Monday, February 12, 2024

ఓటుకు నోటు ( చిన్న కథ )


🌷

    సాయంత్రం  ఆరు దాటిపోయింది. శీతాకాలం. చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి. ఆఫీసులో పని ఒత్తిడి వల్ల ఈ రోజు కాస్త ఆలస్యం అయిపోయింది. అదిగో, ఆ మలుపు తిరిగి నాలుగడుగులు వేస్తే మా ఇల్లు. ఆటో దిగి వడివడిగా నడుస్తున్న నేను సరిగ్గా మలుపు దగ్గర ఠక్కున ఆగిపోయాను. అటువైపు చివర కొన్ని గుడిసెల్లో చిన్నాచితక పనులు చేసుకునే వాళ్లు కాపురముంటున్నారు. ఈ రోజెందుకో అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. సాధారణంగా పదిమంది కూడారంటే కలకలం రేగుతుంది. అలాంటిది ఎందుకో ఈ రోజు అక్కడ వాతావరణం చాలా గంభీరంగా ఉంది. సహజమైన కుతూహలంతో విషయం ఏమై ఉంటుందా అన్న ఆలోచనతో ఓ క్షణం ఆగిపోయాను. ఇంతలోనే మరో ఐదారుగురు గుంపుగా నా ముందు నుండే అటువైపు వెళ్లిపోయారు. నాలో మరింత ఆత్రుత! అక్కడికైతే వెళ్ళలేను, కానీ, తెలుసుకోవాలన్న ఉత్సుకత ! ఏం చేయాలో పాలుబోక అటూ ఇటూ దృష్టి సారించాను. సరిగ్గా అప్పుడే భాగ్యమ్మ హడావుడిగా వస్తూ కనిపించింది. తను మా వెనక వీధిలో మూడిళ్లలో పాచి పనులు చేస్తూ ఉంటుంది. అవసరమున్నా లేకున్నా కల్పించుకుని మాట్లాడే రకం. ఆ గుడిసెల్లో ఒకదాంట్లో ఆమె నివాసం. నేను నిలబడ్డం చూసి, 

" ఏందమ్మా, నిలబడి పోయావు? "అని అడిగేసింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయి, 

" ఆ, ఏమీ లేదు, అక్కడేదో జనాలు గుంపులుగా ఉంటే ఏమిటాని చూస్తున్నాను. " అన్నా. ఖచ్చితంగా ఆమె నుండి ' ఇన్ఫర్మేషన్ ' లభిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇక్కడుండే మూడు నాలుగు వీధుల సమాచారమంతా ఈ కాలనీకంతా డప్పు వేసేది ఈ భాగ్యమే కనక! 

" అదా, ", అంటూ, నాకు దగ్గరగా జరిగి,"ఎలచ్చన్లు గదమ్మా, పార్టీవోల్లు గుడిసెలోళ్ళకి డబ్బులు పంచుతున్నార్లెండి. నిన్న సాయంత్రం వేరే పార్టీవోల్లు పంచెల్లారు. ఈరోజు వీళ్లు. రేపు ఇంకొకరు కూడా రావచ్చేమో మరి!.... " అంది చేతులూపుకుంటూ. 

' అదేంటీ? ' అన్నా విస్తుబోతూ. 

" అవునమ్మా, ఈళ్ళు పోటీలుబడి ఇస్తా ఉండారు మరి!"

' ఎంతేమిటీ? '

 నాకు మరింత దగ్గరగా జరిగి గుసగుసగా అన్నట్లు చేతి వేళ్ళు ఐదు చూపించింది. ఇంకా దగ్గరగా జరిగి, 

" ఈళ్ళు ఇంకాస్త ఎక్కువిచ్చినా ఇస్తారు..." అంది. 

" అదేమిటి, అందరి వద్దా తీసుకుని ఓటెవరికేస్తారట? 

నాది అమాయకత్వమనుకుందేమో లోపల, పైకి మాత్రం

" భలేగుండావమ్మా, అదిసెప్తారా ఏంటి? మా లెక్కలు మాకు ఉంటాయ్ మరి ! అయినాలచ్చింతల్లి నేరుగా ఇంట్లోకి నడిసొస్తావుంటే ఎల్లిపొమ్మంటారామ్మా ఎవరైనా? " 

 ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన నన్ను సూటిగా చూడకుండా,

"....పోతానమ్మ, నా ఇంట్లో అయిదు ఓట్లుండాయ్ మరి !జల్దీ ఎల్లాలి... " 

 అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.

     కొద్దిరోజులుగా ఆనోటా ఈనోటా ఈ వార్త చెవిని బడుతూనే ఉంది. కానీ ఇంత బాహాటంగా చూస్తున్నది ఇప్పుడే. చూస్తుండగానే అటూ ఇటూ దారుల నుండి పదిహేను మంది దాకా గబగబా నడుచుకుంటూ అటువైపే వెళ్ళిపోయారు. నిట్టూర్పు విడిచి ఇంటి దారి పట్టాను. 

   రాత్రి పడుకున్నానన్న మాటే గానీ సాయంత్రం జరిగినదే పదేపదే గుర్తొస్తూ ఓ పట్టాన నిద్ర పట్టడం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజా నాయకులన్న వాళ్లకు స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా తమకు నచ్చిన వారికీ, నిజాయితీపరులకూ ఓట్లేసి గెలిపించేవారట ! అలా ఎన్నుకున్న వారే నిస్వార్ధంగా తమ సమస్యల్ని పట్టించుకుంటారన్న కొండంత నమ్మకం వాళ్లపై ఉండేదని విన్నాను. రాను రాను పరిస్థితి దారుణంగా మారిపోయి కేవలం అధికారం కోసమే పదవులాశించే వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడేమో ఈ పెనుమార్పు! ఇంటింటికీ డబ్బులు పంచి ఓట్లను కొనేసుకోవడం ! పోనీ, అలా డబ్బిచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే! అన్ని పార్టీల వద్దా తీసుకోవడం తీరా ఆ సమయానికి వాళ్ల నిర్ణయం ప్రకారం వాళ్ళు అనుకున్న వాళ్లకు వేసేయడం! మరి ఇచ్చేవాళ్ళ నమ్మకమేమిటో అర్థం కాదు. ఇది కేవలం పేదలకూ, నిరక్షరాస్యులకు మాత్రమే పరిమితం కావడం లేదు. కొద్దో గొప్పో చదువుకుని అవగాహన ఉన్న వాళ్లు కూడా ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారంటే ' ఔరా' అనిపిస్తుంది. ఫలితం! ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సాధ్యం అన్న రీతిగా మారిపోయింది. అలాంటప్పుడు నిజాయితీకి స్థానమెక్కడ? 

  మరి ఇలా ఓట్లను నోట్లతో కొనడం ఎంతవరకూ భావ్యం? ఈ వ్యవస్థ ఇలా భ్రష్టుపట్టి ఇలాగే కొనసాగుతూ పోతే రేపటి భవితవ్యం ఏమిటి? జవాబైతే దొరక లేదు గానీ, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్ర లోకి మాత్రం జారిపోయాను.

******************************************

       



No comments:

Post a Comment