Monday, December 16, 2024

ఒక్క క్షణం ఆగండి.. ఆలోచించండి...

 😪

<><><><><><><><><><><><><><><><><><>>

 *  ప్రేమ విఫలమై ప్రేమికులిద్దరూ రైలు పట్టాలపై ఆత్మహత్య!

 * అమ్మాయి తన ప్రేమనంగీకరించలేదని వ్యధతో పురుగుమందు తాగిన యువకుడు!

* పదవ తరగతి పరీక్షలో ఒక సబ్జెక్టు తప్పినందుకు అవమాన భారం భరించలేక  అమ్మాయి ఉరేసుకుని  ప్రాణం తీసుకున్న వైనం..!

* ఉద్యోగ వేటలో విసిగిపోయి ఒకరు , ప్రేమ పెళ్లి విఫలమై ఒకరు,తండ్రి మందలించాడని మరొకరు!!...

 ఇలా రకరకాల కారణాలతో నిండు జీవితాల్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్న యువత గురించి ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదువుతున్నాం... టీవీల్లోనూ చూస్తూ ఉన్నాం...ఇలాంటి ఉదంతాల్ని వింటున్నప్పుడు...మనసంతా కాసేపు బాధతో నిండిపోతూ ఉంటుంది. ఈ మధ్య మరీ చిన్న పిల్లలు...అంటే మూడు, నాలుగు తరగతులు చదువుతున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి. సెల్ ఫోన్ ఎక్కువగా చూడొద్దు  అన్నందుకు ఓ పిల్లవాడు తండ్రి మీద అలిగి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడట!!

  గర్భస్థ శిశువుగా ఉన్ననాటి నుండి మొదలైన తల్లి కలలు ఆ బిడ్డ తన ఒడి చేరిన క్షణం నుండీ అలా కొనసాగుతూనే ఉంటాయి. బిడ్డ బాల్యం, అల్లరి, వారి చదువు సంధ్యలు, క్రమక్రమంగా వారు ఎదిగే తీరు, వారి ముద్దు మురిపాలు...ఓహ్! తల్లిదండ్రులు వారి చుట్టూ అల్లుకునే ఆశల పందిరి వర్ణించడానికి మాటలు చాలవు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో.. అలా నిర్మితమవుతున్న వారి స్వప్న సౌధం కళ్ళముందు సాక్షాత్కరించే తరుణం ఆసన్నమవుతున్న క్షణాల్లో ఒక్కసారిగా భయంకరమైన కుదుపు..!! వారి కలలపంట, ఆశాజ్యోతి.. కొడుకు గానీయండి.. కూతురు గానీయండి... కళ్ళముందు హఠాత్తుగా నిర్జీవమై ఓ శవంగా వారి ముందు పడి గుండెల్ని పిండివేస్తే ఆ కోలుకోలేని దెబ్బ నుండి తేరుకోవడం జన్మలో వారి తరమా!!

   కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రమైనదే కావచ్చు.. కానీ అది తాత్కాలికమైనదే అని గ్రహించలేని విజ్ఞత వారిలో లోపించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్కోసారి కాస్త సహనం వహిస్తే సమస్య దానంతకదే  పరిష్కారమవుతూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. అప్పటికప్పుడు పరిష్కారం దొరకని సమస్యల్ని గురించి కొంతకాలం ఆలోచించకపోవడం మంచిది. కాలం అన్ని గాయాల్ని, ఇంకా చెప్పాలంటే ఎలాంటి గాయాలనయినా మానేలా చేస్తుంది అంటారు కదా... అలాగే ఈరోజు భయంకరంగా తోచిన గడ్డు సమస్య కొద్ది రోజుల వ్యవధిలోనే దూదిపింజలా తేలిపోవచ్చు. అంత ఆందోళన పడింది దీని కోసమా అని కూడా అనిపిస్తుంది. ఆమాత్రం దానికి భగవంతుడిచ్చిన అపురూపమైన ఈ బ్రతుకుని తాత్కాలిక సమస్య కోసమని  శాశ్వతంగా ముగింపజేయడం సమంజసమా!!?

     పరీక్ష ఫెయిల్ అయితే మళ్లీ రాసి పాస్ అవ్వచ్చు. ఉద్యోగం ప్రయత్నం మీద ఏదో ఒక రోజు రాకపోదు. ఒకవేళ రాకపోయినా, బ్రతికి తీరాలి అనుకుంటే బ్రతుకుతెరువుకు బోలెడు మార్గాలు.. 

   ప్రేమ విఫలమైతే  అదే జీవితమా...చెప్పండి,! తల్లిదండ్రులతో పాతికేళ్ళు పెనవేసుకున్న బంధం ముందు కొద్దిరోజుల ప్రేమ బంధం విలువ ఎంత!? మీ మీదే  అన్ని ఆశలూ పెట్టుకున్న ఆ అమాయక ప్రాణుల గురించి క్షణమైనా ఆలోచించాల్సిన అవసరం పిల్లలకు ఉండాలా లేదా!!

  చావడం పిరికితనం కాదు. ఎంతో ధైర్యం కావాలంటూ ఉంటారు. సరే, ఆ ధైర్యమేదో బ్రతకడానికే తెచ్చుకోండి. ఏమైనా, ఒక్క విషయం.. ఈ బలహీన మనస్కులంతా గుర్తుంచుకోవాలి. చచ్చి సాధించేది ఏమీ లేదు. బ్రతికే సాధించుకోవాలన్న నగ్న సత్యం... జీవితం కాస్తా ముగిసిపోయాక ఇక చేసేదేముంది!!? తల్లిదండ్రులకు జీవితకాలం  భరించలేని వేదన తప్ప !!

   ఇలాంటి సున్నిత మనస్కులు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తీవ్రతరమైనప్పుడు.. ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం...ఆగిపోయి...ఆలోచించడం అన్నివిధాలా శ్రేయస్కరం.ఆ సమయంలో వారికి,

         " గతంలో మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు, పొందిన ప్రశంసలు, మీ ఆశలూ, ఆశయాలు... మననం చేసుకోండి. మీపై మీకు నమ్మకం కలగకపోదు. అంతకుమించి.. మిమ్మల్ని కన్న అమ్మానాన్నల గురించి... మీరు లేకుండా పోయాక వారి పరిస్థితి ఏమిటి? ఒక్కసారి..మీ నిర్జీవ దేహంపై పడి గుండెలవిసేలా వారు రోదిస్తున్న దృశ్యం ఊహించుకోండి..చాలు..ఎన్నటికీ..మరెప్పటికీ ఆ తలంపే మీ ఊహల్లోకి రాదు. అదే మిమ్మల్ని మీ కర్తవ్యం దిశగా నడిపించేలా చేస్తుంది..."

అని చెప్పాలనిపిస్తోంది.

  బాల బాలికలు, యువతీ యువకులే కాదు వయసుతో నిమిత్తం లేకుండా ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న ప్రతీవారు బ్రతుకుపై తీపినీ, రేపటి పై ఆశను  పెంచుకుంటే సమస్యల్ని తేలిగ్గా అధిగమించే మానసికస్థైర్యం వచ్చి తీరుతుంది.

  అందుకే..అందుకే...అలాంటివారందరికీ విజ్ఞులిచ్చే సలహా...

" క్షణికావేశం వద్దు..కాస్త ఆగండి.. ఆలోచించండి."

<><><><><><><><><><><><><><><><><><>>

                          యం. ధరిత్రీ దేవి 

<><><><><><><><><><><><><><><><><><>>

   

No comments:

Post a Comment