

      Delete
    5. I think what Rao sir's point is, when he doesn't have a job, he shouldn't have married.

      Delete
    6. చాలా చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలు సర్

      Delete
  4. Agreed. Nice story except for the following line -
    "మీ అండ నాకుంటే అంతదాకా ఏమిటి, ఈ జన్మంతా వేచి ఉండమన్నా ఉంటాను..."
    dramatic or cinematic, reminded me of some old movie dialogues :)

    ReplyDelete
    Replies
    1. సినిమాకైనా, కథ కైనా ఆశావహ దృక్పథంతో కూడిన ముగింపు ఉంటే బాగుంటుంది కదా సర్ 🙂

      Delete