Sunday, February 18, 2024

తనదాకా వస్తేగానీ..... ( కథ )

     మధ్యాహ్నం భోంచేసి, వంటిల్లు సర్దేసుకుని ఉస్సురంటూ అలా వెళ్లి నడుం వాల్చింది రాగిణి. భర్త గిరిబాబు, పాప, బాబు ఉదయం క్యారేజీలు తీసుకునే వెళ్తారు. సాయంత్రానిగ్గానీ తిరిగి రారు. పడుకుని కాస్త రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకున్న రాగిణి.. గేటు చప్పుడై విసుగ్గా లేచింది. 
రాఘవమ్మ ! ఇంటి ఓనరు. ఈసారి మూడింటికే దిగిందేమిటీవిడ ! అనుకుంటూ ముఖాన నవ్వు పులుముకుంటూ, 
" రండి రండి.. "
అంటూ ఆహ్వానించింది. ఆవిడో రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్. తప్పులెంచడం నా జన్మహక్కు అన్నట్లుంటుంది ఆవిడ వాలకం ! ప్రతి నెలా రెండో తారీఖు ఇంటి అద్దె కోసం స్వయానా తనే  వస్తుంది. 
" మీకెందుకండీ శ్రమ ! నేనే తెచ్చిస్తాను గదా, "
అని గిరిబాబు మొదటి నెలే అన్నాడు... కానీ ఆవిడ, 
" అయ్యో పర్వాలేదండి.. ఈ పక్క వీధిలోనే మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు. నెలకోసారి వాళ్లనీ చూసినట్టు ఉంటుంది... "
అనేసింది. కానీ కొద్ది నెలలకే ఆవిడ ఆంతర్యం అవగతమైపోయింది గిరిబాబు దంపతులకు... అద్దె వసూలు చేసుకునే నెపంతో,  ఇల్లు ఎలా ఉంచుకుంటున్నారో చూడాలన్న  ఆదుర్దాతోనే ఆవిడ వస్తోందని !
    వచ్చినప్పుడల్లా ఇల్లంతా ఓ సారి కలయదిరుగుతుంది. ఏదో ఒకటి పట్టేస్తుంది. 
" గోడ మీద ఈ  గీతలేంటి రాగిణి గారూ ! పిల్లలకు కాస్త చెప్పుకోరాదూ... !" 
అని ఓ సలహా పారేస్తుంది. 
" పనిమనిషిని పెట్టుకోలేదా? "
అంటూ పైన వేలాడుతున్న బూజులు చూస్తుంది. అలా ఏదోఒకటి అనకుండా బయట అడుగు పెట్టదు. ఈసారి ఏం లాగుతుందో... అనుకుంటూ ఆవిణ్ణి కూర్చోమని చెప్పి, టీ తెస్తానంటూ లోపలికెళ్ళింది రాగిణి. పది నిమిషాల తర్వాత అద్దె  డబ్బు పుచ్చుకుని బయలుదేరింది రాఘవమ్మ. 
" అమ్మయ్య! ఈరోజు ఈవిడ కంట ఏదీ పడలేదు... "
నిట్టూర్పు విడవబోయింది రాగిణి. అంతలోనే... 
" అయ్యో.. అయ్యో.. పెయింట్ కొట్టించి సంవత్సరం తిరగలేదు. అప్పుడే గేటు ఇలా తయారయిందేంటి !ఎంతలా గీసుకుపోయిందో చూడు... !"
రాగిణి వైపు అదోలా చూస్తూ అంది. ఏమనాలో తోచక వెర్రి నవ్వు నవ్వింది రాగిణి. విసుగ్గా మొగం  పెట్టి వెళ్ళిపోయిందావిడ. అలసట రెట్టింపై నీరసం కమ్ముకొచ్చింది రాగిణికి. 
                     **          **          **
  " ఏమిటే, బాబూ.. ఈ పన్నెండేళ్లలో ఆరు ఇళ్లు మారాము. నీళ్లు సరిగా రావంటూ ఒకటి ! పిల్లలకు బడి దూరమని ఒకటి ! ఇరుగుపొరుగు బాగా లేరంటూ మరొకటి! అసలు ఓనర్సే మంచి వాళ్లు కాదని ఇంకొకటి ! ఎన్నని  మారతాము? ఎలాగోలా సర్దుకుపోవాలి గానీ.... "
అసహనంగా అన్నాడు గిరిబాబు ఆ రాత్రి భార్య చెప్పిందంతా విని.
" అది  కాదండీ, వచ్చినప్పుడంతా ఆవిడ నసుగుడు, అనుమానం చూపులూ... మరీ అతి అనిపిస్తోంది.."
".. పక్కనే ఉంటే ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటారనే కదా... ఓనరు ఎక్కడో దూరంగా ఉండే ఇల్లని దీంట్లో చేరాము..!"
".. అవునండీ.. కానీ దూరంగా ఉన్నదన్న మాటే గానీ... పక్కనున్న వాళ్ళకంటే ఎక్కువ చేస్తోందండీ ఈవిడ !"
రెండు మూడు సార్లు గిరిబాబున్నప్పుడు  కూడావచ్చింది రాఘవమ్మ. ఆమె తీరు అతనికీ నచ్చడం లేదు. కానీ ఏం చేయగలడు  ! మధ్యతరగతి జీవి! సొంతిల్లు అన్నది  వాళ్ళకి గగన కుసుమమే ! తప్పదు. నెట్టుకు రావాలి ఎలాగోలా.. భార్యకు సర్ది చెప్పాడు.. కొంతకాలం ఓపిక పట్టమని !
               **            **           **
   పదేళ్ళు గడిచిపోయాయి. ఆరోజు  గిరిబాబు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న ప్రమోషన్ వచ్చేసింది అతనికి UDC గా .ఆర్డర్ కాగితాలు పదేపదే చూసుకుంటూ సంబరపడిపోయాడు తన కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు! వెంటనే అతనికి మరో కల గుర్తొచ్చింది.అదే ! సొంతింటి కల ! ఇప్పుడు జీతం పెరుగుతుంది.. లోన్ కు అప్లై చేయాలి. ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఉండనే ఉంటుంది. ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవడమో, కొనడమో చేయాలి... భార్య గుర్తొచ్చి, 
" పాపం,  పిచ్చిది ! ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తూ ఉందో కదా సొంతింటి కోసం! "
అనుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాడు.
                  **          **             **
   మరుసటి రోజు నుండే తన ఆలోచన అమల్లో పెట్టడం మొదలెట్టాడు.  ఆఫీసులో కొలీగ్స్ నీ, తెలిసినవాళ్లనీ సంప్రదించాడు. కట్టించడం అంటే రిస్క్ తో  కూడిన పని. ఆల్రెడీ కట్టినది తీసుకోవడం బెటర్ అని చాలామంది అభిప్రాయం వెలిబుచ్చారు. ఓ రోజు కొలీగ్ భాస్కర్ ద్వారా ఓ ఇంటి గురించి తెలిసింది. మరుసటి రోజు అతన్ని  వెంట పెట్టుకుని, రాగిణిని కూడా తీసుకుని వెళ్లి చూశాడు. రెండు పోర్షన్ల ఇల్లు ! బాగానే ఉంది. కట్టి రెండు  సంవత్సరాలే అయిందట! లొకాలిటీ కూడా పరవాలేదు. పిల్లలు కాలేజీ చదువులకొచ్చారుగాబట్టి... తనకూ వాళ్లకూ కాస్త దూరం అనిపించినా తిరగ్గలరు. రాగిణికి కూడా తెగ నచ్చేసింది. భాస్కర్ కూడా వంత పాడాడు. ధర కూడా వారికి అందుబాటులోనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని, ఓనర్ ను కలిసి... ముగ్గురూ బేరసారాలు జరిపి చెప్పిన దానికంటే ఓ ఐదు లక్షలు తగ్గించుచేసుకుని... మరో వారానికంతా రాతకోతలు పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది! గృహం గిరిబాబు దంపతుల సొంతమై స్వగృహం యజమానులై పోయారు. మరో నెలకంతా... గృహప్రవేశం.. పాలు పొంగించడం...అన్నీ పూర్తయిపోయి, ఒక పోర్షన్ లో చేరిపోయారు. ఆరోజు రాత్రి మొదటిసారిగా సొంతింట్లో  నిద్రిస్తూ, 
" అమ్మయ్య ! ఇంతకాలానికి మన సొంతింటి కల నెరవేరింది"
అనుకుని సంతోష పడిపోయింది రాగిణి . అసలు కష్టాలు స్వాగతం పలకబోతున్నాయని ఎరగని ఆ ఇల్లాలు  ఆదమరచి నిద్రపోయింది ప్రశాంతంగా..
                 **               **             **
      టులెట్ బోర్డు చూసి, అద్దె  ఇంటి కోసం అడగడం మొదలైంది  . కానీ,  కాస్త ఆలస్యమైనా.. సరైన వాళ్ళకి ఇచ్చుకోవాలని చూస్తున్నారిద్దరూ. ఓ నెలకంతా ఓ ఫ్యామిలీ దిగిపోయింది. భార్య,  భర్త, ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు.. ఓకే అనుకున్నారు.
  ఓ నెల గడిచింది. బయట శుభ్రం చేసుకోవడం, నీళ్లు జల్లి ముగ్గులు పెట్టుకోవడం.. పర్వాలేదు, పద్ధతిగానే ఉన్నారు.. అనుకుంది  రాగిణి. ఆమెకు వాళ్ళు దిగిన పోర్షన్ లోకి వెళ్లి ఒకసారి  చూడాలనిపించినా, ఏమనుకుంటారోనన్న మొహమాటంతో మిన్నకుండి పోయింది. అయినా ఉండబట్టలేక ఓ రోజు పలకరించే నెపంతో లోపల అడుగుపెట్టింది. అలా వెళ్ళిన రాగిణికి... అర్థమైపోయింది.. వాళ్ల శుభ్రత ఏమిటో! హాలంతా చెల్లాచెదురుగా వస్తువులు! ఊడ్చిన కసవు ఓ మూలన అలాగే ఉంది. దాంతోపాటే నిలబడ్డ చీపురుకట్ట ! వంటింట్లో సింకు నిండా అంట్ల  గిన్నెలు.. అది సరే! అందరిళ్లలో దర్శనమిచ్చేదే అని సరిపెట్టుకుని ముందుకెళ్లింది. అక్కడ ఓ మంచం, దానిమీద పడుకుని పెద్దాయన! పక్కనే కూర్చుని ఆయన భార్య! ఆమె చూపులు  పక్కకు తిరిగాయి. అక్కడ గోడలు చూసి ఒక్కసారిగా షాకయింది. తాంబూలం సేవించి, అదంతా ఊసిన ఎర్రటి మరకలు! 
"దేవుడా ! ఏమిటిదంతా!"
 రాగిణి  ముఖకవళికలు గమనించిన ఆమె, 
" ఈయనకి తాంబూలం అలవాటమ్మా, అది  లేకపోతే తోచదాయనకు.. ఏదైనా డబ్బా ఇచ్చినా అది వాడడు.. "
అంది సంజాయిషీగా. 
" ఆయన అలవాటు మాకు గ్రహపాటులా ఉంది"
అని  లోపల అనుకుని, నీరసంగా కదిలింది బయటకు. అద్దె  ఇంట్లో ఉన్నా తానెంత నీట్ గా ఉంచుకునేది! ఆ రాత్రి భర్త తో  విషయం చెబితే. విని  తలాడించాడు, అంతే!
   మొదట్లో సఖ్యంగా ఉన్నవాళ్లు రాను రాను ముభావంగా తయారైపోయారు రాగిణితో.  ఆర్నెల్లు తిరిగేసరికి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని ఎదురు చూడసాగింది రాగిణి. అదృష్టవశాత్తు త్వరలోనే  అతనికి ట్రాన్స్ఫర్ అయి  వెళ్లిపోయారు.టులెట్ బోర్డు మళ్లీ ప్రత్యక్షం!
     ఈసారి ఎలాంటి వారు వస్తారో అన్న బెంగతో ఉంది రాగిణి. అద్దె  తక్కువైనా పర్వాలేదు, ఇల్లు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు దేవుడా అని  కోరుకుంది పదే పదే. నెల రోజులు అయ్యాక మరో జంట దిగింది. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఓ బాబు. చేరేటప్పుడు అన్నీ చూసుకునే ఓకే అన్నారు. కానీ చేరిన  వారం నుండీ అన్నీ ఫిర్యాదులే!
" ఏంటండీ, బెడ్ రూమ్  లో ఫ్యాన్ సరిగా తిరగడం లేదు. బాత్రూంలో నీళ్ళూ అంతే !..."
" టాయిలెట్ సరిగా పనిచేయడం లేదండీ.. రిపేరు చేయించండి."
" గీజర్ లేకపోతే ఎలాగండీ? పెట్టించండి.."
అంటూ ఒకటే నస! రాగిణి  బయట కనిపించినప్పుడల్లా! తల పట్టుకుంది ! మళ్ళీ మొదలైంది లోపల రొద !
" అబ్బ ! వీళ్ళతో మరో రకం బాధ! ఎప్పుడు పోతారో  ఏమిటో! అయినా అద్దె ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది బాబూ, సొంతిల్లు వచ్చాక అన్నీ తిప్పలే !"
              **           **             **
     గిరిబాబు ఓ క్షణం విచిత్రంగా భార్య వైపు చూసి, మరుక్షణం పకపకా నవ్వేశాడు. ఉడుక్కుంది రాగిణి. ఆమె కోపం చూసి,
 " లేకపోతే ఏమిటే, అద్దె ఇంట్లో ఉన్నన్నాళ్లూ.. సొంత ఇల్లు సొంత ఇల్లు అంటూ కలవరించావు. అది కాస్తా  వచ్చాక...అద్దిల్లే బాగుంది అంటున్నావు... "
" అది కాదండీ, మనమిలాగే ఉండేవాళ్ళమా చెప్పండి. ఎంత బాగా చూసుకునేవాళ్ళం ఇంటిని సొంతింటిలాగా!ఓనర్లతో ఎంత మర్యాదగా ఉండేవాళ్ళం!ఇప్పుడున్నవాళ్లయితే... చెప్పానుగా వాళ్ళ ఫిర్యాదులూ,  వగైరాలూ...ఇంతకుముందున్న వాళ్ళూ... ఇల్లంతా పాడుచేసి పోయారు చూస్తూ ఎలా ఉండాలి? "
" ఉండాలి,  తప్పదు. చూడు, మన ఒంట్లో బాగా లేకపోతే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళతాం. మందు వాడతాం. బాగుచేసుకుంటాం. కాస్త ఖర్చవుతుంది.. ఔనా ! అలాగే ఇల్లు కూడా.. ఇప్పుడున్నవాళ్ళు వెళ్ళిపోతే, మరొకరికిచ్చేలోగా పాడయినచోట బాగు చేయించుకుంటే సరి ! దానికీ అంతో ఇంతో ఖర్చవుతుంది.. అంతేగా ! ఆమాత్రం దానికి.. ఎందుకు టెన్షన్ పడుతూ.. ఆలోచిస్తూ.. మనసంతా పాడుచేసుకోవడం ..!"
చిత్రంగా చూసింది భర్త వేపు రాగిణి.
" అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఓనర్ వస్తే.. నువ్వెంత విసుక్కునే దానివి!గుర్తు తెచ్చుకో. ఇప్పుడు వీళ్లూ అంతే అనుకోరాదూ.. తన దాకా వస్తే గానీ ఆ నొప్పి, దాని తీవ్రత తెలియదంటారు  అన్నట్లుంది నీ ధోరణి !"
"................."
"...పోతే, ఇప్పుడున్న వాళ్ళు ఏవైనా కావాలంటే చేయిద్దాం. లేదా వాళ్లనే చేయించుకోమందాం. అద్దె డబ్బుల్లో పట్టుకోమందాం. అంతేగా !"
"... సమస్య ప్రతీ చోటా ఉంటుందే పిచ్చి మొహమా !తమాషా ఏంటంటే... దాని పక్కనే పరిష్కారం కూడా ఉంటూ ఉంటుంది . అదే.. ఇప్పుడు నేను చెప్పినట్టన్నమాట ! అది తెలుసుకోలేక ఒకటే గుంజాటన పడుతుంటాం... "
కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది రాగిణి. 
" అందుకే.. నేచెప్పొచ్చేదేంటంటే.. అటువేపు చూడకు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలెయ్. వాళ్ళు ఖాళీ చేసిన రోజు వెళ్లి.... అంతా తనిఖీ చేసుకుని... అవసరమైన చోట రిపేర్లు చేయించుకుందాం. ఖర్చంటావా !అవుతుంది !భరిద్దాం. ఈ టెన్షన్ తో వచ్చే మనస్తాపం కంటే అది ఎక్కువేమీ కాదులే.. కాబట్టి నా సలహా పాటించి నిశ్చింతగా ఉండు.. "
చెప్పడం ఆపి, సుదీర్ఘంగా నిట్టూర్చి,చిద్విలాసంగా  నవ్వాడు గిరిబాబు. రాగిణి కళ్ళు మెరిశాయి.
" అవును కదా! చిదంబర రహస్యం చిటికెలో ఎంత సూక్ష్మంగా చెప్పేశాడు! పాటించడం కాస్త కష్టమే! కానీ అసాధ్యమయితే కాదు!"
అనుకుంటూ వెళ్లి భర్త పక్కన కూర్చుంది. ఆక్షణంలో గిరిబాబు ఆమెకు జ్ఞాన బోధ చేస్తున్న గౌతమ బుద్ధుడిలా గోచరించాడు. 

******************************************










No comments:

Post a Comment