Friday, March 24, 2023

బఫే భోజనాలు... బాబోయ్.. !

       ప్లేట్ లో రెండు రకాల స్వీట్లు, ఓ బజ్జి , పులిహోర, కొన్ని వడియాలు, దోస, క్యారెట్ ముక్కలు -- ఇలా ఐదారు రకాలు పెట్టించుకుని ఇవతలకొచ్చి, నిలబడి చుట్టూ ఓ సారి చూసింది రేవతి, ఎక్కడైనా ఓ ఖాళీ ఛైర్ కనిపిస్తుందేమో, కాస్త నింపాదిగా కూర్చుని తిందామని! అబ్బే, అసలే అక్కడక్కడా కొన్ని చైర్స్ మాత్రమే వేశారు. ఎక్కువ వేస్తే తిరగడానికి ఇబ్బంది అనేమో ఉన్నవన్నీ పేర్చి, ఓ మూలన సర్దేశారు.  ఉన్న కొన్నింటినీ  కొందరు అప్పటికే ఆక్రమించి తింటున్నారు.హుష్ ! నిట్టూరుస్తూ ఓ పక్కగా నిలబడి, మెల్లిగా తినడం మొదలెట్టింది రేవతి. ఓ వైపు ఎండ, మరోవైపు కాళ్లు లాగుతున్నాయి. దానికి తోడు చేతిలో పళ్లెం మోత! ఈ 'బఫే'  కాదు గానీ, ఓ క్షణం విసుగొచ్చేసింది రేవతికి. ఎప్పుడెప్పుడు ముగించి, పళ్లెం ఆవల పెట్టేసేద్దామా అనిపించిందామెకి. 
     బాగా దగ్గరి చుట్టాలు. పిలిచాక వెళ్లకపోతే బాగుండదు. రాలేనని చెప్పడానికి వెధవ మొహమాటం! పోనీ ఊరికే అటెండ్ అయి వచ్చేద్దామా అనుకుంటే... తినకుండా వచ్చేస్తే బాధ పడతారేమో అని లోపల అదో  గుంజాటన !
      రేవతి రిటైరై అయిదేళ్ళయిపోయింది. ఇంటిపట్టునే ఉండడం అలవాటైపోయి, బద్ధకం పెరిగి, దాంతో పాటు శరీరం కూడా ఇట్టే పెరిగి పోయింది. మునుపున్న చలాకీతనం తగ్గిపోయి, ఆ స్థానంలో మోకాళ్ళనొప్పులు చోటు చేసుకుని ఇదిగో ఇలాంటి సందర్భాల్లో తెగ బాధపెడుతూంటాయి. ఒక్కోసారి వెళ్లడం మానేద్దామని గట్టిగా అనుకుంటుంది, కానీ మళ్ళీ మామూలే ! 
    పక్కింట్లో రిటైర్డ్ టీచర్ పార్వతమ్మ డెబ్భై కి చేరువలో ఉంది. ఇలా ఇంటికెవరైనా వచ్చి, ఫంక్షన్ లంటూ పిలిస్తే... నిర్మొహమాటంగా రాలేనని చెప్పేసి, ఆ వెంటనే వాళ్ళ చేతిలో ఏదో ఒక గిఫ్ట్ గానీ, లేదా ఎంతోకొంత 'ఎమౌంట్ ' పెట్టిన కవర్ గానీ పెట్టేసి ఏమీ అనుకోవద్దని నవ్వేస్తుంది ! 
  "వెళ్లకపోతే ఎలాగండీ, ఏమైనా అనుకోరా..? "
అని ఓసారి తనంటే, 
".. ఏమిటండీ, రేవతి గారూ, మీరు మరీనూ... పిలిచిన చోటికల్లా వెళ్లే వయసా  మనదీ..? అయినా,  మీ పిచ్చి గానీ,  మనం వెళ్లకపోతే ఏమైనా అనుకునేవాళ్లూ, అలిగే  వాళ్లు కూడా ఉంటారుటండీ ? సరే, ఉంటారే అనుకోండి. ఏమాత్రం అర్థం చేసుకోలేని అలాంటి వాళ్లను పట్టించుకోవడం, బుర్ర పాడు చేసుకోవడం మనకు అవసరమంటారా? చెప్పండి..." 
 అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. ఇంకా --
"... అయినా వెళ్లగలిగినంత కాలం వెళ్ళాం. చూసినంత కాలం అన్నీ చూశాం. ఇంకా ఎందుకు చెప్పండి ఈ ప్రయాసలన్నీ మనకు !.."  అనేసింది. 
  పార్వతమ్మ గారి మాటలు విన్న రేవతి, 
" నిజమే సుమీ.. ఇదేదో బాగానే ఉన్నట్టుంది.. ఈసారి నుండి నేను కూడా అలాగే చేయాలి...."
 అనుకుంది స్థిరంగా. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి, షరా మామూలే! ఏం చేస్తుంది?  మెత్తని మనసు! పైగా బంధుప్రీతి కూడా కాస్త ఎక్కువేనాయే ! తయారయిపోతుంది !
    ఆలోచనల్నుండి  బయటపడి, వెళ్లి,  కాస్త అన్నం లో రసం, పెరుగు వేయించుకుని  ఏదో అయిందనిపించి, చేయి కడిగేసుకుంది రేవతి. వినడానికి  విడ్డూరంగా అనిపించొచ్చునేమోగానీ, ఒక్కోసారి సగం కడుపు మాత్రమే నిండి, సాయంత్రం మళ్లీ ఇంట్లో ఏదైనా తిన్న రోజులున్నాయి రేవతికి !
     ఏమిటో ! ఒకప్పుడు పెళ్లి భోజనమంటే ఎంత ఆనందంగా ఉండేది ! ఇప్పుడు 'వద్దురా బాబు' అనిపిస్తోంది రేవతికి.  ఇలాంటి సందర్భాల్లో దాదాపు ఇరవై  సంవత్సరాల క్రితం తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు జరిపించిన వైనం గుర్తొస్తూ ఉంటుందామెకు. అప్పటికే ఈ బఫే సంస్కృతి బాగా చొచ్చుకుని వచ్చేసింది. "కాలానుగుణంగా మనమూ మారాలి" అని  భర్త ఎంత చెప్తున్నా, వినక పట్టుబట్టి ఖర్చు ఎక్కువైనా సరే అని కుర్చీలు,  బల్లలు వేయించి భోజనాల ఏర్పాటు చేయించింది తను.
   ఇది ఒక్క రేవతి అనుభవమే కాదు, ఈ రోజుల్లో ఎక్కువ శాతం జనాలది కూడా. మరీ ముఖ్యంగా వయసు మీద పడ్డ వాళ్లది. ఎదురుగా లెక్కలేనన్ని వంటకాలు నోరూరిస్తూ  ! పళ్లెం నిండా రకరకాల రుచులు ! కానీ తినడానికి మాత్రం నోచుకోలేని స్థితి ! 
 ఆత్రంలో తోసుకుంటూ ప్లేటు పట్టుకుని క్యూలో నిలబడ్డం ! ఒకేసారి అన్ని ఐటమ్స్ పెట్టించుకోలేరుగా! ఒకసారితో  అయిపోదు మరి! మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాల్సిరావడం !ఇబ్బందే!
  ఏ మనిషైనా మూడు రకాలు తినగలడు... నాలుగు రకాలు తినగలడు... అన్నేసి  రకాలు తినడం అంటే సాధ్యం కాదు. అయినా సరే..గొప్పల కోసం  పదుల సంఖ్యలో వంటకాలు  చేయించడం..! తినే దాని కన్నా వృధాయే  ఎక్కువ ఇలాంటి చోట ! 
    ఒకప్పుడు పంక్తి భోజనాలు ఎంత సౌకర్యంగా ఉండేవి! బల్లలు, కుర్చీలు వేసి వడ్డించే రోజులు ఆనవాలు లేకుండా కనుమరుగైపోయాయి. వందలాది జనాలున్నా బఫేనే... యాభై, అరవై మందున్నా బఫేనే!
   ఒక్కోసారి రేవతికి అనిపిస్తూ ఉంటుంది... ఎంతో ఆలోచించి, మరెంతో ఖర్చుపెట్టి ఇన్నేసి రకాలు చేయించడంలో ఉన్న ఆసక్తి, శ్రద్ధ... వచ్చిన అతిథులు తృప్తిగా తినేలా చేయడంలో కూడా చూపిస్తే ఎంత బాగుంటుందో కదా  అని..! అయినా  ఎవరి బాధలు వాళ్ళవి! ఎవరి ఇబ్బందులు, సమస్యలు వాళ్ళవి ! దీనికీ  ఎన్నో కారణాలు ఉంటాయి మరి! 
     స్థలం తక్కువ ఉండడం, అంతమందికీ వడ్డించేవారు లేకపోవడం.. ఇంకా భోజనాల తంతు త్వరగా అయిపోతుందనుకోవడం -- ఇలాంటివి ఎన్నో!
 నిజం చెప్పొద్దూ ! కొందరికి రేవతి లాగే ఎంచక్కా కూర్చుండబెట్టి వడ్డించాలనే  ఉంటుంది... కానీ పై కారణాల వల్ల వాళ్లూ ఆ కోరికను అణిచేసుకుని, 
"నలుగురితో పాటు నారాయణా" అనుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం ! సర్దుకుపోవాలిగా ! మారిన కాలంతో పాటు మారుతున్న పద్ధతుల్నీ ఆహ్వానించాల్సిందే ! తప్పదు. లేదా... ఇదో ఇబ్బందిగా భావించేవారు పార్వతమ్మ గార్ని'ఫాలో'అయిపోతేసరి!
పేచీయే ఉండదు !!అంతేగా ! 😊😊😊

                      ***************

               🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷














1 comment:

  1. నిన్న మొన్నట్లో ఏదైనా పెళ్ళికి వెళ్ళి వచ్చారేమిటండి 🙂? బఫే భోజనాల గురించిన ఈ పోస్ట్ గతంలోనే పెట్టినట్లున్నారుగా?

    మన బ్లాగుశోషే గానీ అవేమీ మారవు.

    ReplyDelete