Sunday, June 20, 2021

She & periods..... ఓ షార్ట్ ఫిల్మ్ చూశాక....

   కొద్ది రోజుల క్రితం అనుకోకుండా ఓ షార్ట్ ఫిల్మ్ చూశాను. అనుకోకుండా అని  ఎందుకంటున్నానంటే స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూడటం కొద్దికాలంగా బాగా తగ్గించేశాను. అయిష్టతతో కాదు, నా కంటి చూపు గురించీ, ఇంకా నా శారీరక ఆరోగ్యం గురించీ ఆందోళనతో!  అందుకే రోజులో  ఏ కొద్ది సమయమో దాని కై కేటాయించేశాను. అలా... ఓ మధ్యాహ్నం తీరిక దొరికి యూట్యూబ్ తిప్పుతూ ఓ చోట ఆగిపోయాను. అదో షార్ట్ ఫిల్మ్. చూడడం మొదలెట్టాక చివరిదాకా వదలకుండా ఎంతో ఆసక్తిగా చూసేశాను. 
    నలుగురున్నపుడు మాట్లాడుకోవడానికి కూడా సంశయించే, బిడియపడే  ఓ విషయం ! పైగా స్త్రీలకు సంబంధించిన సున్నితమైన విషయం కథావస్తువుగా తీసుకోవడం ఓ విశేషమైతే, దానికి దృశ్యరూపమిచ్చిన రచయిత, నిర్మాత, దర్శకుడు -- ముగ్గురూ మగవారే కావడం మరో గొప్ప విశేషమని నేను అభిప్రాయపడుతున్నాను. వారికి అభినందనలు చెప్పక తప్పదు.
 ఇంతకీ, ఆ షార్ట్ ఫిలిం -- she & periods. 
 విషయంలోకెళ్తే -- మూడే మూడు పాత్రలు-- భార్య, భర్త, ఓ సహోద్యోగి -- కేవలం పదినిమిషాల వ్యవధి -- అంతే ! క్లుప్తంగా చెప్పాలంటే --
 🌹భర్త సిద్ధు ఆఫీసుకు బయలుదేరుతూ, భార్యనేదో  అడిగితే ఆమె చిరాగ్గా సమాధానమిస్తుంది. దేనికి అంత కోపంగా ఉన్నావంటే " నేనేమీ కోపంగా లేను"అని ఇంకా  చిరాగ్గా అంటుంది. ఎందుకలా ఉన్నావంటే " ఏమీ లేదు " అంటుంది విసుగ్గా. సరేనంటూ అతను బయటికెళ్ళిపోతాడు. దారిలో అతని కొలీగ్ కోసం ఆగి, " నిన్నెందుకు ఆఫీస్ కు రాలేదు, వచ్చిఉంటే నిన్ననే పని పూర్తయేది కదా, " అంటాడు. 
" రమ్యకు పర్సనల్ ప్రాబ్లెమ్, తనని వదిలి రావాలనిపించలేదు, " అంటాడతను. 
   దాంతో అకస్మాత్తుగా సిద్ధు కేదో స్ఫురిస్తుంది. అతని పెదాలపై చిరునవ్వు ! వెంటనే బైక్ కొలీగ్ కిచ్చేసి, పరిగెత్తుకుంటూ ఇంటికెళ్తాడు. దారిలో, కేర్ ఫ్రీ పాకెట్, భార్య కిష్టమైన చాక్లెట్స్ కొని పట్టుకెళ్తాడు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని లాలనగా మాట్లాడతాడు. 
" ఎప్పుడైతే ఏమైందీ అని అడిగితే మీరేమీ చెప్పరో అప్పుడే అర్థం చేసుకోవాలంట, అమ్మ చెప్పింది..."
అంటూ వాళ్ళమ్మ స్త్రీ సమస్య గురించి చెప్పిన మాటలు ఆమెతో పంచుకుంటాడు. ఇంకా --

"... మీరింత బాధ ఎలా భరిస్తారు? మాకు అసలు ఏమీ తెలీదు. తెలిసేసరికి జీవితకాలం పూర్తయిపోతుంది.." అంటాడు.🌺
  తక్కువ పదాలతో హృదయాన్ని హత్తుకునే  విధంగా విషయాన్ని వ్యక్తీకరించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. నటించిన ఇద్దరూ తమ సహజ హావభావాలతో సన్నివేశాన్ని హృద్యంగా పండించారు. ఎవరా అని ఆసక్తిగా  టైటిల్స్ చూశాను. పవన్ సిద్ధు & సోనియా సింగ్.
   అభిరుచి కలిగిన చలన చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల ద్వారా జనాలకు ఏదో ఒక సందేశాన్ని తరచూ అందజేస్తుంటారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో కూడా నేటి పెళ్లికాని యువకులకు, ( అయిన వాళ్లకు కూడా ) ఓ చక్కటి సందేశం అంతర్లీనంగా ఉంది.
   పీరియడ్స్ అన్నది అనారోగ్యం కాదు. కానీ, ఆ రోజుల్లో శారీరకంగా ఆమెకు విశ్రాంతి అవసరం. ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే  -- ఓవైపు విశ్రాంతి కరువై, మరోవైపు పని ఒత్తిడి ఎక్కువై ఫలితంగా కోపం, అసహనం, చిరాకు అన్నీ తోడై ఆమెను వేధిస్తుంటాయి. అందుకేనేమో, పూర్వపు రోజుల్లో తాక రాదంటూ దూరంగా ఉంచేవాళ్లు. ఇది మూఢాచారమని కొట్టి పారేస్తుంటారు. కానీ స్త్రీ మానసిక స్థితి పట్ల అవగాహనతో అలా చేసేవారనిపిస్తుంది. 
      పెళ్లి కావలసిన యువకులు ఇలాంటి వీడియోలు చూస్తే కొందరిలో నైనా భార్య పట్ల ఆలోచన మొదలయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ, అమ్మాయిలు చూడ్డం వల్ల ఓ ప్రమాదమూ లేకపోలేదండోయ్ ! తనకు రాబోయే భర్త కూడా ఇంత ' కేరింగ్ ' గా ఉండాలంటూ ఆమె ఆశించిందంటే పాపం ఆ ' పిచ్చి పిల్ల' పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే, అందరికీ అలాంటి పతిదేవుడు దొరకడు గాక దొరకడు!  మానసిక పరిపక్వత గల్గిన అమ్మాయిలు అర్థం చేసుకోగలిగితే ఓకే. అలాంటి మగవాళ్ళు  మొత్తం మీద ఏ ఐదు శాతమో ఉండొచ్చు ! ఇంటిపనీ, వంట పనీ అంతా ఎంతో ఓపిక చేసుకుని ముగించి, అన్నీ టేబుల్ పై సిద్ధం చేసి పెడితే కనీసం ఆమె ముఖంలోని అలసట నైనా గుర్తించక, 
" ఏమిటీ, ఈరోజు వంటిలా తగలడిందీ... " అనే పురుష పుంగవులూ లేకపోలేదు. ఇలాంటి వీడియోస్ వల్ల కొద్ది శాతం మగవాళ్లయినా మార్పు దిశగా ఆలోచించవచ్చేమో !అదే జరిగితే ఇలాంటి వీడియోలు తీసిన ప్రయోజనం సిద్దించినట్లే !
    షార్ట్ ఫిల్మ్ ద్వారా చక్కటి ఆలోచనకు ప్రాణం పోసిన నిర్వాహకులకు, నటీనటులకు మరోసారి అభినందనలు. 
 ఇకపోతే -- 
ఈ వీడియో అలా చూశానో లేదో వెంటవెంటనే ఇదే కోవకు చెందిన మరికొన్ని వీడియోలు ఇతర భాషలవి కూడా టపటపా మంటూ వచ్చి పడిపోయాయి ! అది వేరే విషయం !

********************************************
                  🌺 భువి భావనలు 🌺
********************************************











No comments:

Post a Comment